[1] యెహోవాకు స్తుతి! ఆయన నాకు ఆధారశిల. ఆయన నా చేతులకు యుద్ధం నేర్పాడు, నా వ్రేళ్ళకు పోరాటం నేర్పాడు.
[2] ఆయన నాకు కృపానిధి. ఆయన నాకు కోట. ఆయనే నా బలమైన దుర్గం, నా రక్షకుడు. నాకు డాలు, నాకు ఆశ్రయం ఆయనే! ఆయన నా ప్రజలను నాకు లోపరచేవాడు.
[3] యెహోవా, నీవు మనిషిని లక్ష్యం చేయడానికి వాడెంతటివాడు? మానవ సంతానాన్ని గురించి ఆలోచించడానికి వాడేపాటివాడు?
[4] మనిషి వట్టి ఊపిరిలాంటివాడు. వాడి రోజులన్నీ దాటిపోయే నీడలాగా ఉన్నాయి.
[5] యెహోవా! నీ ఆకాశాలను చీల్చి కిందికి దిగిరా! పర్వతాలు పొగలు వెళ్ళగ్రక్కేలా వాటిని తాకు.
[6] మెరుపులు మెరిసేలా చేసి శత్రువులను చెదరగొట్టు. నీ బాణాలు వేసి వాళ్ళను ఓడించు.
[7] నీ పైస్థలంనుంచి చెయ్యి చాపు. నన్ను విడిపించు. విస్తార జలాలలోనుంచీ, పరాయివాళ్ళ చేతులలోనుంచీ నన్ను తప్పించు.
[8] వాళ్ళ నోరు వంచన మాటలు పలుకుతుంది. వాళ్ళ కుడి చేతినిండా అబద్ధాలే.
[9] దేవా, నీకు ఒక కొత్త పాట పాడుతాను. పది తంతుల వాద్యంతో నిన్ను సంకీర్తనం చేస్తాను.
[10] నీవే రాజులకు విజయం చేకూరుస్తావు. దుర్మార్గుల ఖడ్గం బారినుంచి నీ సేవకుడైన దావీదును కాపాడుతావు నీవు.
[11] నాకు విడుదల అనుగ్రహించు. పరాయివాళ్ళ బారినుంచి నన్ను తప్పించు. వాళ్ళ నోరు వంచన మాటలు పలుకుతుంది. వాళ్ళ కుడి చేతినిండా అబద్ధాలే.
[12] తమ యువదశలో మా కొడుకులు పెరిగిన మొక్కలలాగా ఉండేలా చెయ్యి. మా కూతుళ్ళు రాచనగరు కోసం చెక్కిన మూలస్తంభాలలాగా ఉండేలా చెయ్యి.
[13] మా కొట్లనిండా రకరకాల ద్రవ్యనిధులు ఉండేలా చెయ్యి. మా పచ్చిక మైదానాలలో మా గొర్రెలు వేలు, పదివేల పిల్లలు ఈనేలా చెయ్యి.
[14] మా ఎద్దులు నష్టం, నాశనం కాకుండా భారాలు మోసేలా చెయ్యి. మా వీధుల్లో ఏడుపు వినబడకుండేలా చెయ్యి.
[15] ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలు ఎంత ధన్యులు! యెహోవా ఏ ప్రజలకు దేవుడో వారు ఎంత ధన్యులు!