Skip to content
Opens in a new window

[1] యెహోవాను అన్ని వేళలా కీర్తిస్తాను. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నాపెదవులపై ఉంటుంది.

[2] యెహోవాలో నా ఆత్మ అతిశయిస్తుంది. దీనదశలో ఉన్నవారు దీనిని విని సంతోషిస్తారు.

[3] నాతో కలిసి యెహోవాకు మహత్తు ఆరోపించండి. ఏక స్వరంతో ఆయన పేరును కీర్తిద్దాం.

[4] నేను యెహోవాను సమీపించి ప్రాధేయపడ్డాను. ఆయన జవాబిచ్చి నా భయాలన్నిటిలోనుంచి నన్ను తప్పించాడు.

[5] వారు ఆయనవైపు చూచి ప్రకాశవంతులయ్యారు. వారి ముఖాలు సిగ్గుతో కుంచించుకుపోవు.

[6] దీనదశలో ఉన్న నేను మొరపెట్టినప్పుడు, యెహోవా ఆలకించి అన్ని ఇక్కట్లలో నుంచి నన్ను గట్టెక్కించాడు.

[7] తన పట్ల భయభక్తులు గల వారి చుట్టూరా యెహోవా దూత ఆవరించి ఉండి వారిని రక్షిస్తాడు.

[8] యెహోవా మంచివాడు. ఆయన మంచితనాన్ని రుచి చూచి తెలుసుకో. ఆయనను నమ్మి ఆశ్రయించిన మనిషి ధన్యజీవి.

[9] యెహోవాకు చెందిన పవిత్రమైనవారలారా, ఆయన పట్ల భయభక్తులతో ఉండండి. ఆయనపట్ల భయభక్తులున్నవారికి కొరత అంటూ ఏదీ ఉండదు.

[10] ఏమీ దొరకక సింహం పిల్లలు ఆకలితో ఉంటాయి. కాని, యెహోవాను వెదకి ప్రాధేయపడేవారికి మంచివాటికి లోటు ఉండదు.

[11] పిల్లలారా, వచ్చి నేను చెప్పేది వినండి. యెహోవా పట్ల భయభక్తులు మీకు నేర్పుతాను.

[12] నీవెవరైనా సరే, బ్రతుకు అంటే ఇష్టం ఉండి, మంచిని చూడడానికి చాలా కాలం బ్రతకాలని కోరితే,

[13] నీ నాలుక చెడుగునుంచి కాపాడుకో. నీ పెదవులు మోసంగా పలకకుండా కాపాడుకో.

[14] చెడుగు నుంచి వైదొలగు. మంచినే చేస్తూ ఉండు. శాంతిని వెదకు. దానిని వేటాడు.

[15] యెహోవా దృష్టి న్యాయవంతుల మీద ఉంది. ఆయన చెవులు వారి మొరలు వింటున్నాయి.

[16] యెహోవా ముఖం చెడుగు చేసేవాళ్ళకు విరోధంగా ఉంది. వాళ్ళను గురించిన జ్ఞాపకం భూమిమీద లేకుండా చేస్తాడాయన.

[17] న్యాయవంతులు మొరపెట్టినప్పుడు యెహోవా ఆలకిస్తాడు. వారిని అన్ని ఇక్కట్లలోనుంచి వారిని గట్టెక్కిస్తాడాయన.

[18] విరిగిన హృదయులకు యెహోవా దగ్గరలో ఉన్నాడు. నలిగిపోయిన మనసు గలవారిని ఆయన రక్షిస్తాడు.

[19] న్యాయవంతులకు ఎన్నో ఆపదలు! కాని, యెహోవా వాటన్నిటిలో నుంచి వారిని తప్పిస్తాడు.

[20] అతని ఎముకలన్నిటికి కూడా ఆయన వల్ల క్షేమం! వాటిలో ఒకటైనా విరగదు.

[21] చెడుగు దుర్మార్గులను సంహరిస్తుంది. న్యాయవంతులంటే గిట్టనివాళ్ళకు నాశనం తప్పదు.

[22] యెహోవా తన దాసులను విడుదల చేస్తాడు. ఆయనను నమ్మి ఆశ్రయించినవారిలో ఎవరికీ నాశనం అంటూ ఉండదు.

కీర్తనలు — Chapters