[1] ప్రభూ! తరతరాలుగా నీవే మాకు నివాస స్థానం.
[2] పర్వతాలు ఉనికిలోకి రాకముందే భూమిని, లోకాన్ని నీవు సృష్టించకముందే నీవే దేవుడివి, శాశ్వతుడైన దేవుడివి.
[3] నీవు మనుషులను మన్ను చేస్తావు. “మనుషులారా, తిరిగి రండి!” అంటావు.
[4] నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గతించినప్పుడు అదంతా నిన్నటి రోజులాగా ఉంది. అది రాత్రి జాము గతించినట్టే ఉంటుంది.
[5] వరదలో కొట్టుకుపోయినవారిలాగా వారిని నీవు తీసుకుపోతావు. వాళ్ళు నిద్రపోతారు. పొద్దున మొలిచే గడ్డిపరకలాగా ఉన్నారు వారు.
[6] ఉదయం అది మొలుస్తుంది, పెరుగుతుంది. సాయంకాలం అది వాడిపోతుంది, ఎండిపోతుంది.
[7] మేము నీ కోపం చేత హరించుకుపోతున్నాం. నీ కోపాగ్ని మాకు ఎంతో భయం కలిగిస్తూ ఉంది.
[8] మా అపరాధాలను నీ ఎదుట పెట్టుకొన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతూ ఉన్నాయి.
[9] నీ ఆగ్రహం భరిస్తూ మా రోజులన్నీ గడుపుతున్నాం. మా జీవిత కాలమంతా నిట్టూర్పులు విడిచినట్టే గడిచిపోతుంది.
[10] మా ఆయుష్కాలమంతా కలిపితే డెబ్భై ఏళ్ళు, అంతగా బలం ఉంటే ఎనభై సంవత్సరాలు. వాటిలో శ్రేష్ఠమైనవి కూడా ప్రయాస, బాధ, మా సంవత్సరాలు ఇట్టే గతించిపోతాయి. మేము శీఘ్రంగా దాటుకుంటాం.
[11] నీ కోపం ఎంత తీవ్రమో ఎవరికి తెలుసు? నీకు చెందవలసిన భయభక్తుల ప్రకారం నీ ఆగ్రహం ఎంతో ఎవరికి తెలుసు?
[12] మాకు జ్ఞానం గల హృదయం కలగాలి. అందుచేత మా రోజులు సరిగా లెక్కపెట్టుకోవడం మాకు నేర్పు.
[13] యెహోవా, మా దగ్గరికి తిరిగి రా! ఎంత కాలం ఇలా రాకుండా ఉంటావు? నీ సేవకుల విషయం పరితపించు.
[14] ఉదయకాలంలోనే నీ అనుగ్రహంతో మాకు తృప్తి చేకూర్చు. అప్పుడు మేము బ్రతికినన్ని రోజులు ఆనందిస్తాం, ఉల్లసిస్తాం.
[15] నీవు మమ్మల్ని దీనావస్థలో ఉంచిన కాలం కొలది, మేము కీడును చూచిన ఏళ్ళకొలది మేము సంతోషించేలా చెయ్యి.
[16] నీ పని నీ సేవకులకు కనబడనియ్యి. వారి సంతానంమీద నీ ఘనత కనబడనియ్యి.
[17] మా దేవుడైన యెహోవా మనోహరత్వం మనమీద ఉంటుంది గాక! మేము చేసిన పనిని నీవే సుస్థిరం చెయ్యి. మేము చేసే పనిని సుస్థిరం చెయ్యి.