Skip to content
Opens in a new window

[1] ఇస్రాయేల్‌ప్రజల పట్ల, శుద్ధ హృదయం గలవారి పట్ల దేవుడు మంచివాడు. ఇది తథ్యం.

[2] అయితే నా విషయం చెప్పాలంటే నా అడుగులు తొలగిపోవడానికి కొంచెంలో తప్పింది. నా పాదాలు ఇంచుమించు జారాయనే చెప్పవచ్చు.

[3] దుర్మార్గుల అభివృద్ధి చూచి, ఆ గర్విష్ఠుల విషయం అసూయపడ్డాను.

[4] తమ మరణ సమయంలో కూడా వాళ్ళకేమీ యాతన అనిపించదు. వాళ్ళు పుష్టిగా ఉన్నారు.

[5] మనుషులందరికీ వచ్చే కష్టాలు వాళ్ళకు ఉండవు. అందరిలాగే వాళ్ళ మీదికి విపత్తులు రావు.

[6] అందుకని గర్వం వాళ్ళ మెడచుట్టూ ఆభరణంలాగా ఉంది. దౌర్జన్యం వాళ్ళకు వస్త్ర ధారణంలాగా ఉంది.

[7] క్రొవ్వుచేత వాళ్ళ కండ్లు ఉబ్బి ఉన్నాయి. వాళ్ళ హృదయంలోని కపటోపాయాలకు మితం అంటూ లేదు.

[8] వాళ్ళు వేళాకోళంగా మాట్లాడుతారు. వాళ్ళ మాటల్లో దౌర్జన్యం ఉట్టిపడుతుంది. వాళ్ళు బడాయిలు చెప్పుకొంటారు.

[9] నోళ్ళు ఆకాశాన్ని అంటేలా పైకెత్తుకొంటారు. వాళ్ళ నాలుకలు భూమిమీద అంతటా ప్రాకుతాయి.

[10] గనుక వాళ్ళ మనుషులు వాళ్ళవైపే తిరుగుతారు. వాళ్ళు విస్తార జలం త్రాగుతారు.

[11] “దేవుడికి ఏం తెలుసు? సర్వాతీతుడనేవాడు ఎలా తెలుసుకుంటాడు?” ఈ విధంగా వాళ్ళు తలపోస్తారు.

[12] ఇరుగో వీళ్ళు దుర్మార్గులు. వాళ్ళు ఎప్పుడూ సురక్షితంగా ఉన్నారు. చాలా ఆస్తిపాస్తులు సంపాదించుకొనే వాళ్ళు.

[13] నా హృదయం శుద్ధిగా ఉంచుకోవడం వ్యర్థమే, నేను నిర్దోషినై నా చేతులు కడుక్కోవడం కూడా వృథా అనిపించింది.

[14] అయినా, రోజంతా నాకు బాధ! ప్రతి ఉదయమూ నేను శిక్షకు గురి అవుతున్నాను.

[15] “ఈ విధంగా మాట్లాడుదాం” అంటే ఈ తరంలో ఉన్న నీ ప్రజలను తప్పుదారి పట్టించి ఉండేవాణ్ణి అవుతాను.

[16] ఇదంతా అర్థం చేసుకోవాలని నేను లోతుగా ఆలోచించాను.

[17] గాని, నేను దేవుని పవిత్రాలయంలో ప్రవేశించేవరకు నాకు ఇది చాలా విసుగు కలిగించింది. అక్కడ వాళ్ళ చివరి స్థితిని గ్రహించాను.

[18] నీవు వాళ్ళను జారుడు స్థలాలలో నిలబెట్టావు. ఇందుకు అనుమానం లేదు. వాళ్ళను నీవు పడవేస్తావు. వాళ్ళు నాశనమవుతారు.

[19] క్షణంలో వాళ్లు ధ్వంసమైపోతారు. మహా భయాలకు గురి అయి వాళ్ళు సమూల నాశనమవుతారు.

[20] నిద్ర మేలుకొన్నప్పుడు కలను అలక్ష్యం చేసినట్టు, ప్రభూ, నీవు లేచి వాళ్ళ రూపాన్ని అలక్ష్యం చేస్తావు.

[21] నా హృదయం దుఃఖంతో నిండిపోయింది, నా అంతరంగం పోట్లు పొడుస్తూ వచ్చింది.

[22] అప్పుడు నేను తెలివి తక్కువవాడుగా, బుద్ధిహీనుడుగా ఉన్నాను. నీ ఎదుట నేను మృగంలాంటివాడుగా ఉన్నాను.

[23] అయినా నేను నీతో ఎల్లప్పుడూ ఉన్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకొన్నావు.

[24] నాకు నీవు ఆలోచన చెపుతూ దారి చూపుతావు. తరువాత నన్ను నీ వైభవ స్థలంలో చేర్చుకొంటావు.

[25] పరలోకంలో నా అనేవారు నాకింకెవరు? నీవు నాకు ఉన్నావు. ఇలా ఉండగా ఈ లోకంలో ఇంకెవ్వరూ, ఏదీ నాకక్కరలేదు.

[26] నా శరీరం, నా హృదయం కృశించిపొయ్యాయి. కానీ, శాశ్వతంగా నా హృదయానికి ఆధారశిల, నాకు కలిగిన వాటా దేవుడే!

[27] నీకు దూరమైపోయినవాళ్ళు నాశనమవుతారు. నిన్ను విడిచిపెట్టి వేశ్యలాగా ప్రవర్తించేవాళ్ళందరినీ నీవు నాశనం చేస్తావు.

[28] నా విషయం చెప్పనా? దేవుని దగ్గర ఉండడమే నా మేలు. నీ క్రియలన్నీ నేను చాటి చెప్పేలా యెహోవా ప్రభువును నేను నమ్మి ఆశ్రయించాను.

కీర్తనలు — Chapters