[1] యెహోవా, నా ప్రార్థన విను. నా విన్నపాలు చెవినిబెట్టు. నీ నమ్మకత్వాన్ని, న్యాయబుద్ధిని అనుసరించి నాకు జవాబివ్వు.
[2] నీ సేవకుడైన నన్ను విచారణలోకి రప్పించకు. సజీవులలో ఒక్కడు కూడా నీ దృష్టిలో నిర్దోషి కాడు.
[3] శత్రువులు నా వెంటబడ్డారు. వాళ్ళు నా ప్రాణాన్ని నేలకూల్చారు. చాలా కాలం క్రిందట చచ్చినవాళ్ళలాగా నన్ను కటిక చీకట్లో ఉండిపోయేలా చేశారు.
[4] నా ఆత్మలో నేనెంతో కుంగిపోయాను. నా హృదయం నాలో నిరాశ చెందింది.
[5] వెనుకటి రోజులు జ్ఞప్తికి వస్తున్నాయి. నీ కార్యకలాపాలన్నీ నేను ధ్యానిస్తున్నాను. నీవు స్వయంగా చేతితో చేసినవి తల పోసుకుంటున్నాను.
[6] నీవైపు నా చేతులు చాపుతున్నాను. ఎండిపోయిన నేలలాగా ఉండి నా ప్రాణం నీకోసం తహతహలాడుతూ ఉంది. (సెలా)
[7] యెహోవా, నా ఆత్మ నీరసించిపోతూ ఉంది. త్వరలోనే నాకు జవాబివ్వు. నీ ముఖం నాకు కనిపించకుండా చేయకు. లేకపోతే, మృత్యు గర్భంలోకి దిగిపోయిన వారిలాగా ఉంటాను.
[8] నాకు నీమీద నమ్మకం ఉంది. ప్రొద్దున్నే నీ అనుగ్రహాన్ని గురించి నాకు వినిపించు. నా మనసును నీవైపుకే ఎత్తుతున్నాను. నేను నడవవలసిన దారి నాకు నేర్పు.
[9] యెహోవా, నేను నీ అండన చేరాను. నా శత్రువుల బారినుంచి నన్ను విడిపించు.
[10] నీవే నా దేవుడివి. నీ ఇష్టప్రకారం ప్రవర్తించడానికి నాకు ఉపదేశించు. నీ దయగల ఆత్మచేత సమతలం మీద నన్ను నడిపించు.
[11] యెహోవా, నీ పేరుప్రతిష్ఠల కారణంగా నన్ను బ్రతికించు. నీ న్యాయాన్ని అనుసరించి నా ప్రాణాన్ని బాధలలోనుంచి తప్పించు.
[12] నేను నీ సేవకుణ్ణి. నాపై నీ అనుగ్రహంతో నా శత్రువులను నిర్మూలిస్తావు. నా ప్రాణాన్ని బాధించేవారిని నాశనం చేస్తావు.