Skip to content
Opens in a new window

[1] దేవా, నన్ను రక్షించు! నీళ్ళు నా ప్రాణం మీదికి ముంచుకు వస్తున్నాయి.

[2] లోతైన దొంగ ఊబిలో నేను దిగబడిపోతున్నాను, నిలవలేకపోతున్నాను. లోతైన నీళ్ళలో పడిపొయ్యాను నేను. వరదలు నన్ను ముంచివేస్తున్నాయి.

[3] సహాయంకోసం పిలిచి పిలిచి అలసిపొయ్యాను. నా గొంతు ఆర్చుకుపోయింది. నా దేవునికోసం చూచి చూచి నా కండ్లు చివికిపొయ్యాయి.

[4] నిష్కారణంగా నన్ను ద్వేషించేవాళ్ళు నా తల వెంట్రుకల సంఖ్యను మించి ఉన్నారు. నన్ను చంపాలని చూచేవాళ్ళు ఎంతోమంది. అబద్ధాల ఆధారంగా నాకు పగవారయ్యారు వారు. నేను అపహరించనిది ఇవ్వవలసివచ్చింది.

[5] దేవా, నా మూర్ఖత్వం నీకు తెలుసు. నా అపరాధాలు నీకు తెలియనివి కావు.

[6] ప్రభూ! సేనల ప్రభువైన యెహోవా! నీ కోసం ఎదురు చూచేవాళ్ళకు నామూలంగా ఆశాభంగం కలగనియ్యకు. ఇస్రాయేల్‌ప్రజల దేవా! నిన్ను వెదికేవాళ్ళకు నామూలంగా అవమానం కలగకుండా చూడు.

[7] నీకోసం నేను నిందపాలయ్యాను. నీకోసమే నా ముఖమంతా సిగ్గు ఆవరించింది.

[8] నా సోదరులకే నేను పరాయివాణ్ణయిపొయ్యాను. నా తల్లి కొడుకులకే నేను పరదేశిలాగా ఉన్నాను.

[9] నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినివేసింది. నిన్ను నిందించేవాళ్ళు మోపిన నిందలకు నేను గురి అయ్యాను.

[10] ఉపవాసముండి నా ప్రాణం పోయేటంతగా ఏడ్చాను. ఇదంతా నా మీద నింద అయింది.

[11] గోనెపట్ట కట్టుకొన్నాను నేను. వాళ్ళకిది ఎగతాళి!

[12] గుమ్మం దగ్గర కూర్చునేవాళ్ళు నన్ను గురించి కబుర్లాడుకొంటారు. త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడుతారు.

[13] నేనైతే నీకు ప్రార్థన చేస్తున్నాను, యెహోవా. అనుకూల సమయంలో నాకు జవాబివ్వు. దేవా, నీ అపార అనుగ్రహంవల్ల, నీ రక్షణ సత్యాన్ని బట్టి నాకు జవాబివ్వు.

[14] ఈ దొంగ ఊబిలో నేను దిగబడిపోకుండా చూడు. ఇందులో నుంచి నన్ను తప్పించు. నా పగవాళ్ళ బారినుంచి, ఈ లోతైన నీళ్ళలోనుంచి నన్ను తప్పించు.

[15] ఈ వరదలు నామీదుగా పొర్లిపారనియ్యకు. ఈ అగాధం నన్ను మింగివేయకుండా చూడు. నాశనకరమైన గుండం నోట నన్ను పడనియ్యకు.

[16] యెహోవా, నీ అనుగ్రహం గొప్పది. నాకు జవాబివ్వు. నీ వాత్సల్య సమృద్ధిని బట్టి నా వైపు తిరుగు.

[17] నీ సేవకుడనైన నాకు నీ ముఖం కనబడకుండా చెయ్యకు. నేను కష్టాలలో ఉన్నాను. నాకు త్వరగా జవాబివ్వు.

[18] నాకు దగ్గరగా రా, విడుదల చెయ్యి. నా శత్రువులను చూచి, మరీ నన్ను విడిపించు.

[19] నాకు కలిగిన నింద, సిగ్గు, అవమానం నీకు తెలుసు. నా విరోధులంతా నీ ఎదుటే ఉన్నారు.

[20] నిందలచేత నా గుండె బ్రద్దలైపోయింది. నేనెంతగానో క్రుంగిపొయ్యాను. జాలికోసం నేను చూచినా జాలిపడేవాడెవడూ లేడు. ఓదార్చేవాళ్ళ కోసం చూచినా ఎవడూ కనబడలేదు.

[21] వాళ్ళు చేదు పదార్థాన్ని నాకు ఆహారంగా పెట్టారు. నాకు దాహమైతే పులిసిన ద్రాక్షరసం తాగడానికి ఇచ్చారు.

[22] వాళ్ళ బల్ల వాళ్ళకు ఉరి అవుతుంది గాక! వాళ్ళు నిర్భయంగా ఉన్నప్పుడు అది వాళ్ళకు బోను అవుతుంది గాక!

[23] వాళ్ళు చూడలేకపోయేలా వాళ్ళ కండ్లకు చీకటి కమ్ముతుంది గాక! వాళ్ళ నడుములు గజగజ వణికిపోతూ ఉంటాయి గాక!

[24] నీ ఆగ్రహం వాళ్ళ మీద కుమ్మరించు! నీ కోపాగ్ని వాళ్ళను పట్టుకొంటుంది గాక!

[25] వాళ్ళ స్థలం పాడైపోతుంది గాక! వాళ్ళ డేరాలలో ఒక్కడూ మిగలకుండా పోతాడు గాక!

[26] నీవు మొత్తినవాణ్ణి వాళ్ళు హింసిస్తున్నారు. నీ చేత గాయాలు పడ్డవారి వేదనగురించి వాళ్ళు కబుర్లు చెప్పుకొంటున్నారు.

[27] వాళ్ళ అపరాధాలు ఒకదానికొకటి చేరి, వృద్ధి కానియ్యి. నీ న్యాయంలో వారు పాలిభాగస్తులు కాకుండా చూడు.

[28] జీవగ్రంథంలో నుంచి వాళ్ళను తుడిచివెయ్యి. న్యాయవంతుల జాబితాలో వాళ్ళ పేర్లు రాయకు.

[29] నేను బాధ అనుభవిస్తున్నాను, వేదనపాలయ్యాను. దేవా, నీ రక్షణ నన్ను పైకి ఎత్తుతుంది గాక!

[30] దేవుని పేరును గేయ రూపంలో స్తుతిస్తాను. కృతజ్ఞత అర్పిస్తూ ఆయనను ఘనపరుస్తాను.

[31] ఇలా చేయడం ఎద్దును, కొమ్ములూ డెక్కలూ ఉన్న దూడను అర్పించడంకంటే యెహోవాకు ఇష్టం.

[32] దీనదశలో ఉన్న భక్తులు ఇది చూచి ఆనందిస్తారు. దేవుణ్ణి వెదికేవారలారా, మీ హృదయం కొత్తగా బ్రతుకుతుంది గాక!

[33] అక్కర గల వాళ్ళ మొర యెహోవా వింటాడు. తన ఖైదీలను ఆయన అలక్ష్యం చేయడు.

[34] ఆకాశం, భూమి ఆయనను స్తుతిస్తాయి గాక! సముద్రాలూ, వాటిలో చలించే ప్రాణులన్నీ ఆయనను స్తుతిస్తాయి గాక!

[35] దేవుడు సీయోనును సంరక్షిస్తాడు. ఆయన యూదాలో పట్టణాలను కట్టిస్తాడు. వారు అక్కడ కాపురం ఉంటారు. అది వారిదే అవుతుంది.

[36] దేవుని సేవకుల సంతానం దానిని వారసత్వంగా పొందుతారు. ఆయన పేరును ప్రేమించేవారే అందులో ఉంటారు.

కీర్తనలు — Chapters