Skip to content
Opens in a new window

[1] దేవా, ఇతర ప్రజలు నీ సొత్తులోకి చొరబడ్డారు. వాళ్ళు నీ పవిత్రాలయాన్ని అశుద్ధం చేశారు. జెరుసలంను రాళ్ళగుట్టగా మార్చివేశారు.

[2] నీ సేవకుల శవాలను గాలిలో ఎగిరే పక్షులకూ, నీ భక్తుల మృత దేహాలను భూమి పై తిరుగాడే మృగాలకూ ఆహారంగా పడవేశారు.

[3] నీళ్ళులాగా వారి రక్తాన్ని జెరుసలం చుట్టు పారబోశారు. వారిని పూడ్చిపెట్టేవాడెవడూ లేడు.

[4] మా ఇరుగుపొరుగువాళ్ళ దృష్టిలో మేము నీచులమయ్యాం. మా చుట్టు ప్రక్కల వాళ్ళు మమ్మల్ని చూచి వెక్కిరిస్తారు, ఎగతాళి చేస్తారు.

[5] యెహోవా, ఎన్నాళ్ళు నీకు మామీద కోపం? శాశ్వతంగా ఉంటుందా? నీ రోషం మంటల్లాగా మండుతూనే ఉంటుందా?

[6] నిన్నెరుగని జనాల పై నీ కోపం కుమ్మరించు, నీ పేరట ప్రార్థించని రాజ్యాలమీద నీ ఆగ్రహం కుమ్మరించు.

[7] వాళ్ళు యాకోబుప్రజలను దిగమింగారు. వారి నివాస స్థానాన్ని పాడుచేశారు.

[8] మా పూర్వీకుల అపరాధాలు జ్ఞాపకముంచుకొని, మామీద వ్యతిరేక భావం పెట్టుకోకు. శీఘ్రంగా నీ వాత్సల్యం మామీదికి రానివ్వు. మేము ఎంతో నీరసించి ఉన్నాం.

[9] దేవా, మా రక్షకా, నీ పేరు ప్రతిష్ఠల దృష్ట్యా మాకు సాయం చెయ్యి. నీ పేరుకోసం మమ్మల్ని విడిపించు. మా పాపాలను తుడిచివెయ్యి.

[10] “వాళ్ళ దేవుడు ఏడి ఎక్కడున్నాడు?” అని ఇతర ప్రజలు ఎందుకు పలకాలి? వాళ్లు ఒలికించిన నీ సేవకుల రక్తం విషయం నీవు ప్రతీకారం జరిగిస్తావని వాళ్ళకు తెలియాలి. మేము అది స్వయంగా చూడాలి.

[11] ఖైదీల నిట్టూర్పులు నీ దగ్గరికి రానియ్యి. నీ మహా హస్తబలం చొప్పున చావనై ఉన్నవారిని కాపాడు.

[12] ప్రభూ! మా పొరుగువాళ్ళు నిన్ను దూషించారు. వాళ్ళకు ప్రతీకారం చెయ్యి. వాళ్ళను ఏడంతల దూషణకు గురి చెయ్యి.

[13] అప్పుడు మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తాం. మేము నీ ప్రజలం, నీ మంద గొర్రెలం. తరతరాలకూ నీ కీర్తి ప్రచురిస్తాం.

కీర్తనలు — Chapters