[1] దేవా, నీ అనుగ్రహం ప్రకారం నన్ను కరుణించు! నీ అధిక వాత్సల్యం చొప్పున నా అక్రమ కార్యాలను తుడిచివెయ్యి!
[2] నా అపరాధంనుంచి నన్ను బాగా కడుగు! నా పాపం నుంచి నన్ను శుద్ధి చెయ్యి!
[3] నా అక్రమాలేవో నాకు తెలుసు. నా పాపం ఎప్పుడూ నా ఎదుటే ఉంది.
[4] నీకు, నీకు మాత్రమే విరుద్ధంగా నేను పాపం చేశాను. నీ దృష్టిలో చెడుగుగా కనబడేది నేను చేశాను. అందుచేత నీవు మాట్లాడేటప్పుడు న్యాయవంతుడుగా కనిపిస్తావు. నీవు తీర్పు చెప్పేటప్పుడు పవిత్రుడుగా గోచరిస్తావు.
[5] నేను భ్రష్ట స్వభావంతో పుట్టాను. నా తల్లి నన్ను గర్భం ధరించినప్పటినుంచీ నేను పాపిని.
[6] నీవు నా అంతరంగంలో నిజాయితీ కోరుతావు. జ్ఞానమేదో నా ఆంతర్యంలో నాకు తెలియజేస్తావు.
[7] హిస్సోప్‌రెమ్మతో నాకు పాపపరిహారం చెయ్యి. అప్పుడు నేను శుద్ధంగా ఉంటాను. నన్ను కడుగు. అప్పుడు నేను మంచుకంటే కూడా తెల్లగా అవుతాను.
[8] ఆనందం, సంతోషం కలిగించే మాట నాకు వినిపించు! నీవు విరిచిన ఎముకలను ఆనందించనియ్యి.
[9] నా పాపాలనుంచి నీ ముఖం అటు త్రిప్పుకో! నా దోషాలన్నీ తుడిచివెయ్యి!
[10] దేవా, నాకు శుద్ధ హృదయం కలిగించు! మళ్ళీ ఆత్మకు నిబ్బరం నాకు దయ చెయ్యి!
[11] నీ సమక్షంలో నుంచి నన్ను గెంటివేయకు! నీ పవిత్రాత్మను నా దగ్గరనుంచి తీసివేయకు!
[12] నీవిచ్చే పాపవిముక్తివల్ల కలిగే ఆనందం తిరిగి నాకు చేకూర్చు! విధేయతగల మనసును ప్రసాదించి నేను దృఢంగా నిలబడేలా చెయ్యి!
[13] అప్పుడు అక్రమకారులకు నీ విధానాలు ఉపదేశిస్తాను. పాపులు నీ వైపు తిరుగుతారు.
[14] దేవా, నన్ను రక్షించే దేవా! రక్తం ఒలికించిన అపరాధంనుంచి నన్ను విడుదల చెయ్యి! అప్పుడు నా నాలుక నీ న్యాయాన్ని సంకీర్తనం చేస్తుంది.
[15] ప్రభూ! నా పెదవులను తెరువు! అప్పుడు నా నోరు నీ ప్రఖ్యాతిని చాటుతుంది.
[16] నీకు బలి అంటే ఇష్టం లేదు. నీకు ఇష్టం ఉంటే నేను అర్పించేవాణ్ణే. హోమం వల్ల నీకు సంతోషం కలగదు.
[17] దేవునికి కావలసిన బలులు విరిగిన మనసు. దేవా, విరిగి నలిగిపోయిన హృదయాన్ని నీవు నిరాకరించవు.
[18] సీయోనుకు నీ దయగల సంకల్పం ప్రకారం మేలు చేకూర్చు. జెరుసలం గోడలను కట్టించు.
[19] అప్పుడు సరైన బలులు, సర్వాంగ హోమాలు నీకు ప్రీతికరమవుతాయి. నీ బలిపీఠంమీద కోడెలను అర్పించడం జరుగుతుంది.