[1] దేవా, నీకు మా కృతజ్ఞతలు. నీ పేరు మాకెంతో సన్నిహితం. నీకు మా కృతజ్ఞతలు. మనుషులు నీ అద్భుత క్రియలను చాటుతారు.
[2] “నేను సరైన సమయం నియమించి న్యాయంతో తీర్పు తీరుస్తాను.
[3] భూమి, దానిమీద నివసించేవాళ్ళంతా కంపించిపోయినప్పుడు దాని స్తంభాలను నిలబెట్టేది నేనే. (సెలా)
[4] బడాయికోరులకు నేను చెప్పేది ఇదే: బడాయి చెప్పుకోకండి. దుర్మార్గులకు నేను చెప్పేదేమంటే, కొమ్ము ఎత్తకండి,
[5] పొడవడానికి కొమ్ము పైకి ఎత్తుకోకండి. మెడ వంగని పొగరుబోతులై మాట్లాడకండి.
[6] తూర్పునుంచి గాని, పడమటినుంచి గాని, ఎడారి వైపునుంచి గాని ఉన్నత స్థితి రాదు.
[7] దేవుడే తీర్పు తీరుస్తాడు. ఆయన ఒకరిని అణిచివేస్తాడు, మరొకరిని పైకెత్తుతాడు.
[8] యెహోవా చేతిలో పాత్ర ఒకటి ఉంది. పాత్రలోని ద్రాక్షరసం పొంగి నురుగులు కడుతూ ఉంది. అది బాగా మిశ్రం చేయబడింది. ఆయన ఆ పాత్రలోది పారబోస్తున్నాడు. అందులోని మడ్డితో సహా భూమిమీద ఉన్న దుర్మార్గులందరూ దానిని గుటకలేస్తూ మ్రింగితీరాలి.
[9] నేనైతే ఎల్లప్పుడు దేవుని కీర్తి ప్రకటిస్తాను. యాకోబు యొక్క దేవుణ్ణి సంకీర్తన చేస్తాను.
[10] దుర్మార్గుల అధికారమంతా అణిగి లయమైపోతుంది. న్యాయవంతుల అధికారం వర్ధిల్లుతుంది.