[1] నేను హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతలు అర్పిస్తాను. దేవుళ్ళు నాకు ఎదురుగా ఉన్నప్పుడు కూడా నేను నిన్ను సంకీర్తనం చేసుకుంటాను.
[2] నీ పవిత్రాలయం వైపు వంగి నిన్ను ఆరాధిస్తాను. నీ పేరు ప్రతిష్ఠలన్నిటికంటే నీ వాక్కును గొప్ప చేశావు. నీ అనుగ్రహం, సత్యం కారణంగా నీ పేర కృతజ్ఞతలు అర్పిస్తాను.
[3] నేను నీకు ప్రార్థన చేసిన రోజున నీవు నాకు జవాబిచ్చావు. నాకు అంతరంగంలో బలం, ధైర్యం ప్రసాదించావు.
[4] యెహోవా, భూరాజులంతా నీ నోటనుంచి వచ్చిన వాక్కులు వినేటప్పుడు నీకు కృతజ్ఞతలు అర్పిస్తారు.
[5] యెహోవా ఘనత గొప్పదని వాళ్ళు యెహోవా విధానాలను గురించి పాటలు పాడుతారు.
[6] యెహోవాది ఉన్నత స్థానం. అయినా ఆయన అణగారిపోయినవారిని కటాక్షిస్తాడు. ఆయన దూరం నుంచే గర్విష్ఠులను పసికడతాడు.
[7] నేను కష్టాలలో చిక్కుకొన్నప్పుడు నీవు నన్ను బ్రతికిస్తావు. నీ చెయ్యి చాపి, నా శత్రువుల కోపంనుంచి నన్ను తప్పిస్తావు. నీ కుడి చెయ్యివల్ల నన్ను రక్షిస్తావు.
[8] యెహోవా నా పక్షంగా పని కొనసాగిస్తాడు. యెహోవా, నీ అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. నీవు కుడి చేతితో స్వయంగా చేసినది విడిచిపెట్టకు.