[1] యెహోవా మహత్తు గల దేవుడు. మన దేవుని నగరంలో, ఆయన పవిత్ర పర్వతం మీద ఆయన అధిక స్తుతిపాత్రుడు.
[2] సీయోను పర్వతం ఎత్తైనది, అందమైనది. అది లోకమంతటికీ ఆనందదాయకం. ఆ నగరం ఉత్తర దిక్కున ఉంది. అది మహారాజు పట్టణం.
[3] దేవుడు ఆశ్రయంగా ఉన్నాడని ఆ నగర భవనాలలో తెలిసిన విషయమే.
[4] ఎలాగంటే రాజులు సమకూడారు, కలిసి కట్టుగా వచ్చారు.
[5] వాళ్ళు ఈ నగరాన్ని చూడగానే విభ్రాంతి చెందారు అత్యంత భయంతో పారిపొయ్యారు.
[6] అక్కడ వాళ్ళు గజగజ వణికిపొయ్యారు. ప్రసవ వేదనలాంటి బాధ వాళ్ళకు పట్టింది.
[7] దేవా, నీవు తూర్పుగాలి వీచేలా చేసి, తర్షీష్‌ఓడలు బ్రద్దలు చేశావు.
[8] మనం విన్న విషయాలలాంటివే ఇక్కడ జరిగాయి. సేనల ప్రభువు యెహోవా పట్టణంలో, మన దేవుని నగరంలో వాటిని చూశాం. ఈ నగరం ఎప్పటికీ సుస్థిరంగా ఉండేలా చేస్తాడు దేవుడు. (సెలా)
[9] దేవా, నీ ఆలయంలో ఉండి నీ అనుగ్రహాన్ని మేము ధ్యానించాం.
[10] దేవా, నీ పేరులాగే నీ ప్రఖ్యాతి భూమి కొనలకు వ్యాపించి ఉంది. నీ కుడి చేతినిండా న్యాయం ఉంది.
[11] న్యాయసమ్మతమైన నీ తీర్పుల కారణంగా సీయోను పర్వతం ఆనందిస్తుంది. యూదాలో ఉన్న గ్రామాలు సంతోషిస్తాయి.
[12] సీయోను నగరం చుట్టూ నడవండి. అలా ప్రదక్షిణం చేస్తూ దాని బురుజులెన్నో లెక్కపెట్టండి.
[13] కోట గోడలను బాగా చూడండి. దాని భవనాలను పరిశీలించండి. ఇదంతా రాబొయ్యే తరంవారికి చెప్పగలిగేలా ఆవిధంగా చెయ్యండి.
[14] ఎందుకంటే, ఇక్కడున్న దేవుడే శాశ్వతంగా మన దేవుడు. మనం మృతి పొందేవరకు ఈయన మనకు మార్గదర్శి.