Skip to content
Opens in a new window

[1] యెహోవాకు కృతజ్ఞతలు చెప్పుకోండి. ఆయన మంచివాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.

[2] యెహోవా చేత విడుదల పొందినవారు ఆ విధంగా చెప్పాలి. ఆయన వారి విరోధుల చేతులలో నుంచి వారిని విడిపించాడు.

[3] ఆయన వేరువేరు దేశాలనుంచి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల నుంచి వారిని విడిపించాడు.

[4] వారు ఎడారిలో, పాడు ప్రదేశంలో తిరుగులాడారు. తాము కాపురం చేయడానికి పట్టణం ఒక్కటీ తమకు కనిపించలేదు.

[5] ఆకలిదప్పుల చేత వారి ప్రాణం కృశించిపోయింది.

[6] వారు కష్టదశలో యెహోవాకు మొర పెట్టారు. వారి ఆపదల నుంచి ఆయన వారిని విడిపించాడు.

[7] వారు నివసించగల పట్టణం చేరేందుకు చక్కని దారిలో ఆయన వారిని నడిపించాడు.

[8] యెహోవా అనుగ్రహాన్ని బట్టీ, ఆయన మనుషులకు చేసిన ఆశ్చర్యకరమైన క్రియలనుబట్టీ వారు కృతజ్ఞతలు అర్పిస్తారు గాక!

[9] ఆయన దప్పిగొన్న వారిని మంచి పదార్థాలతో నింపాడు.

[10] దేవుని మాట వినక, ఎదురు తిరిగి, సర్వాతీతుని సలహాలు కాలరాచినందుచేత

[11] కొందరు చీకటిలో, చావు నీడలో జీవించారు, దుర్దశలో ఇనుప సంకెళ్ళతో బంధించబడ్డారు.

[12] అందుచేత ఆయన వారి హృదయాన్ని ఆయాసం మూలంగా క్రుంగదీశాడు. వారు కుప్పకూలారు. సహాయం చేసేవాడెవడూ లేకపోయాడు.

[13] వారు కష్ట దశలో యెహోవాకు మొరపెట్టారు. వారి ఆపదల నుంచి ఆయన వారిని విడిపించాడు.

[14] చీకట్లోనుంచి, చావు నీడలో నుంచి ఆయన వారిని వెలుపలికి తెచ్చాడు. వారి బంధకాలు పటాపంచలు చేశాడు.

[15] యెహోవా అనుగ్రహాన్ని బట్టీ, ఆయన మనుషులకు చేసిన ఆశ్చర్యకరమైన క్రియలను బట్టీ వారు కృతజ్ఞతలు అర్పిస్తారు గాక!

[16] ఆయన కంచు ద్వారాలను విరగ్గొట్టాడు. ఇనుప గడియలను తుత్తునియలు చేశాడు.

[17] మూర్ఖులు తమ అక్రమ ప్రవర్తన కారణంగా, తమ అపరాధాల కారణంగా బాధ కొనితెచ్చుకొన్నారు.

[18] భోజనం అంటే వారికి వెగటు అనిపించింది. మరణ ద్వారానికి దగ్గరగా వచ్చారు.

[19] వారు కష్టదశలో యెహోవాకు మొరపెట్టారు. వారి ఆపదలనుంచి ఆయన వారిని విడిపించాడు.

[20] ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేశాడు. వారు పడిన గుంటలో నుంచి వారిని విడిపించాడు.

[21] యెహోవా అనుగ్రహాన్ని బట్టీ, ఆయన మనుషులకు చేసిన ఆశ్చర్యకరమైన క్రియలను బట్టీ వారు ఆయనకు కృతజ్ఞతలు అర్పిస్తారు గాక!

[22] వారు కృతజ్ఞతతో నైవేద్యాలు అర్పిస్తారు గాక! ఆయన క్రియలను ఆనంద ధ్వనులతో ప్రకటిస్తారు గాక!

[23] కొందరు ఓడలలో సముద్ర ప్రయాణం చేస్తూ, మహా జలాల మీద వెళ్తూ వ్యాపారం చేసేవారు.

[24] యెహోవా చేసిన క్రియలను చూశారు వారు. సముద్రంలో ఆయన చేసిన అద్భుతాలు చూశారు.

[25] ఆయన ఆజ్ఞ జారీ చేయగానే తుఫాను లేచింది. దాని వల్ల అలలు పైకి లేచాయి.

[26] వారు ఆకాశానికి పైకి ఎక్కారు, జలాగాధంలోకి దిగివెళ్ళారు. వారి జీవం దురవస్థ కారణంగా కరిగిపోయింది.

[27] త్రాగి కైపెక్కినవాడిలాగా వారు తూలుతూ, అటు ఇటు ఊగుతూ ఉన్నారు. వారి తెలివి కాస్తా శూన్యమైపోయింది.

[28] వారు కష్టదశలో యెహోవాకు మొరపెట్టారు. వారి ఆపదలనుంచి ఆయన వారిని విడిపించాడు.

[29] ఆయన తుఫానును నిమ్మళింపజేశాడు. సముద్రం అలలు సద్దుమణిగాయి.

[30] అవి అణిగాయని వారు సంతోషించారు. వారు కోరిన రేవుకు ఆయన వారిని చేర్చాడు.

[31] యెహోవా అనుగ్రహాన్ని బట్టీ, ఆయన మనుషులకు చేసిన ఆశ్చర్యకరమైన క్రియలను బట్టీ వారు ఆయనకు కృతజ్ఞతలు అర్పిస్తారు గాక!

[32] ప్రజా సమాజాలలో వారు ఆయనకు ఘనత కలిగిస్తారు గాక! పెద్దల సభలలో ఆయనను కీర్తిస్తారు గాక!

[33] అక్కడ కాపురమున్న మనుషుల చెడుగును బట్టి ఆయన నదులను ఎడారిగా మార్చాడు.

[34] నీటి ఊటలను ఎండిన నేలగా మార్చాడు. సారవంతమైన భూమిని చవిటి నేలగా మార్చాడు.

[35] ఆయన ఎడారిని నీటి మడుగులుగా మార్చాడు. ఎండిన భూమిని నీటి ఊటల స్థలంగా మార్చాడు.

[36] ఆకలిగొన్న వారిని అక్కడ కాపురముంచాడు. వారు నివాసయోగ్యమైన పట్టణం కట్టారు.

[37] వారు పొలాలు సేద్యం చేసుకొన్నారు. ద్రాక్ష తోటలు నాటారు. మంచి ఫలసాయం సంపాదించుకొన్నారు.

[38] ఆయన వారిని ఆశీర్వదించాడు. వారి సంఖ్య అధికంగా పెరిగింది. వారి పశుసంపద ఏమీ తగ్గకుండా చేశాడు.

[39] అప్పుడు వారు విపత్తు ఒత్తిడికి, బాధకు, శోకానికి గురి అయి కృశించిపోయారు. వారి సంఖ్య కూడా తగ్గిపోయింది.

[40] యెహోవా రాజులను లెక్క చెయ్యలేదు. దారీ తెన్నూ లేని పాడు ప్రదేశంలో వారు తిరిగేలా చేశాడు.

[41] అక్కరలో ఉన్నవారిని బాధనుంచి క్షేమ స్థితికి లేవనెత్తాడు. వారి కుటుంబాలను మందలాగా వృద్ధి చేశాడు.

[42] నిజాయితీపరులు ఇది చూచి సంతోషిస్తారు. దుర్మార్గులంతా నోళ్ళు మూసుకొంటారు.

[43] జ్ఞానులు ఈ విషయాలు పాటిస్తారు, యెహోవా చూపే మహా అనుగ్రహాన్ని గుర్తిస్తారు.

కీర్తనలు — Chapters