[1] యెహోవా, నా మనసు నీ వైపుకే ఎత్తుతున్నాను.
[2] నా దేవా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నాకు ఆశాభంగం కలగనియ్యకు, నా శత్రువులను నా విషయం ఉప్పొంగనియ్యకు.
[3] నీకోసం నమ్మకంతో ఎదురు చూచేవారు ఏ మాత్రం ఆశాభంగానికి గురి కారు. నిష్కారణంగా ద్రోహం చేసే వాళ్ళకే ఆశాభంగం కలుగుతుంది.
[4] నీ త్రోవలేవో నాకు తెలియజేయి. నీ విధానాలేవో వివరించి చెప్పు.
[5] నేను నీ సత్యాన్ని అనుసరించేలా చేసి నాకు ఉపదేశించు. ఎందుకంటే నీవు నన్ను రక్షించే దేవుడవు. నీకోసమే నేను ఎల్లప్పుడూ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను.
[6] యెహోవా, నీ వాత్సల్యమూ అనుగ్రహమూ శాశ్వతమైనవి. వాటిని జ్ఞాపకం ఉంచుకో.
[7] బాల్యంలో నేను చేసిన తప్పిదాలూ, నా అక్రమ కార్యాలూ జ్ఞాపకం ఉంచుకోవద్దు. నీ అనుగ్రహం ప్రకారం, యెహోవా, నీ మంచితనం కారణంగా నన్ను గుర్తుంచుకో.
[8] యెహోవా మంచివాడు, యథార్థవంతుడు, గనుక తన మార్గాన్ని పాపులకు ఉపదేశిస్తాడు.
[9] వినయంగలవారికి న్యాయసమ్మతంగా దారి చూపుతాడు. వారికి తన మార్గాన్ని ఉపదేశిస్తాడు.
[10] యెహోవా ఒడంబడికనూ శాసనాలనూ పాటించే వారిపట్ల ఆయన పద్ధతులన్నీ దయతో, విశ్వసనీయతతో నిండి ఉన్నాయి.
[11] యెహోవా, నా అపరాధం చాలా ఘోరమైనది. అయినా నీ పేరు ప్రతిష్ఠల కోసం దానిని క్షమించు.
[12] యెహోవా పట్ల భయభక్తులు గల మనిషికి ఆయన శ్రేష్ఠమైన మార్గాన్ని ఉపదేశిస్తాడు.
[13] అలాంటివాడు హాయిగా బతుకుతాడు. అతడి సంతానం దేశానికి వారసులవుతారు.
[14] యెహోవా అంటే భయభక్తులున్న వారే ఆయన రహస్య సత్యాలు గ్రహిస్తారు. ఆయన తన ఒడంబడికను వారికి స్పష్టం చేస్తాడు.
[15] నా కళ్ళు యెహోవా వైపే చూస్తాయి. ఆయనే నా పాదాలను వలలో నుంచి తప్పిస్తాడు.
[16] నేను ఒంటరివాణ్ణి, బాధితుణ్ణి గనుక నా వైపు ఇటు చూడు. కరుణించు.
[17] నా హృదయంలో బాధలు ఎక్కువయ్యాయి. ఇబ్బందులలో నుంచి నన్ను విడిపించు.
[18] నా దురవస్థ, ఆయాసం గమనించి, నా పాపాలన్నీ క్షమించు.
[19] నా శత్రువులు చూడు ఎంతమందో! వాళ్ళు దౌర్జన్యం, విద్వేషం నా మీద వెళ్ళగ్రక్కుతున్నారు.
[20] నన్ను కాపాడు, రక్షించు. నన్ను సిగ్గుపాలు కానియ్యకు. నిన్ను నమ్మి ఆశ్రయించాను గదా!
[21] నిజాయితీ, యథార్థత నన్ను కాపాడుతాయి గాక! ఎందుకంటే నీకోసమే ఎదురు చూస్తున్నాను.
[22] దేవా, ఇస్రాయేల్‌ప్రజల అగచాట్లన్నీటిలో నుంచి వారిని విడిపించు!