[1] యెహోవా, నీవు నన్ను బాగా పరిశోధించావు. నా సంగతంతా నీకు తెలుసు.
[2] నేను కూర్చోవడం, నిలవడం నీకు తెలుసు. నాలో తలంపు ఎలాంటిదో దూరంనుంచే గ్రహిస్తావు.
[3] నేనెక్కడికి వెళ్ళేదీ, నేనెక్కడ విశ్రమించేదీ నీవు పరిశీలనగా చూస్తావు. నా ప్రవర్తన అంతా నీకు తెలుసు.
[4] యెహోవా, నా నాలుకపైకి మాట రాకముందే అదేమిటో నీకు క్షుణ్ణంగా తెలుసు.
[5] వెనుకా, ముందూ నీవు నా చుట్టూరా ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచావు.
[6] ఇలాంటి తెలివి ఆశ్చర్యకరమే. అది నా మనసుకు మించినదే. అది నాకు పైగా ఉంది. నేను దానిని అందుకోలేను.
[7] నీ ఆత్మనుంచి నేనెక్కడికి వెళ్ళేది? నీ సముఖం నుంచి ఎక్కడికి పారిపొయ్యేది?
[8] ఆకాశానికి ఎక్కిపోదామంటే, నీవు అక్కడ ఉన్నావు. మృత్యులోకంలో పడుకుందామంటే, నీవు అక్కడ ఉన్నావు.
[9] ఉదయకాలం రెక్కలతో ఎగిరివెళ్ళి సముద్రం కొనలలో కాపురమేర్పరచుకొన్నా
[10] అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుంటుంది.
[11] “చీకటి నన్ను దాచివేస్తుంది, నా చుట్టు వెలుగు రాత్రి అవుతుంది” అనుకొంటే,
[12] చీకటి కూడా నీకు చీకటి కాదు. రాత్రి నీకు పగటి వెలుగులాంటిది. చీకటీ, వెలుగూ ఈ రెండూ నీకు ఒకటే!
[13] నా అంతరంగాన్నీ సృజించినది నీవే. మాతృగర్భంలో నన్ను రూపొందించినది నీవే.
[14] నీవు నన్ను సృజించిన విధం చూస్తే భయం, ఆశ్చర్యం కలిగేవి. గనుక నేను నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. నీ క్రియలు అద్భుతమైనవి. ఆ సంగతి నాకు బాగా తెలుసు.
[15] నేను రహస్యంలో నిర్మాణమవుతూ ఉన్నప్పుడు, నా రూపం భూమి అగాధ స్థలాల్లో ఏర్పడుతూ ఉంటే అది నీకు కనబడని విషయం కాదు.
[16] నేను పిండరూపంలో ఉన్నప్పుడు నీ కండ్లు నన్ను చూశాయి. నాకు నియమించబడిన రోజులలో ఒకటి కూడా గతించక మునుపే నా రోజులన్నీ నీ గ్రంథంలో రాసి ఉన్నాయి.
[17] దేవా, నీ ఆలోచనలు నాకెంతో విలువైనవి. అవన్నీ వెరసి ఎంతో గొప్ప మొత్తమవుతుంది.
[18] లెక్కపెట్టాలనుకొంటే అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువ. నేను నిద్ర మేల్కొన్నప్పుడు నేనింకా నీ దగ్గరే ఉన్నాను.
[19] దేవా, దుర్మార్గులను నీవు తప్పనిసరిగా హతమారుస్తావు. హంతకులారా! నా దగ్గరనుంచి వెళ్ళిపోండి!
[20] ఆ నీ శత్రువులు నీ విషయం చెడ్డగా మాట్లాడుతారు. మోసంగా నీ పేరు మీద ప్రమాణం చేస్తారు.
[21] యెహోవా, నిన్ను ద్వేషించే వాళ్ళంటేనే నాకు ద్వేషం గదా. నీ మీద తిరుగుబాటు చేసేవాళ్ళంటే నాకు అసహ్యం గదా.
[22] వాళ్ళ మీద నాకు పూర్తిగా ద్వేషం ఉంది. వాళ్ళను నా శత్రువుల క్రింద లెక్కించాను.
[23] దేవా, నన్ను పరిశోధించు, నా హృదయంలో ఏమున్నదో చూడు. నన్ను పరీక్ష చెయ్యి. నా ఆలోచనలు ఎలాంటివో
[24] నా బ్రతుకులో దుఃఖకరమైన విధానమేదైనా ఉన్నదేమో చూడు. నేను శాశ్వత మార్గంలో నడిచేలా చెయ్యి.