[1] దేవకుమారుల్లారా! యెహోవాకు మహత్తూ, బలమూ ఆరోపించండి. యెహోవాకే అలా ఆరోపించండి.
[2] యెహోవా పేరుకు చెందే మహత్తు ఆయనకు ఆరోపించండి. పవిత్రత అనే అలంకారంతో యెహోవాను ఆరాధించండి.
[3] యెహోవా స్వరం జలనిధి పై వినిపిస్తూ ఉంది. మహిమస్వరూపి అయిన దేవుని స్వరం ఉరుములాగా మారుమోగుతూ ఉంది. యెహోవా మహా జలనిధికి పైగా సంచరిస్తూ ఉన్నాడు.
[4] యెహోవా స్వరం బలం గలది. యెహోవా స్వరం ప్రభావం గలది.
[5] యెహోవా స్వరానికి దేవదారు చెట్లు విరుచుకుపడతాయి. లెబానోను దేవదారు చెట్లను యెహోవా విరిచి ముక్కలు చేస్తాడు.
[6] అవి దూడలాగా, లెబానోను షిర్యోనులను అడవి బర్రెపిల్లలాగా చెంగుచెంగున దూకేలా చేస్తాడాయన.
[7] యెహోవా స్వరం మెరుపు తీగెలను చీల్చివేస్తుంది.
[8] యెహోవా స్వరం ఎడారిని వణికిస్తుంది. యెహోవా కాదేష్‌ఎడారి సీమను వణికిస్తున్నాడు. యెహోవా స్వరం లేళ్ళు ఈనేలా చేస్తుంది.
[9] అది అడవిచెట్ల ఆకులను రాల్చి వేస్తుంది. ఆయన ఆలయంలో ఉన్నదంతా ఆయనకే “మహత్తు” అంటున్నది.
[10] యెహోవా జలప్రళయంమీద సింహాసనాసీనుడయ్యాడు. యెహోవా శాశ్వతంగా మహారాజుగా సింహాసనం మీద కూర్చుని ఉంటాడు.
[11] యెహోవా తన ప్రజానీకానికి బలం ప్రసాదిస్తాడు. యెహోవా తనవారికి శాంతి దీవెనలు అనుగ్రహిస్తాడు.