[1] దేవా, రాజుకు నీ న్యాయ నిర్ణయాలు ప్రసాదించు. నీ రాకుమారుడికి నీ న్యాయబుద్ధిని అనుగ్రహించు.
[2] ఆయన నీ ప్రజలను న్యాయంతో, నీ దరిద్రులను ధర్మ సమ్మతంగా పరిపాలిస్తాడు.
[3] న్యాయాన్ని బట్టి ప్రజలకు పర్వతాలు, చిన్న కొండలు క్షేమం చేకూరుస్తాయి.
[4] ప్రజలలో దరిద్రులకు రాజు న్యాయం చేకూరుస్తాడు. అక్కరగలవాళ్ళ పిల్లలను రక్షిస్తాడు. ఇతరులను హింసించేవాళ్ళను ఆయన అణగద్రొక్కివేస్తాడు.
[5] సూర్యమండలం, చంద్రగోళం ఉన్నంతకాలం, తరతరాలకూ వారు నీవంటే భయభక్తులు కలిగి ఉంటారు.
[6] గడ్డి కోసిన మైదానంపై కురుసే వానలాగా, భూమికి నీళ్ళు సరఫరా చేసే మంచి వర్షంలాగా ఆయన దిగివస్తాడు.
[7] ఆయన రోజుల్లో న్యాయవంతులకు అభివృద్ధి. చంద్రగోళం గతించేదాకా వాళ్ళకు అఖండ శాంతి.
[8] సముద్రం నుంచి సముద్రందాకా, యూఫ్రటీసు నదినుంచి భూమి కొనలవరకు ఆయన రాజ్యం చేస్తాడు.
[9] ఆయనకు ఎడారి మనుషులు లొంగిపోతారు. ఆయన శత్రువులు నేల మట్టి నాకుతారు.
[10] తర్షీషుప్రాంతం రాజులు, ద్వీపాల రాజులు అర్పణలు తెస్తారు. షెబ, సెబా దేశాల రాజులు కానుకలు అర్పిస్తారు.
[11] రాజులంతా ఆయనకు నమస్కారం చేస్తారు. అన్ని దేశాలవారు ఆయనకు సేవ చేస్తారు.
[12] అక్కరలో ఉండి సహాయంకోసం మొరపెట్టే వారిని ఆయన రక్షిస్తాడు. దరిద్రులను, నిరాధారులను ఆయన విడిపిస్తాడు.
[13] పేదసాదలను, అక్కరగలవాళ్ళను ఆయన జాలితో చూస్తాడు. అక్కరలో ఉన్న వాళ్ళను ఆయన రక్షిస్తాడు.
[14] వారిని హింసనుంచీ, దౌర్జన్యంనుంచీ ఆయన విడుదల చేస్తాడు. ఆయన దృష్టిలో వాళ్ళ రక్తం విలువైనదిగా ఉంటుంది.
[15] ఆయన చిరంజీవి అవుతాడు. షెబ బంగారం ఆయనకు ఇస్తారు. ఆయన కోసం ఎల్లప్పుడూ ప్రార్థనలు జరుగుతాయి. రోజంతా అదేపనిగా ఆయనను స్తుతిస్తారు.
[16] దేశమంతటా, పర్వత శిఖరాల మీద ధాన్య సమృద్ధి ఉంటుంది. లెబానోను అడవి చెట్లలాగా దాని పంట అల్లలాడుతూ ఉంటుంది. పట్టణం ప్రజలు భూమిమీది మొక్కల్లాగా వికసిస్తారు.
[17] ఆయన పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుంది. సూర్యమండలం ఉన్నంత కాలం ఆయన పేరుప్రతిష్ఠలు వృద్ధి అవుతూ ఉంటాయి. ఆయనమూలంగా అన్ని జనాలకూ ఆశీస్సులు కలుగుతాయి. వారు ఆయనను ధన్యుడని చెప్పుకొంటారు.
[18] యెహోవాకు స్తుతి! ఆయనే దేవుడు, ఇస్రాయేల్‌ప్రజల దేవుడు. అద్భుత కార్యాలు ఆయన మాత్రమే చేయగలడు.
[19] ఆయన ఘనమైన పేరుకు శాశ్వతంగా స్తుతి కలుగుతుంది గాక! భూమి అంతా ఆయన మహిమతో నిండి ఉంటుంది గాక! తథాస్తు! తథాస్తు!
[20] (యెష్షయి కుమారుడైన దావీదు ప్రార్థనలు సమాప్తం.)