[1] దేవుడు ఎవరి అతిక్రమాలను క్షమించాడో, ఎవరి పాపాలను కప్పివేశాడో వారు ధన్యజీవులు.
[2] యెహోవా ఎవరి అపరాధం లెక్కలోకి తీసుకోడో, ఎవరి మనసులో కల్లాకపటం లేదో వారు ధన్యజీవులు.
[3] నేను మౌనం వహించినప్పుడు, రోజంతా నా మూలుగుల వల్ల నా ఎముకలు సన్నగిల్లిపొయ్యాయి.
[4] రాత్రింబగళ్ళూ నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది. వేసవి కాలంలో నీళ్ళు ఆరిపోయినట్టు నాలో సారం ఇంకిపోయింది. (సెలా)
[5] అప్పుడు నా పాపమేదో నీ దగ్గర ఒప్పుకొన్నాను. నా అపరాధాన్ని నేనేమీ దాచిపెట్టుకోలేదు. యెహోవా సమక్షంలో నా అతిక్రమాలను ఒప్పుకుందామనుకొన్నాను. నీవు నా అపరాధం, నా పాపం క్షమించావు. (సెలా)
[6] గనుక నీవు దొరికే సమయం లో భక్తిగల ప్రతి ఒక్కరూ నిన్ను ప్రార్థిస్తారు గాక! నదులు పొంగి పొరలి వరదలు వచ్చినా అవి వారినేమీ చెయ్యవు.
[7] నేను దాగేస్థలం నీవే. విపత్తునుంచి నన్ను కాపాడుతావు. విడుదల పాటలతో నా చుట్టూరా నీవు ఉంటావు. (సెలా)
[8] “నీవు ఎలా నడుచుకోవాలో నీకు చెపుతాను, ఉపదేశిస్తాను. నా కనుదృష్టి నీ మీద ఉంచి నీకు సలహా చెపుతాను.
[9] నీవు గుర్రంలాగా, కంచర గాడిదలాగా ప్రవర్తించకు. వాటికి తెలివితేటలేమీ ఉండవు. అవి దగ్గరికి రావాలంటే వాటిని కళ్ళెంతో, పగ్గంతో వశం చేసుకోవాలి.”
[10] దుర్మార్గులకు ఎన్నో వేదనలు! యెహోవాను నమ్ముకొన్నవారి చుట్టూరా అనుగ్రహంతో ఆయన ఆవరించి ఉంటాడు.
[11] న్యాయవంతులారా, యెహోవా మూలంగా ఆనందించండి, హాయిగా ఉండండి. అంతరంగంలో నిజాయితీపరులారా, మీరంతా ఆనంద ధ్వనులు చేయండి.