Skip to content
Opens in a new window

[1] యెహోవా, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. నా దగ్గరికి త్వరగా రా! నేను ప్రార్థించడంతోనే నావైపు వంగి చెవిని బెట్టుకో!

[2] నా ప్రార్థన నీకు ధూపంలాగా అంగీకారంగా ఉంటుంది గాక! నేను చేతులెత్తడం సాయంకాల నైవేద్యంలాగా అంగీకారమవుతుంది గాక!

[3] యెహోవా, నా నోటికి కావలి ఉంచు, నా పెదవులు అనే ద్వారాన్ని కాపాడు.

[4] చెడుగు చేసేవాళ్ళతో కలవకుండా, వాళ్ళ చెడ్డ క్రియాకలాపాలలో చేరకుండా నా మనసు ఎలాంటి దుర్మార్గానికి తిరగనియ్యకు. వాళ్ళ రుచి గల పదార్థాలు నేను తినకుండా ఉంటాను గాక!

[5] న్యాయవంతులు నన్ను కొడితే అది నాకు దయ చూపినట్టే! వారు నన్ను మందలిస్తే అది నా నెత్తిన నూనె పోసినట్టే! నా తల అలాంటి అభిషేకం నిరాకరించదు. వారి విపత్తులు చూచి వారికోసం ప్రార్థన చేస్తాను.

[6] దుర్మార్గుల న్యాయాధిపతులను రాళ్ళ మధ్యకు పడద్రోయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు నా మాటలు వింటారు. ఎందుకంటే అవి ఇంపైనవి.

[7] ఒక వ్యక్తి భూమిని దున్ని చీరినట్టు మా ఎముకలు మృత్యులోక ద్వారంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

[8] యెహోవా! నా ప్రభూ! నా కండ్లు నీ వైపే చూస్తున్నాయి. నిన్నే నమ్మి ఆశ్రయించాను. నా ప్రాణం తోడెయ్యకు.

[9] నా కోసం వాళ్ళు ఒడ్డిన వలనుంచి నన్ను తప్పించు. చెడుగు చేసే వాళ్ళ ఉచ్చులనుంచి నన్ను కాపాడు.

[10] నేను తప్పించుకుపోతూ ఉండగా దుర్మార్గులు తమ వలల్లో తామే చిక్కుకొంటారు గాక!

కీర్తనలు — Chapters