[1] యెహోవా కరుణాక్రియలు నేను ఎప్పుడూ సంకీర్తనం చేస్తాను. రాబోయే తరాలన్నిటికీ నా నోరార నీ విశ్వసనీయతను తెలియజేస్తాను.
[2] “కరుణ శాశ్వతంగా సుస్థిరంగా ఉంటుంది. పరలోకంలో నీ విశ్వసనీయతను స్థాపిస్తావు” అంటున్నాను నేను.
[3] “నేను నియమించిన వ్యక్తితో ఒడంబడిక చేసుకొన్నాను. నా సేవకుడైన దావీదుకు ఇలా ప్రమాణం చేశాను:
[4] నీ సంతానాన్ని ఎప్పటికీ నేను స్థాపిస్తాను. తరతరాలకు నీ సింహాసనం సుస్థిరం చేస్తాను” అన్నావు. (సెలా)
[5] యెహోవా, ఆకాశాలు నీ అద్భుతాలను కీర్తిస్తాయి. పవిత్రుల సమావేశంలో నీ విశ్వసనీయతకు స్తుతులు కలుగుతాయి.
[6] ఆకాశాలలో యెహోవాకు సాటి ఎవడు? దేవ కుమారులలో యెహోవాలాంటి వాడెవడు?
[7] పవిత్రుల సభలో ఆయన మహా భయంకరుడైన దేవుడు. తన చుట్టూరా ఉన్న వారందరిలో ఆయన భయంకరుడు.
[8] యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీ లాంటివాడెవడు? యెహోవా, నీవు మహా బలాడ్యుడివి. నీ విశ్వసనీయత నిన్ను ఆవరించి ఉంది.
[9] ఉప్పొంగే సముద్రాన్ని అదుపులో ఉంచుతావు. అలలు ఉవ్వెత్తుగా లేస్తే, వాటిని అణిచివేస్తావు.
[10] రాహాబును నలగ్గొట్టి హతురాలుగా చేశావు. నీ బలిష్ఠమైన హస్తంతో నీ శత్రువులను చెదరగొట్టివేశావు.
[11] ఆకాశాలు నీవి. భూమి నీది. భూమి, అందులో ఉన్నదంతా నీవు నెలకొల్పినదే.
[12] ఉత్తర దక్షిణ దిక్కులను నీవే సృజించావు. తాబోర్, హెర్మోన్‌పర్వతాలు నీ పేరుకు ఆనంద ధ్వనులు చేస్తున్నాయి.
[13] నీకు బలిష్ఠమైన హస్తం ఉంది. నీ చేయి బలిష్ఠమైనది. నీ కుడి చేతికి ఆధిక్యత ఉంది.
[14] నీతి నిజాయితీ, న్యాయం నీ సింహాసనానికి ఆధారాలు. అనుగ్రహం, సత్యం నీకు ముందుగా నడుస్తాయి.
[15] ఆనంద ధ్వనులు తెలుసుకొన్న ప్రజలు ధన్యజీవులు. యెహోవా, నీ ముఖకాంతిలో వారు మసులుకుంటారు.
[16] నీ పేరునుబట్టి వారు రోజంతా ఆనందిస్తారు. నీ న్యాయం మూలంగా వారు ఉన్నత స్థితికి వస్తారు.
[17] వారి బలానికి ఘనత నీవే. నీ దయ చేత మా కొమ్ము పైకి వచ్చింది.
[18] మా డాలు యెహోవాకు చెంది ఉన్నది. మా రాజు ఇస్రాయేల్‌ప్రజల పవిత్ర దేవునికి చెందినవాడు.
[19] ఒకప్పుడు నీ భక్తుడికి దర్శనంలో ఇలా అన్నావు: “నేను వీరునికి సహాయం చేశాను. అతణ్ణి ప్రజల్లోనుంచి ఎన్నుకొని హెచ్చించాను.
[20] నా సేవకుడైన దావీదును కనుగొన్నాను. నా పవిత్ర తైలంతో అతణ్ణి అభిషేకించాను.
[21] అతనికి నా చేయి ఎల్లప్పుడూ అండదండ. నా హస్తం అతణ్ణి బలపరుస్తుంది.
[22] శత్రువు అతణ్ణి మోసగించలేడు. పాపాత్ములు అతణ్ణి గెలవరు.
[23] అతని ఎదుటే అతని పగవాళ్ళను పడగొట్టివేస్తాను. అతణ్ణి ద్వేషించేవాళ్ళను కొడతాను.
[24] నా విశ్వసనీయత నా కృప అతనికి తోడునీడ. నా పేర అతని కొమ్ము పైకి వస్తుంది.
[25] అతడు సముద్రంమీద చేయి ఎత్తేలా చేస్తాను. నదులమీద అతని కుడి చేయి ఎత్తేలా చేస్తాను.
[26] అతడు నాకిలా ప్రార్థన చేస్తాడు: ‘నీవు నా తండ్రివి, నా దేవుడివి, నాకు రక్షణ ఆధార శిల.’
[27] నేను అతణ్ణి నా పెద్ద కొడుకుగా చేసుకొంటాను. అతనికి భూరాజులందరికంటే ఉన్నత స్థితిని ప్రసాదిస్తాను.
[28] నా కృప ఎప్పటికీ అతని పట్ల ఉండేలా చూస్తాను. నా ఒడంబడిక ఎల్లప్పుడూ అతనితో నిలిచి ఉంటుంది.
[29] అతని సంతానం శాశ్వతంగా ఉండేలా చేస్తాను. అతని సింహాసనాన్ని ఆకాశం ఉన్నంతవరకూ నిలుపుతాను.
[30] అతని సంతతివారు నా ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తే, నా న్యాయ నిర్ణయాలను జవదాటితే,
[31] నా చట్టాలను మీరితే, నా ఆజ్ఞలను పాటించకపోతే,
[32] వారి తిరుగుబాటుకు వారిని బెత్తంతో శిక్షిస్తాను. వారి అక్రమానికి దెబ్బలు తప్పవు.
[33] కాని, అతనిపట్ల నా కృపను తెగతెంపులు చెయ్యను. ఆడి తప్పను. నా విశ్వసనీయతను వమ్ము చేయను.
[34] నా ఒడంబడికను నేను మీరను. నా పెదవుల మీది మాటను నేను మార్చను.
[35] నా పవిత్ర శీలం మీద ప్రమాణం చేశాను. దావీదుకు ఇచ్చిన మాటను తప్పను.
[36] దావీదు సంతానం శాశ్వతంగా ఉంటుంది. సూర్యమండలం ఉన్నంత కాలం అతని సింహాసనం నా ఎదుట ఉంటుంది.
[37] చంద్రగోళం ఉన్నంత కాలం అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆకాశంలో ఉన్న ఈ సాక్ష్యం నమ్మకంగా ఉంది.” (సెలా)
[38] అయినా నీవు మమ్మల్ని విడిచిపుచ్చావు. తోసిపుచ్చావు. నీ అభిషిక్తుడిమీద నీ తీవ్ర కోపం రగులుకొంది.
[39] నీ సేవకుడి ఒడంబడికను నీవు దులిపి పారేశావు. అతడి కిరీటాన్ని నేలపై పడవేసి కాలరాచావు.
[40] అతడి కంచెలన్నీ నీవు విరగ్గొట్టావు. అతడి స్థావరాలను పాడు చేసి విడిచావు.
[41] దారిన పొయ్యే వాళ్లంతా అతణ్ణి దోచుకుంటున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళకు అతడు నిందపాలయ్యాడు.
[42] అతణ్ణి హింసించేవాళ్ళకు కుడిచెయ్యి పైన ఉండేలా చేశావు. అతడి శత్రువులకు ఆనందం కలిగించావు.
[43] అతడి ఖడ్గాన్ని తొలగించావు. యుద్ధరంగంలో అతణ్ణి నిలువనిచ్చావు కావు.
[44] అతని వైభవం మాసిపొయ్యేలా చేశావు. అతడి సింహాసనాన్ని నేలమట్టం చేశావు.
[45] అతడి యువప్రాయాన్ని కుదించావు. సిగ్గు అతణ్ణి ఆవరించేలా చేశావు. (సెలా)
[46] యెహోవా, ఎంత కాలం ఇలా కనబడకుండా ఉంటావు? దీనికి అంతం లేదా? ఎంతకాలమని నీ తీవ్ర కోపం మంటల్లాగా మండుతూ ఉంటుంది?
[47] నా ఆయుష్షు ఎంత కొద్ది కాలమో తలచుకో. నీవు మనుషులందరినీ ఎందుకిలా ఊరికే సృజించావు?
[48] చావును చూడకుండా బ్రతికే మనిషి అంటూ ఉంటాడా? మృత్యు లోకం నుంచి తప్పించుకోగల వాడెవడు?
[49] నీ విశ్వసనీయత విషయంలో దావీదుతో ప్రమాణం చేసి చెప్పావే ప్రభూ, మొదట చూపిన ఆ అనుగ్రహం ఏదీ ఎక్కడుంది?
[50] ప్రభూ! నీ సేవకులమీదికి వచ్చిన నిందను తలచుకో! బలంగల జనాలన్నిటిమూలంగా వచ్చిన నిందను నా గుండెలో మోసుకొంటున్నాను.
[51] యెహోవా! అవి నీ శత్రువులు మోపిన నిందలు. నీ అభిషిక్తుడి అడుగుల మీద వాళ్ళు మోపిన నిందలు.
[52] యెహోవాకు శాశ్వతంగా స్తుతి కలుగుతుంది గాక! తథాస్తు! తథాస్తు!