[1] నా దేవా, నా పగవాళ్ళ బారినుంచి నన్ను, తప్పించు. నామీదికి ఎగబడేవాళ్ళనుంచి నన్ను కాపాడు.
[2] చెడుగు చేసే వాళ్ళ బారినుంచి నన్ను తప్పించు. రక్తపాతానికి ఒడికట్టేవాళ్ళ నుంచి నన్ను రక్షించు.
[3] ఇదిగో, నా ప్రాణంకోసం వాళ్ళు పొంచి ఉన్నారు. దౌర్జన్యపరులు నాకు వ్యతిరేకంగా సమకూడారు. యెహోవా, నేను పాపం చేయబట్టి కాదు. నేను అక్రమం చేసినందు చేత కూడా కాదు.
[4] నాలో ఏ అపరాధం లేకపోయినా, వాళ్ళు పరుగెత్తి సంసిద్ధులవుతున్నారు.
[5] నన్ను కలుసుకోవడానికి లే! నా స్థితి చూడు! సేనల ప్రభువైన యెహోవా! దేవా! ఇస్రాయేల్‌ప్రజల దేవా! సర్వలోక ప్రజలను శిక్షించడానికి లే! ద్రోహం తల పెట్టేవాళ్ళలో ఎవరినీ కరుణ చూడకు (సెలా)
[6] సాయంకాలం వాళ్ళు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూరా తిరుగుతూ ఉంటారు.
[7] “ఎవరూ వినడం లేదులే” అనుకొని మాట్లాడుతారు. నోటినుంచి దూషణలు వెళ్ళగక్కుతారు. వాళ్ళ పెదవుల్లో కత్తులు ఉన్నాయి.
[8] యెహోవా, నీవు వాళ్ళను చూచి నవ్వుతావు. సర్వలోక ప్రజలను చూచి నీవు పరిహాసం చేస్తావు.
[9] నీవే నా బలం. నీ కోసమే నేను ఎదురు చూస్తాను. నాకు దేవుడు ఎత్తయిన కోటలాంటివాడు.
[10] అనుగ్రహం చూపి నా దేవుడు నన్ను సమీపించి సహాయం చేస్తాడు. నా పగవాళ్ళ ఓటమిని దేవుడు నన్ను చూడనిస్తాడు.
[11] వాళ్ళను చంపవద్దు! అలా చంపితే నా ప్రజలు ఆ సంగతే మరచిపోవచ్చు. ప్రభూ! మాకు డాలులాంటివాడా! నీ బలపరాక్రమాలను వినియోగించి వాళ్ళను చెదరగొట్టు. వాళ్ళను అణగారిపోనియ్యి!
[12] నోట్లో ఉన్న దోషాలను వాళ్ళ పెదవులు మాటల్లో వెల్లడి చేస్తాయి. వాళ్ళ మాటల్లో ఉట్టిపడే శాపాల, అబద్ధాల కారణంగా వాళ్ళ గర్వమే వాళ్ళను చిక్కులు బెడుతుంది.
[13] ఆగ్రహంతో వాళ్ళను నాశనం చెయ్యి. భూమి మీద లేకుండా వాళ్ళను నాశనం చెయ్యి. దేవుడు యాకోబుప్రజకు పరిపాలకుడని భూతలం ఆ కొననుంచి ఈ కొనదాకా మనుషులు తెలుసుకొనేలా ఈ విధంగా చెయ్యి. (సెలా)
[14] సాయంకాలం వాళ్ళు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూరా తిరుగుతూ ఉంటారు.
[15] ఏమి తిందామా అని అటూ ఇటూ తిరుగాడుతూ ఉంటారు. కడుపు నిండకపోతే, రాత్రంతా అలాగే ఉంటారు.
[16] నీ బలప్రభావాలను నేను స్తుతిస్తాను. నీ అనుగ్రహాన్ని పురస్కరించుకొని ఉదయ కాలంలో నేను సంతోషంతో పాడుతాను. ఎందుకంటే నీవు నాకు ఎత్తయిన కోటలాంటివాడివి. నా కష్టాలలో నీవు నాకు ఆశ్రయ స్థానం.
[17] నాకు బలంగా ఉన్న దేవా! నిన్నే కీర్తిస్తాను. దేవుడు నాకు ఎత్తయిన కోటలాంటివాడు, అనుగ్రహం చూపే దేవుడు.