Skip to content
Opens in a new window

[1] యెహోవా, నీకు మొర్రపెట్టుకొంటున్నాను. నా ఆధారశిలవు నీవు. నా మొర పెడచెవిని పెట్టకు. నీవు జవాబివ్వకపోతే నాశనకరమైన గుండంలోకి దిగిపోయేవాళ్ళలాగా అవుతాను.

[2] నా స్వరం, నా విన్నపం విను. నీ ఆలయంలోని అతి పవిత్ర స్థలంవైపు చేతులెత్తి సహాయంకోసం నీకు ఆక్రందన చేస్తున్నాను.

[3] దుర్మార్గులతో, చెడుగు చేసేవాళ్ళతో పాటు నన్ను ఈడ్చుకుపోకు. వాళ్ళు లోపల కుటిలం పెట్టుకొని, పైకి ఇరుగు పొరుగువారితో శాంతి, శాంతి అంటారు.

[4] వాళ్ళ కార్యకలాపాలకూ, వాళ్ళు చేసిన చెడుగుకూ తగిన ప్రతిఫలమియ్యి. వాళ్ళు చేతులారా చేసిన దానిని బట్టి వాళ్ళకు ప్రతీకారం జరిగించు. వాళ్ళ వ్యవహారాలకు తగినదేదో వాళ్ళకు ముట్టేలా చెయ్యి.

[5] ఎందుకంటే, యెహోవా చర్యల మీద మనసు పెట్టుకోరు వాళ్ళు. ఆయన చేతులతో చేసినది వాళ్ళకు లెక్కలేదు. కనుక ఆయన వాళ్ళకు వృద్ధి కాదు, నాశనమే కలిగిస్తాడు.

[6] యెహోవా నా స్వరం, నా విన్నపం విన్నాడు. ఆయనకు స్తుతి.

[7] నాకు యెహోవాయే బలం. ఆయన నాకు డాలులాంటివాడు. హృదయపూర్వకంగా ఆయనను నమ్ముకొన్నాను. అందుచేత నాకు సహాయం లభించింది. నా హృదయం సంతోషంతో ఉప్పొంగుతూ ఉంది. నా కీర్తన ద్వారా ఆయనకు కృతజ్ఞత అర్పిస్తాను.

[8] తన ప్రజానీకానికి బలం యెహోవాయే. తన అభిషిక్తుడికి ఆయన రక్షక దుర్గం.

[9] నీ ప్రజను కాపాడు. నీ సొత్తును ఆశీర్వదించు. వారికి కాపరివై శాశ్వతంగా వారిని మోసుకో.

కీర్తనలు — Chapters