Skip to content
Opens in a new window

[1] సర్వ ప్రజలారా! ఈ విషయం వినండి. లోక నివాసులారా! మీరంతా ఈ సంగతి చెవిని బెట్టండి.

[2] అల్పులూ అధికులూ ధనికులూ పేదలూ అందరూ ఆలకించండి.

[3] తెలివైన మాటలు నా నోరు పలకబోతున్నది. నా హృదయంలోని తలంపులు వివేకం గలవి.

[4] నా చెవులకు సోకుతున్న సామెతమీద నా మనసు పెట్టి, తంతివాద్యం వాయిస్తూ, పొడుపు కథ విప్పుతాను.

[5] నన్ను పడగొట్టదలచేవాళ్ళ దుష్‌కృత్యాలు నా చుట్టు కనిపించే చెడ్డ రోజులు వచ్చినా నేనెందుకు భయపడాలి?

[6] వాళ్ళకు తమ ఆస్తిపాస్తులమీదే నమ్మకం. తమ అధిక సంపద విషయం విర్రవీగుతూ ఉంటారు వాళ్ళు.

[7] ఎవ్వడూ తన సాటి మనిషిని విడుదల చేయలేడు, విడుదలకోసం కావలసినంత వెల దేవునికి చెల్లించలేడు.

[8] వారి ఆత్మ విముక్తికి చెల్లించవలసిన వెల ఎంతో గొప్పది.

[9] తాను సమాధిని తప్పించుకుని ఎల్లకాలం బ్రతికేందుకు మనిషి ఆ వెల ఎన్నటికీ చెల్లించలేడు.

[10] ప్రతి వ్యక్తీ ఇది చూస్తాడు: తెలివైనవాళ్ళూ, తెలివితక్కువవాళ్ళూ, పశుప్రాయులూ ఏకంగా చస్తారు. వాళ్ళంతా అంతరించి తమ ధనధాన్యాలు ఇతరులకు వదలివేస్తారు.

[11] తమ ఇండ్లు చిర స్థాయిగా ఉంటాయని అనుకుంటున్నారు. తమ నివాసాలు తరతరాలకు నిలిచి ఉంటాయని వాళ్ళ భావన. తమ భూములకు తమ పేర్లే పెట్టుకుంటారు.

[12] కాని, మనుషులు అలాంటి ఘన స్థితిలో నిలవలేరు. నాశనమయ్యే జంతువులలాగా ఉన్నారు.

[13] వాళ్ళది తెలివితక్కువ ఆశాభావం. వాళ్ళకు పట్టే గతి ఇదే. వాళ్ళ మాటలను మెచ్చుకొంటూ వాళ్ళను అనుసరించేవాళ్ళకు కూడా అంతే. (సెలా)

[14] గొర్రెల మందలాగా వాళ్ళు త్రోసుకుపోతూ, మృత్యు లోకంలోకి సాగిపోతూ ఉన్నారు. వాళ్ళ కాపరి మరణమే! ఉదయాన్నే యథార్థపరులు వాళ్ళను పరిపాలిస్తారు. వాళ్ళు తమ నివాసాలు విడిచి మృత్యులోకానికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళ రూపం పాడైపోతుంది.

[15] కాని, దేవుడు నా ప్రాణాన్ని మృత్యులోక శక్తినుంచి తప్పకుండా విడుదల చేస్తాడు, నన్ను చేర్చుకుంటాడు. (సెలా)

[16] ఎవడో మనిషి ధనికుడయ్యాడనీ అతడి ఇంటి వైభవం వృద్ధి చెందిందనీ భయపడకండి.

[17] అతను కాలం చేసేటప్పుడు తనతో ఏమీ తీసుకుపోడు. అతడి వైభవం అతడి వెంట దిగిపోదు.

[18] అతడు బ్రతికినన్నాళ్ళు ఆత్మస్తుతి చేసుకుంటాడు. ఇతరులు “నీ వ్యవహారాలు బాగా నిర్వహించుకున్నావు” అంటారు.

[19] అయినా అతడు తన పూర్వీకుల తరంలో కలిసిపోతాడు. వారికి వెలుగంటూ మరెన్నడూ కనబడదు.

[20] తెలివితక్కువవాళ్ళు ఘన స్థితిలో ఉన్నా, చచ్చే జంతువులలాగా ఉంటారు.

కీర్తనలు — Chapters