[1] దేవా, నీవు మమ్మల్ని విసర్జించావు. మమ్మల్ని విరగగొట్టావు. మామీద కోపపడ్డావు. మమ్మల్ని మళ్ళీ సరిదిద్దు.
[2] ఈ దేశాన్ని కదలించివేశావు. దానిని బ్రద్దలు కొట్టావు. అది గజగజలాడుతూ ఉంది. దెబ్బ తిన్న చోట్ల దానిని బాగు చెయ్యి.
[3] నీ ప్రజలకు కఠినమైన అనుభవాలు కలిగేలా చేశావు. తూలేట్టు చేసే ద్రాక్షమద్యాన్ని మాచేత పానం చేయించావు.
[4] నీవంటే భయభక్తులున్న వారికి నీవు ఒక జెండా ఇచ్చావు. సత్యంకోసం దానిని పైకెత్తాలని వారికిచ్చావు. (సెలా)
[5] నీ ప్రియ ప్రజలకు విడుదల కలిగేలా నీ కుడి చేతితో మమ్మల్ని రక్షించు.
[6] తన పవిత్ర స్థలంనుంచి దేవుడు మాట ఇచ్చాడు. నేను ఆనందిస్తాను. షెకెం కనుమను పంచి ఇస్తాను. సుక్కోత్‌లోయ కొలిపించి ఇస్తాను.
[7] గిలాదు నాదే. మనష్షే నాదే. ఎఫ్రాయిం నా శిరస్త్రాణం. యూదా నా రాజదండం.
[8] మోయాబు కాళ్ళు కడుగుకొనే నా పాత్ర. ఎదోంమీదికి నా పాదరక్ష విసిరివేస్తాను. ఫిలిష్తీయా! నా గురించి కేకలుపెట్టు!
[9] గోడ, కోట ఉన్న పట్టణానికి నన్ను తీసుకువెళ్ళే వాడెవడు? ఎదోంకు నన్ను వెంటబెట్టుకు వెళ్ళేవాడెవడు?
[10] దేవా, నీవు మమ్మల్ని విసర్జించావు గదూ. దేవా, మా సేనలతో నీవు రావడం మానివేశావు గదూ.
[11] శత్రువులను ఓడించడానికి మాకు సహాయం చెయ్యి. మనిషి చేయగల సహాయం వృథా.
[12] దేవుని ద్వారానే మేము విజయం సాధిస్తాం. మా శత్రువులను ఆయనే అణగద్రొక్కి వేస్తాడు.