Skip to content
Opens in a new window

[1] యెహోవా! నా మాటలు ఆలకించు. నా నిట్టూర్పుల గురించి ఆలోచించు.

[2] నా రాజా, నా దేవా! సహాయం కోసం మొర పెట్టుకొంటున్నాను. వినిపించుకో. నిన్నే ప్రార్థిస్తున్నాను.

[3] యెహోవా, ఉదయాన్నే నా స్వరం వింటావు. ప్రొద్దున్నే నీ కోసం సంసిద్ధుడనై ఎదురుచూస్తాను.

[4] నీవు దుర్మార్గాన్ని చూచి ఆనందించే దేవుడవు కాదు. చెడుగుకు నీ దగ్గర చోటు లేదు.

[5] గొప్పలు చెప్పుకొనేవాళ్ళకు నీ సమక్షంలో నిలబడడానికి తావు లేదు. దుర్మార్గం జరిగించే వాళ్ళంటే నీకు అసహ్యం.

[6] అబద్ధాలు చెప్పేవాళ్ళను నాశనం చేస్తావు. హత్య, మోసం చేసేవాళ్ళను యెహోవా అసహ్యించుకొంటాడు.

[7] నేను మట్టుకు నీ కృప సమృద్ధిని బట్టి నీ ఆలయానికి వస్తాను. భయభక్తులతో నీ పవిత్రాలయంవైపు చూచి నిన్ను ఆరాధిస్తాను.

[8] యెహోవా, నా శత్రువుల కారణంగా నేను నీ న్యాయ మార్గంలో నడిచేలా చెయ్యి. నా ముందర నీ మార్గాన్ని స్పష్టంగా కనుపరచు.

[9] వాళ్ళ నోట నమ్మతగ్గ మాట ఒక్కటీ లేదు. వాళ్ళ ఆంతర్యం భ్రష్టమైనది. వాళ్ళ గొంతు తెరచి ఉన్న సమాధి. వాళ్ళ నాలుకలు పొగడుతాయి.

[10] దేవా, వాళ్ళకు తీర్పు విధించు. వాళ్ళ ఎత్తుగడల్లో వాళ్ళనే చిక్కుకోనియ్యి. వాళ్ళ అతిక్రమాలు అనేకం, గనుక వాళ్ళను వెళ్ళగొట్టు. వాళ్ళు నీమీద తిరగబడి ఉన్నారు గదా!

[11] నిన్ను శరణు జొచ్చినవారు సంతోషిస్తారు గాక! వారు ఎప్పుడూ ఆనంద ధ్వనులు చేస్తారు గాక! ఎందుకంటే నీవే వారికి రక్ష. నీ పేరు ఎవరికి ప్రియమో వారు నీ మూలంగా ఆనందమయులు అవుతారు గాక!

[12] యెహోవా! న్యాయవంతులను దీవిస్తావు. నీ అనుగ్రహం వారిని డాలులాగా ఆవరించి ఉంటుంది.

కీర్తనలు — Chapters