Skip to content
Opens in a new window

[1] దుప్పి నీటి ధారలకోసం తహతహలాడినట్టే నా అంతరంగం నీ కోసం తహతహలాడుతూ ఉంది, దేవా!

[2] నా ఆత్మ దేవునికోసం, సజీవుడైన దేవునికోసం తపన చెందుతూ ఉంది. దేవుని సముఖంలోకి నేనెప్పుడు వస్తాను? అక్కడ ఎప్పుడు కనబడుతాను?

[3] రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళే అన్నపానాలు అయ్యాయి నాకు! ఎందుకంటే “నీ దేవుడేడి? ఎక్కడున్నాడు?” అంటూ రోజంతా అదే పనిగా అడిగారు కొందరు.

[4] ఇవి జ్ఞప్తికి తెచ్చుకొని తలపోసుకొంటున్నాను. ఒకప్పుడు జనసమూహంతో ఊరేగింపులో దేవాలయానికి దారి చూపుతూ వెళ్ళేవాణ్ణి. ఆనందధ్వనులతో దేవుణ్ణి స్తుతిస్తూ, మహోత్సవాన్ని ఆచరించేవాళ్ళం మేము.

[5] మనసా, నీవెందుకు ఇలా కుంగిపోతావు? నాలో ఎందుకలా ఘోషిస్తావు? దేవునిమీద ఆశాభావం ఉంచు. ఆయనే నా రక్షణ, నా దేవుడు. ఇంకా ఆయనను స్తుతిస్తాను.

[6] నా దేవా, నా మనసు కుంగిపోయి ఉంది. గనుక యొర్దాను ప్రదేశంనుంచి, హెర్మోను శిఖరాలనుంచి, మిసార్‌కొండనుంచి నేను నిన్ను తలచుకొంటాను.

[7] నీటి ప్రవాహాల గర్జన మూలంగా జలాగాధం జలాగాధాన్ని పిలుస్తూ ఉంది. నీ తరంగాలూ అలలూ అన్నీ నా మీదుగా పొర్లిపారాయి.

[8] పగలు యెహోవా తన అనుగ్రహాన్ని పంపిస్తాడు. రాత్రి ఆయన పాట నాకు తోడుగా ఉంటుంది, అది నాకు జీవదాతగా ఉన్న దేవునికి ఒక ప్రార్థన.

[9] నాకు ఆధారశిలగా ఉన్న దేవునితో అంటాను, “నన్ను మరచిపోయావెందుకు? శత్రువులు నన్ను అణగదొక్కుతూ ఉంటే శోకమూర్తినై నేనెందుకిలా వెళ్ళాలి?”

[10] “నీ దేవుడేడి? ఎక్కడున్నాడు?” అంటూ రోజంతా అదే పనిగా నా శత్రువులు అడుగుతున్నారు. వారిలా నన్ను గేలి చేస్తూ ఉంటే నా ఎముకలు విరిచినట్లనిపిస్తుంది.

[11] మనసా, ఎందుకు ఇలా కుంగిపోతావు? నాలో ఎందుకిలా ఘోషిస్తావు? దేవుని మీద ఆశాభావం ఉంచు. ఆయనే నా రక్షణ, నా దేవుడు. ఇంకా ఆయనను స్తుతిస్తాను.

కీర్తనలు — Chapters