Skip to content
Opens in a new window

[1] యెహోవా, దావీదునూ అతడి కడగండ్లన్నీ జ్ఞాపకముంచుకో.

[2] అతడు యెహోవాకు ప్రమాణం చేశాడు, యాకోబు యొక్క పరాక్రమశాలి అయిన దేవునికి మొక్కుబడి చేశాడు:

[3] “యెహోవాకు నేను స్థలం చూచేవరకూ యాకోబు యొక్క పరాక్రమశాలి అయిన దేవునికి నివాసం చూచేవరకూ

[4] నేను కాపురమున్న డేరాలో ప్రవేశించను, నా మంచంమీద పడుకోను,

[5] నా కండ్లకు నిద్ర రానియ్యను, నా కను రెప్పలకు కునికిపాట్లు రానియ్యను.”

[6] ఎఫ్రాతాలో విన్నాం. అడవి మైదానంలో అది మనకు దొరికింది.

[7] యెహోవా నివసించే చోటికి వెళ్దాం రండి. ఆయన పాదపీఠం ముందు సాష్టాంగపడుదాం రండి.

[8] యెహోవా, లే! నీ బలానికి సూచకమైన పెట్టెతో నీ విశ్రాంతి స్థానంలో ప్రవేశించు.

[9] నీ యాజులు న్యాయాన్ని వస్త్రంలాగా ధరించుకొంటారు గాక! నీ భక్తులు ఆనంద ధ్వనులు చేస్తారు గాక!

[10] నీ సేవకుడైన దావీదు కోసం నీ అభిషిక్తుణ్ణి నిరాకరించకు.

[11] యెహోవా దావీదుకు నమ్మకమైన ప్రమాణం చేశాడు. ఆయన ఆ మాట తప్పడు. ఏమిటంటే, “నీ సంతానాన్ని నీ సింహాసనం ఎక్కిస్తాను.

[12] నీ కొడుకులు నా ఒడంబడిక పాటిస్తే, నేను వారికి నేర్పే శాసనాలు ఆచరిస్తే, వారి కొడుకులు కూడా ఎప్పటికీ నీ సింహాసనమెక్కుతారు.”

[13] ఎందుకంటే, యెహోవా సీయోనును ఎన్నుకొన్నాడు, దానిని తన నివాసంగా కోరుకొన్నాడు.

[14] “ఇది నేను కోరుకొన్న స్థలం. కనుక ఇది ఎప్పటికీ నా విశ్రాంతి స్థానంగా ఉంటుంది. నేనిక్కడ ఉంటాను.

[15] దానికి ఆశీస్సులు ప్రసాదిస్తూ సమృద్ధిగా ఆహారం లభించేలా చూస్తాను. అందులోని పేదసాదలు తృప్తిగా తినేలా చేస్తాను.

[16] దాని యాజులు విముక్తిని వస్త్రంగా ధరించేలా చేస్తాను. దాని భక్తులు బిగ్గరగా ఆనందధ్వనులు చేస్తారు.

[17] అక్కడే దావీదు వంశానికి శృంగం పైకి వచ్చేలా చేస్తాను. అక్కడే నా అభిషిక్తుని కోసం నేను ఒక దీపం సిద్ధం చేసి ఉంచాను.

[18] ఆయన శత్రువులకు అవమానమే వస్త్రంగా ధరింపజేస్తాను. ఆయన కిరీటం ఆయన మీదే ఉండి ప్రకాశిస్తుంది” అన్నాడు.

కీర్తనలు — Chapters