[1] యెహోవాను గురించి కొత్త పాట పాడండి. ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన కుడిచెయ్యి, ఆయన పవిత్ర హస్తం ఆయనకు విజయం చేకూర్చింది.
[2] యెహోవా తన రక్షణను వెల్లడి చేశాడు. ఇతర ప్రజల ఎదుట తన న్యాయాన్ని బయలుపరచాడు.
[3] ఇస్రాయేల్‌వంశం వారికి తన అనుగ్రహం, విశ్వసనీయత ఆయన జ్ఞాపకముంచుకొన్నాడు. భూమి కొనలన్నిటికీ మన దేవుని రక్షణ కనబడింది.
[4] సర్వలోకమా! యెహోవాకు ఆనంద ధ్వనులు చెయ్యి! ఉద్రేకంతో ఆనంద గీతాలు ఆలపించు! పాటలు పాడు!
[5] తంతి వాద్యంతో యెహోవాకు స్తుతిగీతాలు పాడు! తంతి వాద్యంతో గానం చెయ్యి!
[6] బూరలతో, పొట్టేలు కొమ్ములతో రాజైన యెహోవా ఎదుట ఆనంద ధ్వనులు చెయ్యి!
[7] సముద్రం, దానిలో ఉన్నదంతా హోరుమంటుంది గాక! లోకమూ, లోకప్రజలూ నినాదాలు చేస్తారు గాక!
[8] యెహోవా సన్నిధానంలో నదులు కరతాళ ధ్వనులు చేస్తాయి గాక! ఆనందంతో కొండలన్నీ కలిసి పాడుతాయి గాక!
[9] ఎందుకంటే యెహోవా లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. న్యాయంతో ఆయన లోకప్రజలకు, నిజాయితీతో జనాలకు తీర్పుతీరుస్తాడు.