[1] యెహోవాకోసం నేను ఓర్పుతో ఎదురు చూశాను. ఆయన నావైపు వంగి నా మొర ఆలకించాడు.
[2] వినాశకరమైన గుంటలోనుంచి నన్ను పైకి లాగాడు. బంకమట్టితో నిండి ఉన్న దొంగ ఊబిలోనుంచి తీసి, నా పాదాలను బండమీద నిలబెట్టాడు, నా అడుగులు సుస్థిరం చేశాడు.
[3] ఆయన నా నోట కొత్త పాటను ఉంచాడు. అది మన దేవునికి స్తుతిపాట. అనేకులు ఇది చూచి భయభక్తులు కలిగి యెహోవా మీద నమ్మకం ఉంచుతారు.
[4] గర్విష్ఠులనూ, నమ్మకూడని దానికోసం మార్గం విడిచిన వాళ్ళనూ అనుసరించకుండా యెహోవానే నమ్ముకొన్నవారు ధన్యజీవులు.
[5] యెహోవా! నా దేవా! మాపట్ల నీవు చేసిన అద్భుతాలు, మా విషయంలో నీకున్న భావాలు అనేకం. వాటిని వివరించి చెపుదామనుకొంటే వాటిని లెక్కించడం నా తరం కాదు. నీవు సాటి లేనివాడవు.
[6] బలిని గానీ యజ్ఞాన్ని గానీ నీవు కోరలేదు. నేను నీ మాట వినేలా చేశావు. హోమాలనూ, నైవేద్యాలనూ నీవు కోరలేదు.
[7] అప్పుడు నేనిలా చెప్పాను: “ఇదిగో నేను వచ్చాను. గ్రంథం చుట్టలో నన్ను గురించి వ్రాసి ఉంది.
[8] నా దేవా, నీ సంకల్పం సాధించడమే నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రం నా అంతరంగంలో ఉంది.”
[9] నేను మహా సమావేశంలో న్యాయాన్ని గురించిన శుభవార్త ప్రకటించాను. ఇక నా పెదవులు మూసుకోను. యెహోవా, ఇది నీకు తెలుసు.
[10] నా హృదయంలో ఉన్న నీ న్యాయాన్ని నేనేమీ దాచలేదు. నీ విశ్వసనీయతనూ, నీ విముక్తినీ నేను వెల్లడి చేశాను. నీ అనుగ్రహాన్నీ నీ సత్యాన్నీ మహా సమావేశంలో దాచుకోకుండా బయలుపరచాను.
[11] యెహోవా, నీ వాత్సల్యం నాకు కాకుండా చేయవు. నీ అనుగ్రహమూ నీ సత్యమూ ఎడతెగకుండా నన్ను కాపాడుతాయి.
[12] లెక్క పెట్టలేనన్ని ఆపదలు నన్ను ఆవరించి ఉన్నాయి. నా అపరాధాలు నన్ను అందుకొన్నాయి. నేనేమీ చూడలేకపోతున్నాను. నా అపరాధాలు నా తలవెండ్రుకల కంటే ఎక్కువ. నా గుండె జారిపోయింది.
[13] యెహోవా! దయ చూచి నన్ను విడిపించు! యెహోవా! త్వరగా వచ్చి నాకు సహాయం చెయ్యి.
[14] నా ప్రాణం తీయాలని వెదికేవాళ్ళంతా ఆశాభంగానికీ సిగ్గుకూ గురి అవుతారు గాక! నా దురవస్థను చూస్తామనుకొనే వాళ్ళంతా అవమానంతో వెనక్కు పడుతారు గాక!
[15] నన్ను చూచి “ఆహాహా!” అని గేలి చేసేవాళ్ళు ఆశాభంగం పొంది మ్రాన్పడిపోతారు గాక!
[16] నిన్ను వెదికేవాళ్ళంతా నీ మూలంగా ఆనందభరితులై సంతోషిస్తారు గాక! నీవిచ్చే విముక్తి ఎవరికి ప్రియమైనదో వారంతా “యెహోవా కీర్తి అధికం కావాలి”! అని ఎప్పుడూ అంటారు గాక!
[17] నేను దీనదశలో ఉన్నాను. అక్కరలో ఉన్నాను. అయితే ప్రభువు నా విషయం ఆలోచిస్తాడు. నీవే నా సహాయం, నా విముక్తిదాతవు. నా దేవా! ఆలస్యం చేయకు!