[1] ప్రతీకారం చేసే దేవా! యెహోవా! ప్రతీకారం చేసే దేవా! నీ ప్రకాశం కనుపరచు!
[2] ప్రపంచానికి తీర్పు తీర్చేవాడా! లే! గర్విష్ఠులకు తగ్గ ప్రతిఫలం ముట్టేలా చెయ్యి!
[3] దుర్మార్గులు ఎంత కాలమని సంతోషంతో ఉప్పొంగుతారు? యెహోవా! దుర్మార్గులు ఎంతవరకు ఇలా సంతోషిస్తారు?
[4] వాళ్ళు ఏవేవో వాగుతూ, సిగ్గుమాలిన రీతిగా మాట్లాడుతున్నారు. చెడుగు చేసేవాళ్ళంతా గొప్పలు చెప్పుకొంటారు.
[5] యెహోవా! వాళ్ళు నీ ప్రజలను అణిచివేస్తున్నారు. నీ సొత్తును బాధిస్తున్నారు.
[6] విధవరాండ్రనూ విదేశీయులనూ చంపుతారు. అనాథలను హత్య చేస్తారు.
[7] “యెహోవా ఇదంతా చూడ్డం లేదులే. యాకోబు యొక్క దేవుడు ఇదంతా గమనించడు” అనుకుంటున్నారు.
[8] ప్రజల్లో పశుప్రాయులారా, బుద్ధి తెచ్చుకోండి! మూర్ఖులారా, మీకెప్పుడు తెలివి వస్తుంది?
[9] చెవులిచ్చినవాడు వినలేడా? కండ్లను రూపొందించినవాడు చూడలేడా?
[10] జనాలను శిక్షించేవాడు మిమ్మల్ని శిక్షించడా?
[11] మనుషుల తలంపులు వృథా అని యెహోవాకు తెలుసు.
[12] యెహోవా! నీచేత క్రమశిక్షణ పొందిన వ్యక్తులు ధన్యజీవులు. ధర్మశాస్త్రోపదేశం నీవల్ల నేర్చుకొనేవారు ధన్యులు.
[13] అలాంటివారిని కీడు అనుభవించిన రోజులనుంచి విడిపించి, దుర్మార్గులకోసం గుంట తవ్వడం జరిగేవరకు విశ్రమించేలా చేస్తావు.
[14] యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు. తన సొత్తును విసర్జించడు.
[15] న్యాయస్థానంలో ధర్మ సంస్థాపన జరుగుతుంది. నిజాయితీ పరులంతా ఆ ప్రకారం ప్రవర్తిస్తారు.
[16] చెడుగు చేసేవాళ్ళ ఎదుట నా పక్షాన ఎవరు నిలుస్తారు? దోషులకు ప్రతికూలంగా నా పక్షాన నిలిచేదెవరు?
[17] యెహోవాయే గనుక నాకు సహాయం చేసి ఉండకపోతే మౌన ప్రదేశంలోకి త్వరలోనే తరలిపోయి ఉండేవాణ్ణే.
[18] నేను “నా కాలు జారింది” అనుకొంటే, యెహోవా, నీ అనుగ్రహం నన్ను ఎత్తి పట్టుకొంది.
[19] నాకు ఆందోళన కలిగించే తలంపులు ఎక్కువవుతూ ఉంటే నీవు అనుగ్రహించే ఆదరణలు నా ప్రాణానికి హాయి చేకూరుస్తాయి.
[20] దుర్మార్గుల పరిపాలనతో నీకు సంబంధమేమిటి? కీడు చేద్దామని వాళ్ళు చట్టం కల్పిస్తారు.
[21] వాళ్ళు న్యాయవంతుల ప్రాణాలు తీయడానికి గుమికూడి వారి పైబడతారు. నిర్దోషులమీద నేరం మోపి మరణ శిక్ష విధిస్తారు.
[22] కాని యెహోవా నాకు ఎత్తయిన కోటలాంటివాడు. నా దేవుడు నాకు ఆశ్రయమిచ్చే ఆధారశిల.
[23] ఆయన వాళ్ళ దోషాలు వాళ్ళ నెత్తిమీదికే తెస్తాడు. వాళ్ళ చెడుతనంలోనే వాళ్ళను నాశనం చేస్తాడు. మన దేవుడైన యెహోవా వాళ్ళను నాశనం చేస్తాడు.