[1] యెహోవా పరిపాలన చేస్తున్నాడు. జనాలు వణికిపోతాయి. ఆయన కెరూబులకు పైగా సింహాసనాసీనుడు. భూమి కదిలిపోతుంది.
[2] సీయోనులో యెహోవా గొప్పవాడు. ఆయన సర్వలోక ప్రజలకు ఉన్నతంగా ఉన్నాడు.
[3] నీ పేరు గొప్పది, భయభక్తులు కొలుపుతుంది. వారు దానిని స్తుతిస్తారు. యెహోవా పవిత్రుడు.
[4] న్యాయమంటే ఎంతో ఇష్టమున్న రాజును నీ నిజాయితీని బట్టి సుస్థిరంగా నిలబెట్టావు. యాకోబుప్రజలపట్ల నీవు ధర్మాన్ని, న్యాయాన్ని జరిగించావు.
[5] మన దేవుడైన యెహోవాను ఘనపరచండి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడండి. ఆయన పవిత్రుడు.
[6] ఆయన యాజులలో మోషే, అహరోను ఉన్నారు. ఆయన పేరెత్తి ప్రార్థించేవారిలో సమూయేలు ఉన్నాడు. వారు యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు ఆయన జవాబిచ్చాడు.
[7] మేఘస్తంభంలో నుంచి ఆయన వారితో మాట్లాడాడు. వారు ఆయన శాసనాలను అనుసరించారు. ఆయన తమకు ప్రసాదించిన ధర్మశాస్త్రాన్ని పాటించారు.
[8] యెహోవా, మా దేవా, నీవు వారికి జవాబిచ్చావు. వారిపట్ల నీవు పాపక్షమాపణ ప్రదర్శించే దేవుడివి. అయినా వారి అక్రమకార్యాలకు ప్రతీకారం చేశావు.
[9] మన దేవుడు యెహోవా పవిత్రుడు గనుక మన దేవుడు యెహోవాను ఘనపరచండి. ఆయన పవిత్ర పర్వతం ఎదుట సాష్టాంగపడి ఆరాధించండి.