Skip to content
Opens in a new window

[1] తన అతిక్రమ క్రియలే దుర్మార్గుణ్ణి గురించి హృదయంలో నుంచి మాట్లాడుతాయి. అతడికి దేవుడంటే అసలు భయమే లేదు.

[2] ఎలాగంటే, దేవుడు అతడి అపరాధం కనిపెట్టి అసహ్యించుకోడు గదా అని అది అతడి కళ్ళెదుటే అతణ్ణి పొగడుతుంది.

[3] అతడి నోట కల్లబొల్లి మాటలు వెలువడుతాయి. అందులో ఎంతో కపటం ఉంది. అతడు తెలివిగా ప్రవర్తించడం, మంచి చెయ్యడం మానివేశాడు.

[4] పడకపై కూడా మాయోపాయాలు పన్నుతూ ఉంటాడు. అతడు అవలంబించే మార్గం బాగా లేదు. చెడుగు అతడికి అసహ్యం అనిపించదు.

[5] యెహోవా! నీ అనుగ్రహం ఆకాశాలవరకు, నీ విశ్వసనీయత అంతరిక్షంవరకు ఉన్నాయి.

[6] నీ న్యాయం బ్రహ్మాండమైన పర్వతాలలాంటిది. నీ తీర్పులు అగాధ సముద్రాలలాంటివి. యెహోవా! నీవు మనుషులనూ జంతుజాలాన్నీ సంరక్షిస్తావు.

[7] దేవా! నీ అనుగ్రహం ఎంతో విలువైనది. మనుషులకు నీ రెక్కల నీడ ఆశ్రయం!

[8] నీ ఆలయంలో ఉన్న సమృద్ధివల్ల వారికి సంతృప్తి కలుగుతుంది. నీ ఆనంద ధారలు వారికి నీవు ప్రసాదించే పానీయం.

[9] జీవానికి మూలాధారం నీ దగ్గరే ఉంది. నీ వెలుగులోనే మాకు వెలుగు గోచరిస్తుంది.

[10] నిన్ను ఎరిగిన వారిమీద అనుగ్రహం చూపుతూ ఉండు. అంతరంగంలో నిజాయితీ గల వారికి నీ న్యాయాన్ని ఎడతెగకుండా కనపరచు.

[11] గర్విష్ఠులు వచ్చి నా మీద పాదం మోపకుండా చెయ్యి. దుర్మార్గుల చేయి నన్ను పారదోలకుండా చూడు.

[12] చెడుగు చేసేవాళ్ళు అరుగో అక్కడే పడి ఉన్నారు. మళ్ళీ లేవకుండా వాళ్ళు దెబ్బ తిని కుప్పకూలిపొయ్యారు.

కీర్తనలు — Chapters