[1] న్యాయవంతుడవైన నా దేవా! నేను మొరపెట్టినప్పుడు నాకు జవాబియ్యి. ఇరుకులో ఉన్న నాకు విశాలతను కలిగించేవాడవు నీవు. నా మీద దయ చూపి నా ప్రార్థన ఆలకించు.
[2] “మనుషులారా, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఘనతను అవమానంగా మారుస్తారు? ఎంతకాలమని వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు? భ్రమపెట్టేవాటిని వెదుకుతూ వుంటారు?” (సెలా)
[3] భక్తిపరులను యెహోవా తనకోసం ప్రత్యేకించుకొన్నాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మొర పెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడు.
[4] భయం కలిగి పాపం చేయకుండా ఉండండి. మీ పడకల మీద కూడా ధ్యానం చెయ్యండి, ప్రశాంతంగా ఉండండి. (సెలా)
[5] సరైన బలులు అర్పించండి. యెహోవా పై నమ్మకం ఉంచండి.
[6] “మాకెవరు మేలు చేస్తారు?” అంటున్నారు అనేకులు. యెహోవా! నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనియ్యి.
[7] వాళ్ళ ధాన్యం, ద్రాక్షరసం సమృద్ధిగా లభించిన నాటి సంతోషం కంటే ఎక్కువ సంతోషం నా హృదయంలో కలిగించావు నీవు.
[8] నేను పడుకొని ప్రశాంతంగా నిద్రపోతాను. యెహోవా! నీ వల్లే నేను క్షేమంగా నివాసం చేస్తున్నాను.