Skip to content
Opens in a new window

[1] నేను మౌనంగా దేవునిపై నమ్మకంతో ఎదురు చూస్తున్నాను. ఆయనమూలంగానే నాకు రక్షణ కలుగుతుంది.

[2] ఆయనే నాకు ఆధారశిల. నాకు రక్షణ ఆయనే. ఆయనే నాకు ఎత్తయిన కోట. నన్ను ఏదీ ఎక్కువగా కదిలించదు.

[3] ఎంత కాలమని మీరంతా ఈ ఒకే మనిషి మీదికి ఎగబడతారు? ఎంత కాలం మీరు అతణ్ణి పడగొట్టాలని చూస్తారు? అతడు అసలే ప్రక్కకు ఒరిగిన గోడలాంటివాడు. కూలిపోయే కంచెలాగా ఉన్నాడు.

[4] అతడు పైకి వచ్చిన స్థానంనుంచి అతణ్ణి ఎలా పడలాగాలా అని వాళ్ళ ఆలోచన. వాళ్ళకు అబద్ధాలంటే ఎంతో ఇష్టం. నోట్లో దీవెనలూ, హృదయంలో శాపనార్థాలూ అదీ వాళ్ళ తంతు. (సెలా)

[5] మనసా! మౌనంగా దేవుని వైపే నమ్మకంతో ఎదురు చూడు! ఆయన మూలంగానే నాకు ఆశాభావం కలుగుతుంది.

[6] ఆయనే నాకు ఆధారశిల. నాకు రక్షణ ఆయనే. ఆయనే నాకు ఎత్తయిన కోట – నన్నేదీ కదిలించదు.

[7] నా విముక్తి, నా మహత్యం దేవునిమీదే ఆధారపడి ఉన్నాయి. ఆయనే నాకు ఆశ్రయం.

[8] జనులారా! అన్ని సమయాల్లోనూ ఆయన్నే నమ్ముకోండి! ఆయన ఎదుట మీ హృదయాలు కుమ్మరించుకోండి! దేవుడు మనకు ఆశ్రయ స్థానం! (సెలా)

[9] మనిషి సంతానం పనికిమాలినవాళ్ళు. ఘనులు కూడా అబద్ధం రూపొందినవాళ్ళు. త్రాసులో వాళ్ళను తూకం వేస్తే వాళ్ళ సిబ్బి తేలిపోతుంది. వాళ్ళంతా ఊపిరికంటే తేలిక మనుషులు.

[10] దౌర్జన్యంలో మీ నమ్మకం ఉంచకండి. దోపిడీలు చేస్తూ విర్రవీగకండి. ధనం ఎక్కువైతే దానిమీద ఆధారపడకండి.

[11] దేవుడు ఒక సంగతి చెప్పాడు. దానిని రెండు సార్లు విన్నాను. “బలప్రభావాలు దేవునికే చెంది ఉన్నాయి” అనేదే ఆ మాట.

[12] ప్రభూ! అనుగ్రహం కూడా నీదే. మనుషులందరికీ వాళ్ళ క్రియల ప్రకారం ప్రతిఫలం ఇచ్చేది నీవే.

కీర్తనలు — Chapters