Skip to content
Opens in a new window

[1] నా హృదయం ఓ మంచి విషయంతో పొంగి పొర్లిపోతూ ఉంది. నేను చెప్పేది రాజును గురించిన కావ్యం. నా నాలుక త్వరగా వ్రాసేవాడి కలంలాంటిది.

[2] మనుషులందరి కంటే నీవు ఉత్తముడవు. నీ పెదవుల మీద దయ పోయబడింది. అందుచేత దేవుడు నీకు ప్రసాదించిన ఆశీస్సులు శాశ్వతమైనవి.

[3] బలాఢ్యుడా! నీ కత్తి కట్టుకో! నీ ప్రకాశమూ ప్రతాపమూ ధరించుకో!

[4] వైభవంతో విజయవంతంగా తరలివెళ్ళు! సత్యం, వినయం, న్యాయం పక్షంగా ముందుకు సాగిపో! నీ కుడి చేయి నీకు భయంకర క్రియలు ప్రదర్శిస్తుంది.

[5] నీ బాణాలు వాడిగా ఉన్నాయి. అవి రాజ శత్రువుల గుండెల్లో గుచ్చుకుంటాయి. నీ పాదాల క్రింద జనాలు కూలిపోతారు.

[6] దేవా! నీ సింహాసనం శాశ్వతంగా ఉంటుంది. నీ రాజదండం న్యాయ దండం.

[7] న్యాయమంటే నీకు ఎంతో ఇష్టం. అన్యాయాన్ని అసహ్యించుకొన్నావు. అందుచేత దేవుడు, నీ దేవుడు నిన్ను నీ సహచరులకంటే ఎక్కువగా ఆనంద తైలంతో అభిషేకించాడు

[8] నీవు ధరించిన వస్త్రాలన్నీ బోళం, అగరు, లవంగపట్ట సుగంధంతో గుభాళిస్తున్నాయి. దంతంతో కట్టిన భవనాలలోనుంచి తంతివాద్యాల వాదనం నీకు ఆనందం కలిగిస్తుంది.

[9] ఘనత వహించిన నీ పరివారంలో రాజుల కుమార్తెలు ఉన్నారు. ఓఫీరు‌దేశం బంగారు ఆభరణాలతో అలంకరించుకొని రాణి నీ కుడిప్రక్కన నిలబడి ఉంది.

[10] కుమారీ, విను! శ్రద్ధగా ఈ మాటలు చెవిని వేసుకో! నీ సొంత ప్రజలనూ నీ పుట్టింటినీ మరిచిపో!

[11] రాజు నీ అందాన్ని కోరుతాడు. ఆయన నీ ప్రభువు. ఆయనకు నమస్కరించు.

[12] తూరు కుమారి కానుక తెస్తుంది. ప్రజల్లో ధనికులు నిన్ను పొగడుతారు.

[13] అంతఃపురంలో రాకుమారి వైభవం సంపూర్ణమైనది. ఆమె ధరించిన వస్త్రాలు బంగారంతో బుట్టా వేసినవి.

[14] ఆమె వస్త్రాలంకారం వివిధమైన రంగులు గలది. ఆమెను రాజుదగ్గరికి తీసుకువస్తారు. ఆమె వెంట ఆమె కన్యలైన చెలికత్తెలు కూడా నీ దగ్గరికి వస్తారు.

[15] ఆనందంతో, ఉత్సాహంతో వారు వస్తారు, రాజభవనంలో ప్రవేశిస్తారు.

[16] నీ పూర్వీకుల స్థానంలోనే నీ కుమారులుంటారు. లోకమంతటా వారిని యువరాజులుగా నీవు నియమిస్తావు.

[17] తరతరాలు నీ పేరును స్మరించేలా చేస్తాను. గనుక లోక జనాలు నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాయి.

కీర్తనలు — Chapters