[1] సర్వాతీతుని చాటున నివసించేవారు అమిత శక్తిమంతుని నీడలోనే విశ్రమించేవారు.
[2] నేను యెహోవాను గురించి ఇలా అంటాను: “నా ఆశ్రయ స్థానం ఆయనే, నాకు కోట ఆయనే. నేను నమ్ముకొన్న నా దేవుడు ఆయనే.”
[3] వేటగాడు వేసిన వలనుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. చావగొట్టు విపత్తునుంచి ఆయన నిన్ను రక్షిస్తాడు.
[4] తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఆయన సత్యం డాలులాంటిది, కవచంలాంటిది.
[5] రాత్రిపూట భయపెట్టేవాటికి నీకు నదురూ బెదురూ ఉండదు. పగటిపూట ఎగిరి వచ్చే బాణాలంటే నీకు భయం ఉండదు.
[6] చీకట్లో తచ్చాడే విపత్తుకు, మధ్యాహ్నం సంభవించే నాశనానికి నీవు భయపడవు.
[7] నీ ప్రక్కనే వెయ్యిమంది కూలినా, పది వేలమంది నీ కుడిచేతివైపున నేల కొరిగినా ఆ కీడు నీ దరిదాపులకు రాదు.
[8] కన్నులారా నీవు చూస్తూ ఉండగానే దుర్మార్గులకు ప్రతిఫలం ముడుతుంది.
[9] నా ఆశ్రయ స్థానమైన యెహోవాను, సర్వాతీతుణ్ణి నీకు నివాసంగా చేసుకొన్నావు,
[10] గనుక హాని ఏమీ నిన్ను సోకదు. దెబ్బ ఏదీ నీ ఇంటిదగ్గరికి కూడా రాదు.
[11] నీ విధానాలన్నిటిలో నిన్ను కాపాడేందుకు దేవుడు తన దూతలకు నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడు.
[12] వారు నీ పాదాలకు రాయి తగలకుండా నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు.
[13] సింహం మీదుగా, విష సర్పం మీదుగా నీవు నడిచిపోతావు. క్రూర సింహాన్ని, రెక్కలున్న సర్పాన్ని కాళ్ళక్రింద త్రొక్కుతావు.
[14] “అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక అతణ్ణి తప్పిస్తాను. అతనికి నా పేరు తెలుసు. అందుచేత అతణ్ణి పైన కూర్చోబెడతాను.
[15] అతడు నన్ను ప్రార్థించేటప్పుడు నేను జవాబిస్తాను. కష్టాలలో అతనికి నేను అండగా ఉంటాను. నేను అతణ్ణి విడిపిస్తాను, అతణ్ణి గౌరవిస్తాను.
[16] అతనికి దీర్ఘాయువును ప్రసాదించి సంతృప్తి కలిగిస్తాను. నా రక్షణ అతడు చూచేలా చేస్తాను” అని యెహోవా అంటున్నాడు.