Skip to content
Opens in a new window

[1] యెహోవా! హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తాను. నీ అద్భుత క్రియలన్నిటినీ ప్రసిద్ధి చేస్తాను.

[2] నీ విషయంలో నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను. సర్వాతీతుడా, నీ పేరును కీర్తిస్తాను.

[3] నీవు నా తరఫున న్యాయం తీర్చావు. సింహాసనం మీద కూర్చుని ధర్మసమ్మతంగా తీర్పు చేశావు.

[4] కనుక నా శత్రువులు వెనక్కు మళ్ళుతారు; నీ సమక్షంలో వాళ్ళు తొట్రుపడి కూలుతారు.

[5] ఇతర జనాలను నీవు ఖండించావు. దుష్టులను సంహారం చేశావు. వాళ్ళ పేరు ఇకెన్నడూ ఉండకుండా తుడుపు పెట్టావు.

[6] శత్రువులు పూర్తిగా నాశనమైపొయ్యారు. వాళ్ళ పట్టణాలను పెళ్ళగించి పారవేశావు. అవి నాశనమై ఇక జ్ఞప్తికి రావు.

[7] యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన తన సింహాసనాన్ని న్యాయ విచారణ కోసం సిద్ధం చేశాడు.

[8] ఆయన ధర్మ సమ్మతంగా లోకానికి తీర్పు తీరుస్తాడు. జనాలకు సమదృష్టితో న్యాయం తీరుస్తాడు.

[9] హింసకు గురయిన ప్రజకు యెహోవా శరణ్యం. కష్ట సమయాలలో ఆయనే వారికి శరణ్యం.

[10] యెహోవా, నిన్ను వెదకేవారిని నీవు విడిచిపెట్టలేదు, గనుక నిన్ను ఎరిగినవారు నీమీద నమ్మకం ఉంచుతారు.

[11] సీయోనులో ఉంటున్న యెహోవాను కీర్తించండి. ఆయన చర్యలను ప్రజలమధ్య చాటించండి.

[12] రక్తపాతాన్ని గురించి ఆయన విచారణ చేస్తాడు. ఆయనకిది జ్ఞాపకమే. దీన దశలో ఉన్నవారి విలాపం కూడా ఆయన మరిచిపోడు.

[13] నన్ను కరుణించు, యెహోవా! నా పగవాళ్ళు నన్ను పెట్టిన బాధను చూడు!

[14] నీ మహాత్యాన్నంతా సీయోను కుమారి ద్వారాల దగ్గర నేను చాటించేలా మరణ ద్వారాలనుంచి నన్ను పైకి లేవనెత్తేవాడవు నీవు. నీవు ప్రసాదించిన ముక్తినిబట్టి అక్కడ ఆనందంతో గంతులు వేస్తాను.

[15] ఇతర జనాలు తాము త్రవ్విన గోతిలో అడుగున పడిపొయ్యాయి. వాళ్ళు ఒడ్డిన వలలోనే వాళ్ళ కాళ్ళు తగులుకొన్నాయి.

[16] యెహోవా న్యాయం జరిగించి తనను తెలియజేసుకొన్నాడు. దుర్మార్గులు తమ చేతులతో చేసుకొన్న దానిలో చిక్కుకొన్నారు. (సెలా. హీగాయోన్‌)

[17] దుర్మార్గులూ, దేవుణ్ణి మరచిపోయే ప్రజలూ మృత్యులోకంలో పడిపోతారు.

[18] అక్కరలో ఉన్నవారిని దేవుడు ఎప్పుడూ మరచిపోయేవాడు కాదు. దీనదశలో ఉన్నవారి ఆశాభావం ఎల్లకాలం నెరవేరకుండా ఉండదు.

[19] యెహోవా, లే! మనుషులను గెలవనియ్యకు! జనాలకు నీ సమక్షంలో తీర్పు జరుగుతుంది గాక!

[20] యెహోవా! వాళ్ళకు భయం పుట్టించు. జనాలు తాము మానవ మాత్రులమేనని గుర్తిస్తాయి గాక! (సెలా)

కీర్తనలు — Chapters