Skip to content
Opens in a new window

[1] యెహోవా, నీ బలంలో ఈ రాజు ఆనందిస్తున్నాడు. నీ రక్షణానుభూతిలో అతడికెంతో ఉల్లాసం.

[2] అతడి హృదయాభిలాష నీవు ఈడేర్చావు. అతడి పెదవుల మీదుగా వచ్చిన మనవిని నీవు తోసిపుచ్చలేదు. (సెలా)

[3] దివ్యమైన ఆశీస్సులతో నీవు అతణ్ణి సందర్శిస్తున్నావు. అతడి తల మీద మేలిమి బంగారు కిరీటం ఉంచావు.

[4] ఆయువు ప్రసాదించుమని అడిగాడు. నీవు దానిని అతడికి దయ చేశావు. దీర్ఘాయువు శాశ్వత జీవాన్ని ఇచ్చావు.

[5] నీ రక్షణమూలంగా అతడికి ఎంతో మహత్వం కలిగింది. ఘనత, ప్రభావం అతడికి కట్టబెట్టావు.

[6] నీవతడికి శాశ్వతమైన ఆశీస్సులు ప్రసాదిస్తున్నావు. నీ సన్నిధానంలో అతణ్ణి ఆనందభరితుణ్ణి చేస్తున్నావు.

[7] ఎందుకంటే, రాజు యెహోవా మీద నమ్మకం ఉంచుతున్నాడు. సర్వాతీతుడి అనుగ్రహం చేత అతడు దృఢంగా నిలుస్తాడు.

[8] నీవు నీ శత్రువులందరినీ చేజిక్కించుకుంటావు. నీ కుడిచేతితో నిన్ను ద్వేషించేవాళ్ళను పట్టుకుంటావు.

[9] నీవు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళను అగ్నిగుండంలాగా చేస్తావు. కోపంతో యెహోవా వాళ్ళను నాశనం చేస్తాడు. మంట వాళ్ళను దహించివేస్తుంది.

[10] వాళ్ళ సంతానం అంటూ భూమి మీద లేకుండా అందరినీ ధ్వంసం చేస్తావు. వాళ్ళ సంతతి వాళ్ళు ప్రజలమధ్య లేకుండా చేస్తావు.

[11] ఎందుకంటే నీకు కీడు చేయాలని వాళ్ళు కుట్ర పన్నారు, దురాలోచన చేశారు. అయితే దానిని సాధించలేరు.

[12] నీవు విల్లు ఎక్కుపెట్టి వాళ్ళ ముఖాలకు గురి చూస్తావు. వాళ్ళు వెనక్కు తిరిగేలా చేస్తావు.

[13] యెహోవా! నీ మహత్తు మూలంగా ఉన్నతంగా ఉండు. నీ బలప్రభావాలను గురించి సంకీర్తనం చేసి స్తుతిస్తాం.

కీర్తనలు — Chapters