[1] యెహోవా ఉపదేశం అనుసరించి నిర్దోషంగా నడుచుకొనేవారు ధన్యజీవులు.
[2] ఆయన శాసనాల ప్రకారం ప్రవర్తిస్తూ, హృదయ పూర్తిగా ఆయనను వెదికేవారు ధన్యజీవులు.
[3] వారు ఆయన త్రోవలలో నడుచుకుంటారు, ఏ విధమైన అక్రమమూ చెయ్యరు.
[4] నీ ఆదేశాలను తప్పకుండా పాటించాలని నీవు వాటిని ఆజ్ఞాపించావు.
[5] అహో! నీవు నియమించిన చట్టాలను అనుసరించడానికి నా ప్రవర్తన సుస్థిరంగా ఉంటే ఎంత బావుండేది!
[6] నీ ఆజ్ఞలన్నిటినీ నేను పట్టించుకొనేటప్పుడు నాకు ఆశాభంగమేమీ కలగదు.
[7] న్యాయాన్ని గురించిన నీ నిర్ణయాలను నేను నేర్చుకొంటూ, యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను.
[8] నేను నీ చట్టాల ప్రకారం బ్రతుకుతాను. నన్ను పూర్తిగా విడిచిపెట్టకు.
[9] యువకులు తమ ప్రవర్తనను దేనిని బట్టి శుద్ధి చేసుకోగలరు? నీ వాక్కును ఆచరించడం ద్వారానే గదా!
[10] హృదయపూర్తిగా నిన్ను వెదికాను. నన్ను నీ ఆజ్ఞలు జవదాటనియ్యకు.
[11] నీకు విరోధంగా తప్పిదమేమీ చేయకుండేలా నీ వాక్కు నా హృదయంలో పదిలం చేసుకొన్నాను.
[12] యెహోవా, నీవు స్తుతికి పాత్రుడవు. నీ చట్టాలు నాకు ఉపదేశించు.
[13] నీ నోటినుంచి వెలువడ్డ న్యాయ నిర్ణయాలన్నీ నా పెదవులతో వివరించి చెపుతాను.
[14] నీ శాసనాలను అనుసరించడం నాకు సంతోషం. అది నాకు ఐశ్వర్యమంతా లభించినట్టే!
[15] నీ నియమాలను నేను తలపోసుకుంటాను. నీ విధానాలను గౌరవంతో చూస్తాను.
[16] నీ చట్టాలను బట్టి నేను ఆనందిస్తాను. నీ వాక్కు నేను మరచిపోను.
[17] నీ సేవకుడైన నేను బ్రతికి ఉండేలా దయ చూపు. నీ వాక్కుప్రకారం జీవిస్తాను.
[18] నేను ఆశ్చర్యం గొలిపే విశేషాలను నీ ఉపదేశంలో చూచేలా నాకు కనువిప్పు కలిగించు.
[19] ఇహలోకంలో నేను పరాయివాణ్ణి. నా నుంచి నీ ఆజ్ఞలను దాచిపెట్టకు.
[20] నీ న్యాయ నిర్ణయాలమీద నాకు ఎప్పుడూ ఉన్న ఆశతో నా ప్రాణం తపించిపోతూ ఉంది.
[21] గర్విష్ఠులమీద కోపపడుతావు నీవు. నీ ఆజ్ఞలు జవదాటేవారు శాపగ్రస్తులు.
[22] నీ శాసనాల మేరకు నేను బ్రతికాను. నింద, తిరస్కారం నా మీదనుంచి తొలగించు.
[23] అధికారులు సమకూడి నాకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. నీ సేవకుడైన నేను నీ చట్టాలను గురించే తలపోస్తూ ఉంటాను.
[24] నీ శాసనాలు నాకు సంతోష కారణాలు. అవి నాకు ఆలోచనకర్తలుగా ఉన్నాయి.
[25] నా ప్రాణం మట్టికి అంటుకుపోయింది. నీ వాక్కు ప్రకారం నన్ను బ్రతికించు.
[26] నా జీవిత విధానాలను గురించి నేను నీకు వివరంగా చెప్పాను. నీవు నాకు జవాబిచ్చావు. నీ చట్టాలు నాకు నేర్పు.
[27] నీ నియమాల విధానం నేను గ్రహించేలా చెయ్యి. నీ అద్భుతాలను నేను ధ్యానించుకొంటాను.
[28] దుఃఖంవల్ల నా ప్రాణం కరిగి నీరైపోయింది. నీ వాక్కు ప్రకారం నన్ను బలపరచు.
[29] మోసకరమైన మార్గంలో నేను వెళ్ళకుండా చెయ్యి. నీ ఉపదేశం నాకు ప్రసాదించు.
[30] సత్య మార్గం నేను ఎన్నుకొన్నాను. నీ న్యాయ నిర్ణయాలను నా ముందు ఉంచుకొన్నాను.
[31] యెహోవా, నేను నీ శాసనాలను అంటిపెట్టుకొన్నాను. నాకు ఆశాభంగమేమీ కలగనియ్యకు.
[32] నా అంతరంగాన్ని నీవు విశాలం చేసేటప్పుడు, నీ ఆజ్ఞలు చూపెట్టే దారిన నేను పరుగెత్తుతాను. హే
[33] యెహోవా, నీ చట్టాలను పాటించి నడవడానికి నాకు నేర్పు. అప్పుడు అంతంవరకు వాటిని నేను ఆచరిస్తాను.
[34] నీ ఉపదేశం ప్రకారం ప్రవర్తించేందుకు నాకు కావలసిన గ్రహింపు అనుగ్రహించు. అప్పుడు హృదయపూర్వకంగా నేను దానిని ఆచరిస్తాను.
[35] నీ ఆజ్ఞల మార్గంలో నేను నడిచేలా చెయ్యి. అందులో నాకెంతో ఆనందం.
[36] పేరాశవైపు నా హృదయం తిరగకుండా చెయ్యి. నీ శాసనాలవైపు నా హృదయాన్ని తిప్పు.
[37] వ్యర్థమైనవాటినుంచి నా చూపులు మరల్చు. నీ మార్గంలో నన్ను బ్రతికించు.
[38] నీ వాక్కు నీపట్ల భయభక్తులు కలిగిస్తుంది. నీ సేవకుడైన నాకు దానిని సుస్థిరం చెయ్యి.
[39] నీ న్యాయ నిర్ణయాలు శ్రేష్ఠమైనవి. నాకు భయం కలిగించే నా అవమానాన్ని తొలగించు.
[40] నీ ఆదేశాల కోసం నేను తహతహలాడుతూ ఉన్నాను. నీ న్యాయాన్ని బట్టి నన్ను బ్రతకనియ్యి.
[41] యెహోవా, నీ అనుగ్రహం నా మీదికి రానియ్యి. నీ వాక్కు ప్రకారమే నాకు రక్షణ ప్రసాదించు.
[42] అప్పుడు నన్ను తూలనాడేవాళ్ళకు నేను జవాబు చెప్పగలను. ఎందుకంటే నీ మాటంటే నాకు నమ్మకం.
[43] నీ సత్య వాక్కును పూర్తిగా నా నోట్లో లేకుండా చేయకు. నీ న్యాయ నిర్ణయాల కోసం ఎదురు చూశాను.
[44] ఎల్లప్పుడు నీ ఉపదేశం ప్రకారం ప్రవర్తిస్తాను. శాశ్వతంగా దాని ప్రకారమే నేను బ్రతుకుతాను.
[45] నీ నియమాలకోసం నేను వెదికేవాణ్ణి, గనుక నా ప్రవర్తనలో ఎలాంటి ఇరుకూ ఉండదు.
[46] రాజుల సమక్షంలో అయినా సరే, నీ శాసనాల విషయం చెపుతాను. నేను సిగ్గుపడను.
[47] నీ ఆజ్ఞలను బట్టి నేను సంతోషిస్తాను. అవి నాకెంతో ప్రీతి పాత్రమైనవి.
[48] నాకు ప్రీతిపాత్రమైన నీ ఆజ్ఞలవైపు నా చేతులు ఎత్తుతాను. నీ చట్టాల విషయమే నేను తలపోసుకుంటూ ఉంటాను.
[49] నీ సేవకుడైన నాకు నీవిచ్చిన మాట తలచుకో. దాని మూలంగా నాకు ఆశాభావం కలిగేలా చేశావు.
[50] నా దీనావస్థలో నా ఆదరణ ఇదే: నీ వాక్కు నన్ను బ్రతికించింది.
[51] గర్విష్ఠులు నన్ను అత్యంతగా వేళాకోళం చేశారు. అయినా సరే, నీ ఉపదేశంనుంచి నేను వైదొలగకుండా ఉన్నాను.
[52] యెహోవా, పూర్వకాలం నుంచి ఉన్న నీ న్యాయ నిర్ణయాలను జ్ఞాపకం చేసుకొని, నన్ను నేను ఓదార్చుకొన్నాను.
[53] నీ ఉపదేశాన్ని విసర్జించే దుర్మార్గుల కారణంగా నాకు ఎంతో ఆందోళన.
[54] నేను పరదేశిగా ఉన్న నా నివాసంలో నీ చట్టాలు నాకు పాటలయ్యాయి.
[55] యెహోవా, రాత్రిపూట నేను నీ పేరును గురించి తలచుకుంటాను. నీ ఉపదేశం ప్రకారం ప్రవర్తిస్తున్నాను.
[56] నీ ఆదేశాలను ఆచరిస్తున్నాను. ఇదే నాకు లభించిన భాగ్యం.
[57] యెహోవా, నీవే నా వాటా. నీ వాక్కుకు అనుగుణంగా ప్రవర్తిస్తానని నేను మాట ఇచ్చాను.
[58] నన్ను కటాక్షించమని హృదయపూర్వకంగా నిన్ను బతిమాలుతున్నాను. నీ వాక్కు మేరకు నన్ను దయ చూడు.
[59] నా విధానాలను నేను పరిశీలన చేసుకొన్నాను. నీ శాసనాలవైపు నేను తిరిగాను.
[60] నీ ఆజ్ఞలను శిరసావహించడానికి ఆలస్యం చేయకుండా త్వరగా సిద్ధమయ్యాను.
[61] దుర్మార్గుల బంధకాలు నా చుట్టూ ఉన్నాయి. అయినా, నీ ఉపదేశాన్ని నేను మరిచిపోయేవాణ్ణి కాను.
[62] మధ్యరాత్రిలో నిద్ర మేల్కొని, న్యాయసమ్మతమైన నీ నిర్ణయాల కారణంగా నీకు కృతజ్ఞతలు అర్పిస్తాను.
[63] నీవంటే భయభక్తులున్న వారందరికీ, నీ ఆదేశాలను పాటించేవారందరికీ నేను మిత్రుణ్ణి.
[64] యెహోవా, ఈ లోకమంతా నీ అనుగ్రహంతో నిండి ఉంది. నీ చట్టాలు నాకు నేర్పు.
[65] యెహోవా, నీ సేవకుడైన నాకు మేలు చేశావు. అది నీ మాట ప్రకారమే.
[66] నీ ఆజ్ఞలను నేను నమ్మాను. నాకు శ్రేష్ఠమైన జ్ఞానం, వివేచనం నేర్పు.
[67] నాకు బాధ రాకముందు త్రోవ తప్పాను నేను. ఇప్పుడు నీ వాక్కు ప్రకారం నడుచుకొంటున్నాను.
[68] నీవు మంచివాడివి. మేలు చేస్తున్నావు. నీ చట్టాలు నాకు నేర్పు.
[69] గర్విష్ఠులు నా విషయం అబద్ధం కల్పించారు. అయితే, హృదయపూర్వకంగా నేను నీ ఆదేశాలను పాటిస్తాను.
[70] వాళ్ళ గుండె కొవ్వెత్తి మందగించింది. నేను నీ ఉపదేశాన్ని బట్టి ఆనందిస్తున్నాను.
[71] బాధలు అనుభవించడం నాకు మేలైనది దానివల్ల నేను నీ చట్టాలు నేర్చుకొన్నాను.
[72] వేలకొలది వెండి నాణేలు, బంగారు నాణేలకంటే నీ నోటి ఉపదేశం నాకు శ్రేష్ఠం.
[73] నీ చేతులతో నన్ను చేశావు, రూపొందించావు. నీ ఆజ్ఞలను నేర్చుకొనేలా నాకు గ్రహింపు ప్రసాదించు.
[74] నీ వాక్కుకోసం ఆశతో ఎదురు చూశాను. నీవంటే భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషిస్తారు.
[75] యెహోవా, నీ నిర్ణయాలు న్యాయ సమ్మతమైనవని నాకు తెలుసు. నీ విశ్వసనీయతను అనుసరించి నన్ను బాధపెట్టావని తెలుసు.
[76] నీ సేవకుడైన నాకు ఇచ్చిన మాటప్రకారం నీ అనుగ్రహం నన్ను ఆదరిస్తుంది గాక!
[77] నీ ఉపదేశం నాకు ఆనందదాయకం. నేను బ్రతికేలా నీ వాత్సల్యం నా మీదికి వస్తుంది గాక!
[78] నేను నీ నియమాలను ధ్యానం చేసుకుంటాను. గర్విష్ఠులు అబద్ధం కల్పించి నాకు కీడు చేశారు. వాళ్ళకు సిగ్గు కలుగుతుంది గాక!
[79] నీవంటే భయభక్తులు గలవారు, నీ శాసనాలు తెలిసినవారు నా వైపుకు వస్తారు గాక!
[80] నేను సిగ్గుపడవలసిన అవసరం ఉండకుండేలా నా హృదయం నీ ఆదేశాల విషయంలో నిర్దోషంగా ఉంటుంది గాక!
[81] నీవు చేసే విడుదలకోసం నా ప్రాణం ఆశతో నీరసించిపోతూ ఉంది. నీ వాక్కుమీదే ఆశ పెట్టుకొన్నాను.
[82] నన్ను నీవెప్పుడు ఆదరిస్తావో అని నీ వాగ్దానాలకోసం ఎదురు చూస్తూ నా కండ్లు చీకి చివికిపొయ్యాయి.
[83] పొగలో వ్రేలాడుతున్న ద్రాక్షతిత్తిలాగా ఉన్నాను. అయినా, నీ చట్టాలను నేను మరిచిపోవడం లేదు.
[84] నీ సేవకుడైన నేను ఎన్నాళ్లు బ్రతుకుతాను? నన్ను హింసించేవాళ్ళకు ఎప్పుడు శిక్ష విధిస్తావు?
[85] నీ ధర్మశాస్త్రానికి లోబడని గర్విష్ఠులు నన్ను చేజిక్కించుకోవడానికి గుంటలు తవ్వారు.
[86] వారు నిష్కారణంగా నన్ను హింసిస్తారు. నీ ఆజ్ఞలన్నీ నమ్మతగ్గవి. నాకు సహాయం చెయ్యి.
[87] నన్ను భూమిమీద లేకుండా చేయబూనుకొన్నారు వారు. అపాయం కొంచెంలో తప్పిపోయింది. అయినా నీ ఆదేశాలను నేను విసర్జించలేదు.
[88] నీ నోటి పలుకులు నేను పాటించేలా నీ అనుగ్రహంతో నన్ను బ్రతికించు.
[89] యెహోవా, శాశ్వతంగా నీ వాక్కు పరలోకంలో సుస్థిరంగా నిలిచి ఉంటుంది.
[90] నీ విశ్వసనీయత తరతరాలకూ నిలిచి ఉంటుంది. నీవు భూమిని స్థాపించావు. అది స్థిరంగా ఉంది.
[91] సమస్తమూ నీకు సేవ చేస్తూ ఉంది. నీ నిర్ణయాల ప్రకారమే అవి ఈ రోజువరకు స్థిరంగా ఉండిపోయాయి.
[92] నీ ఉపదేశమే గనుక నాకు ఆనందదాయకం కానిపక్షంలో నేను నా బాధల్లో నాశనమైపోయి ఉండేవాణ్ణే.
[93] నీ ఆదేశాలవల్ల నీవు నన్ను బ్రతికించావు గనుక వాటిని నేనెన్నటికీ మరవను.
[94] నీ ఆదేశాలను నేను వెదికాను. నేను నీ వాణ్ణే. నన్ను రక్షించు.
[95] నన్ను రూపుమాపడానికి దుర్మార్గులు నా కోసం కాచుకొని ఉన్నారు. అయితే నేను నీ శాసనాలను తలపోసుకుంటాను.
[96] పూర్తి అయిన ప్రతిదానికీ పరిమితి ఉందని నేను గ్రహించాను. నీ ఉపదేశం అపారమైనది.
[97] నీ ఉపదేశం నాకెంతో ప్రియం. రోజంతా నేను దానినే ధ్యానిస్తాను.
[98] నీ ఆజ్ఞలు ఎల్లప్పుడూ నాకు తోడు. అవి నాకు కలిగించే జ్ఞానం నా శత్రువులకు మించినది.
[99] నీ శాసనాలు నేను ధ్యానించుకొంటున్నాను. కాబట్టి వివేకంలో నేను నా గురువులందరినీ కూడా మించిపోయాను.
[100] నీ ఆదేశాలను నేను ఆచరించాను. అందుచేత నాకు లభించిన తెలివితేటలు వృద్ధులకు మించినది.
[101] నేను నీ వాక్కు ప్రకారం నడుచుకుందామని ప్రతి చెడ్డ మార్గంనుంచీ నేను వైదొలగాను.
[102] నీవు నాకు జ్ఞానోపదేశం చేశావు. అందుచేత న్యాయ నిర్ణయాలనుంచి నేను తొలగిపోలేదు.
[103] నీ వాక్కులు నా నోటికి ఎంతో మధురంగా ఉన్నాయి. అవి నాకు తేనెకంటే తీపి అనిపిస్తున్నాయి.
[104] నీ ఆదేశాలవల్ల నాకు గ్రహింపు కలుగుతుంది. కనుక అన్ని తప్పు మార్గాలంటే నాకు అసహ్యం.
[105] నీ వాక్కు నా పాదాలకు దీపం, నా త్రోవకు కాంతి.
[106] నీ న్యాయ నిర్ణయాల ప్రకారం బ్రతుకుతానని నేను శపథం చేసుకొన్నాను. నా మాట నిలబెట్టుకుంటాను.
[107] యెహోవా, నాది ఎంత బాధ! నీ వాక్కు ప్రకారం నన్ను బ్రతికించు.
[108] యెహోవా, నా నోటి మీదుగా మనసారా నేను అర్పించేది స్వీకరించు. నీ న్యాయ నిర్ణయాలను నాకు నేర్పు.
[109] నా ప్రాణం ఎడతెరపి లేకుండా అపాయంలో ఉంది. అయినా, నీ ఉపదేశాన్ని నేను మరిచిపోవడం లేదు.
[110] నన్ను చేజిక్కించుకోవాలని దుర్మార్గులు ఉచ్చులు వేశారు. అయినా, నీ ఆదేశాలనుంచి నేను వైదొలగలేదు.
[111] నీ శాసనాలు నా హృదయానికి ఆనందం కలిగిస్తాయి. అవి నాకు శాశ్వత వారసత్వంగా లభించాయి.
[112] అంతంవరకూ, ఎప్పటికీ నీ చట్టాల ప్రకారం ప్రవర్తించడానికి నా హృదయాన్ని నేను అదుపులో ఉంచుకొన్నాను.
[113] చపలచిత్తులంటే నాకు అసహ్యం. నీ ఉపదేశం అంటే నాకు ప్రీతి.
[114] నేను దాగుకొనే చోటు నీవే. నీవు నాకు డాలులాంటివాడివి. నాకు నీ వాక్కుమీద ఆశాభావం ఉంది.
[115] నేను నా దేవుని ఆజ్ఞలను శిరసావహిస్తాను. చెడుగు చేసేవాళ్ళారా, నా దగ్గరనుంచి పోండి!
[116] నేను బ్రతికేలా నీ వాక్కు ప్రకారం నన్ను ఆదుకో. నా ఆశాభావం విషయంలో నాకు సిగ్గు కలగనియ్యకు.
[117] నన్ను పైకెత్తు. అప్పుడు నేను సురక్షితంగా ఉంటాను, నీ చట్టాలను ఎల్లప్పుడూ పాటిస్తాను.
[118] నీ చట్టాల విషయంలో తప్పిపోయినవాళ్ళందరినీ అల్పులుగా ఎంచుతావు. వాళ్ళ కపటం పనికి రాదు.
[119] దుర్మార్గులందరినీ భూమిమీద లేకుండా మురికి చెత్తలా నాశనం చేసేవాడివి నీవు. కనుక నీ శాసనాలంటే నాకు ప్రీతి.
[120] నీ భయంవల్ల నా శరీరం గజగజలాడుతూ వుంది. నీ న్యాయ నిర్ణయాలంటే నాకు భయభక్తులే.
[121] నీతిన్యాయాలను నేను అనుసరిస్తున్నాను. నన్ను బాధించేవాళ్ళ చేతుల్లో నన్ను విడిచిపెట్టకు.
[122] నీ సేవకుడైన నాకు మేలు చేస్తావని నాకు హామీగా ఉండు. గర్విష్ఠులను నాకు బాధ కలిగించనియ్యకు.
[123] నీ రక్షణ కోసం నీ న్యాయ వాక్కుకోసం కనిపెట్టి, కనిపెట్టి, నా కండ్లు చీకిపోయాయి.
[124] నీ సేవకుడైన నా పట్ల అనుగ్రహంతో వ్యవహరించు. నీ చట్టాలను నాకు నేర్పు.
[125] నేను నీ సేవకుణ్ణి. నీ శాసనాలను తెలుసుకొనేందుకు నాకు జ్ఞానం ప్రసాదించు.
[126] ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారు. యెహోవా న్యాయం జరిగించడానికి ఇదే అదను.
[127] బంగారం కంటే, మేలిమి బంగారం కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియం.
[128] నీ ఆదేశాలన్నీ కేవలం యథార్థమని భావించుకుంటున్నాను. తప్పు మార్గాలన్నీ నాకు అసహ్యం.
[129] నీ శాసనాలు ఆశ్చర్యకరమైనవి. అందుకే నేను మనసారా వాటిని ఆచరిస్తాను.
[130] నీ వాక్కులు ప్రవేశించడంతోనే వెలుగు వస్తుంది. అవి తెలివితక్కువ వారికి తెలివితేటలు కలిగిస్తాయి.
[131] నీ ఆజ్ఞలమీద నాకు ఎంతో ఆశ ఉంది. ఆ ఆశచేత నేను నోరు తెరచి రొప్పుతూ ఉన్నాను.
[132] నీ పేరంటే ఎవరికి ప్రేమో, వారిని నీవు దయ చూచినట్టు, నా వైపు తిరిగి, నన్ను దయ చూడు.
[133] నీ వాక్కుకు అనుగుణంగా నా నడతను స్థిరం చెయ్యి. ఏ చెడుగూ నా మీద పెత్తనం చేయకుండా చూడు.
[134] నీ ఆదేశాలను నేను ఆచరించేందుకు మనుషుల దౌర్జన్యం నుంచి నన్ను తప్పించు.
[135] నీ ముఖ కాంతి నీ సేవకుడైన నా మీద ప్రకాశించేలా చెయ్యి. నీ చట్టాలను నాకు నేర్పు.
[136] ప్రజలు నీ ఉపదేశానికి లోబడడం లేదు. అందుచేత నా కన్నీళ్ళు కాలువలై పారుతున్నాయి.
[137] యెహోవా, నీవు న్యాయవంతుడివి. నీ నిర్ణయాలు యథార్థం.
[138] న్యాయాన్నీ, సమగ్ర విశ్వసనీయతనూ అనుసరించి నీ శాసనాలు ఆజ్ఞపూర్వకంగా ఇచ్చావు.
[139] నా విరోధులు నీ వాక్కులు మరిచిపోయారు. కాబట్టి ఆసక్తి నన్ను తినివేస్తూ ఉంది.
[140] నీ వాక్కు మహా పవిత్రం. అది నీ సేవకుడైన నాకు ప్రియం.
[141] నేను అల్పుణ్ణి. తృణీకారానికి గురి అయినవాణ్ణి. అయినా నీ ఆదేశాలను నేను మరిచిపొయ్యే వాణ్ణి కాను.
[142] నీ న్యాయం శాశ్వతమైనది. నీ ఉపదేశం కేవలం సత్యం.
[143] బాధ, వేదన నాకు పట్టుకున్నాయి. అయినా నీ ఆజ్ఞలు నాకు అనందదాయకమైనవి.
[144] నీ శాసనాలలోని న్యాయం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నేను బ్రతికేలా నాకు తెలివితేటలు ప్రసాదించు.
[145] యెహోవా! హృదయపూర్వకంగా నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు జవాబివ్వు. నీ చట్టాలను నేను పాటిస్తాను.
[146] నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. నన్ను కాపాడు. నీ శాసనాలు నేను పాటిస్తాను.
[147] పొద్దు పొడిచేముందే సహాయం కోసం మొరపెట్టేవాణ్ణి. నీ వాక్కంటే నాకు ఆశాభావం.
[148] నీవిచ్చిన వాక్కును ధ్యానించుకోవడానికి రాత్రి జాములు కాకముందే నా కండ్లు తెరచి పెట్టుకొని ఉంటాను.
[149] నీ అనుగ్రహం ప్రకారం నా మొర ఆలకించు. యెహోవా! నీ న్యాయ నిర్ణయాల ప్రకారం నన్ను బ్రతికించు.
[150] ఆతురంగా చెడుగు చేసేవాళ్ళు నాకు దగ్గరగా ఉన్నారు. వాళ్ళు నీ ఉపదేశానికి దూరంగా ఉన్నారు.
[151] యెహోవా! నీవు నా దగ్గర ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యం.
[152] నీ శాసనాలు ఎల్లకాలం నిలిచి ఉండేలా వాటిని సుస్థిరం చేశావు. చాలాకాలం నుంచి వాటివల్లే ఇది తెలుసుకొన్నాను.
[153] నేను నీ ఉపదేశాన్ని మరచే మనిషిని కాను. నా బాధను విచారించి నన్ను విడిపించు.
[154] నా పక్షాన వాదించి నాకు విడుదల కలిగించు. నీ వాక్కు ప్రకారం నన్ను బ్రతికించు.
[155] దుర్మార్గులు నీ చట్టాలు తెలుసుకోవడానికి ప్రయత్నించరు. కనుక వాళ్ళకు రక్షణ ఎంతో దూరం.
[156] యెహోవా! నీ వాత్సల్యత అపారం. నీ న్యాయ నిర్ణయాల ప్రకారం నన్ను బ్రతికించు.
[157] నన్ను హింసించేవాళ్ళు, నా మీద పగపట్టినవాళ్ళు చాలామంది. అయినా నీ శాసనాల నుంచి నేను వైదొలగడం లేదు.
[158] ద్రోహం తలపెట్టేవాళ్ళు నాకు కనిపిస్తున్నారు. వాళ్ళు నీ వాక్కు పాటించరు గనుక వాళ్ళంటే నాకు అసహ్యం.
[159] యెహోవా! నీ ఆదేశాలు నాకెంత అప్యాయమో చూడు. నీ అనుగ్రహం ప్రకారం నన్ను బ్రతికించు.
[160] నీ వాక్కుల మొత్తం సత్యమే. నీ న్యాయ నిర్ణయాలన్నీ ఎల్లకాలం నిలుస్తాయి.
[161] అధికారులు నిష్కారణంగా నన్ను హింసించారు. అయినా నా హృదయంలో నీ వాక్కులంటే భయభక్తులు ఉన్నాయి.
[162] ఎంతో సొమ్ము కొల్లగొట్టుకు వచ్చిన వాడిలాగా నీ వాక్కును బట్టి నేను సంతోషిస్తున్నాను.
[163] అబద్ధం అంటే నాకు అసహ్యం. అదంటే నాకు రోత. నీ ఉపదేశం నాకెంతో ప్రీతి.
[164] నీ న్యాయ నిర్ణయాలను బట్టి రోజుకు ఏడు సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను.
[165] నీ ఉపదేశాన్ని ప్రేమించేవారికి ఎంతో శాంతి. వారు తడబడేలా చేసేదేమీ ఉండదు.
[166] యెహోవా! నీ రక్షణ కోసం నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. నీ ఆజ్ఞలను శిరసావహిస్తున్నాను.
[167] నీ శాసనాల ప్రకారమే నేను ప్రవర్తిస్తున్నాను. అవి నాకెంతో ప్రీతి.
[168] నా విధానాలన్నీ నీ ఎదుటే ఉన్నాయి. కనుక నీ ఆదేశాలను, నీ శాసనాలను అనుసరిస్తున్నాను.
[169] యెహోవా! నా స్వరం నీ సన్నిధానంలో వినబడుతుంది గాక! నీ వాక్కు మేరకు నాకు జ్ఞానం ప్రసాదించు.
[170] నా విన్నపం నీ సన్నిధానంలోకి చేరేలా చెయ్యి. నీ వాగ్దానం ప్రకారం నాకు విడుదల ప్రసాదించు.
[171] నీవు నీ చట్టాలను నాకు నేర్పుతున్నావు. నా పెదవులు నీ కీర్తిని పలుకుతాయి.
[172] నీ ఆజ్ఞలు న్యాయసమ్మతమైనవి. నీ వాక్కు విషయం నా నాలుక గానం చేస్తుంది.
[173] నేను నీ ఆదేశాలు కావాలని కోరాను. నీ చెయ్యి నాకు సహాయం చేస్తుంది గాక!
[174] యెహోవా! నీ రక్షణ కోసం తహతహలాడుతున్నాను. నీ ఉపదేశం నాకెంతో ఆనందదాయకం.
[175] నేను నిన్ను స్తుతించేలా నన్ను బ్రతికించు. నీ న్యాయ నిర్ణయాలు నాకు సహాయం చేస్తాయి గాక!
[176] తప్పిపోయిన గొర్రెలాగా నేను దారి తొలగాను. నీ సేవకుడైన నన్ను వెదుకు! నేను నీ ఆజ్ఞలను మరచేవాణ్ణి కాను.