[1] ఇస్రాయేల్‌ప్రజల కాపరీ, నా మనవిని చెవినిబెట్టు. మందలాగా యోసేపువంశానికి దారి చూపేవాడా, కెరూబులకూ పైగా సింహాసనాసీనుడా, నీ ప్రకాశం కనుపరుచు.
[2] ఎఫ్రాయిం, బెన్యామీన్, మనష్షే గోత్రాల ఎదుట నీ బల ప్రభావాలను ప్రదర్శించు. మమ్మల్ని రక్షించడానికి వేంచేయి.
[3] దేవా, మమ్మల్ని చెరలోనుంచి రప్పించు. మాకు విడుదల లభించేలా నీ ముఖకాంతి రేఖలు ప్రసరించనియ్యి.
[4] యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీ ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే నీవెంతకాలం కోపపడుతావు?
[5] వారికి వారి కన్నీళ్ళే ఆహారమయ్యేలా చేశావు. వారు పెద్ద మోతాదులో కన్నీళ్ళు తాగేలా చేశావు.
[6] మా పొరుగువాళ్ళను మా గురించి పోరాడేలా చేస్తున్నావు. మా శత్రువులు మమ్మల్ని గేలి చేస్తూ ఉన్నారు.
[7] సేనల ప్రభూ, దేవా, మమ్మల్ని చెరలోనుంచి రప్పించు. మాకు విడుదల లభించేలా నీ ముఖకాంతి రేఖలు మా పై ప్రసరించనియ్యి.
[8] నీవు ఈజిప్ట్‌నుంచి ఓ ద్రాక్షచెట్టును తెచ్చావు. ఇతర ప్రజలను తొలగించి దానిని నాటావు.
[9] దానికి నేల సిద్ధం చేశావు. లోతుగా వేరూని అది దేశమంతా వ్యాపించింది.
[10] దాని నీడ కొండలను ఆవరించింది. దాని తీగెలు దేవుని దేవదారు చెట్లను కమ్మాయి.
[11] దాని తీగెలు సముద్రందాకా, దాని రెమ్మలు యూఫ్రటీసు నదివరకు ప్రాకిపోయాయి.
[12] దారిన పొయ్యేవాళ్ళంతా దాని తీగెలు తెంచివేసేలా దాని కంచెలను నీవెందుకు పడగొట్టావు?
[13] అడవిపంది దానిని మేసివేస్తూ ఉంది. పొలంలోని గొడ్డు గోదా దానిని తినివేస్తూ ఉన్నాయి.
[14] సేనలప్రభూ! దేవా! మళ్ళీ రా! పరలోకంనుంచి ఒకసారి ఇటు చూడు! ఈ ద్రాక్షచెట్టును సందర్శించు!
[15] నీవు నీ కుడి చేతితో నాటినదానిని కాపాడు! నీకోసం నీవు పెంచిన చెట్టును కాపాడు!
[16] దానిని కాల్చడం, నరికివేయడం జరిగింది. నీ ముఖంమీది కోప రేఖలు వాళ్ళను నాశనం చేస్తున్నాయి.
[17] నీ కుడిచేతి మనిషిమీద నీ చేయి ఉంచు. నీవు బలపరచిన మానవ పుత్రునిమీద నీ చేయి ఉంచు.
[18] అలాగైతే మేము నీ దగ్గర నుంచి వెనక్కు పోము. మమ్మల్ని బ్రతికించు. అప్పుడు నీ పేరటే ప్రార్థన చేస్తాం.
[19] యెహోవా, సేనల ప్రభువైన దేవా, మమ్మల్ని చెరలోనుంచి రప్పించు. మాకు విడుదల లభించేలా నీ ముఖ కాంతి రేఖలు మాపై ప్రసరించనియ్యి.