Skip to content
Opens in a new window

[1] యెహోవా, నన్ను ఎదిరించే వాళ్ళను నీవు ఎదిరించు. నాతో పోరాడేవాళ్ళతో పోరాడు.

[2] డాలు, కేడెం పట్టుకొని నా పక్షాన నిలిచి సహాయం చెయ్యి.

[3] ఈటె దూసి నన్ను తరిమేవాళ్ళను అడ్డగించు. “నేనే నీ విముక్తి” అని నాతో చెప్పు.

[4] నా ప్రాణం కోసం కాచుకొని ఉన్న వాళ్ళకు సిగ్గూ, తలవంపులూ కలుగుతాయి గాక! నాకు హాని చేయడానికి కుట్ర పన్నేవాళ్ళు వెనక్కు పడి ఆశాభంగం చెందుతారు గాక!

[5] వాళ్ళు గాలికి కొట్టుకుపోయే పొట్టులాగా ఉంటారు గాక! యెహోవా దూత వాళ్ళను వెళ్ళగొట్టివేస్తాడు గాక!

[6] వాళ్ళ బాట చీకటిగా, జారిపడే బాటగా అవుతుంది గాక! యెహోవా దూత వాళ్ళను తరుముతాడు గాక!

[7] ఎందుకంటే నిష్కారణంగా నా కోసం రహస్యంగా వల పన్నారు వాళ్ళు. నిష్కారణంగా నా ప్రాణానికి గుంట తవ్వారు.

[8] తెలియకుండానే నాశనం అతడి పై పడుతుంది గాక! అతడు రహస్యంగా పన్నిన వలలో అతడే చిక్కుపడుతాడు గాక! అందులో అతడు పడి నాశనమైపోతాడు గాక!

[9] అప్పుడు నేను యెహోవా విముక్తిని గురించి ఆనందిస్తాను. ఆయన మూలంగా నాకు హృదయంలో ఉల్లాసంగా ఉంటుంది.

[10] నా ఎముకలన్నీ మాట్లాడుతాయి “యెహోవా! నిన్ను పోలినవాడెవడు? వారికంటే ఎక్కువ బలంగలవాళ్ళ చేతిలో నుంచి బాధితులను తప్పిస్తావు, వారిని దోచుకునేవాళ్ళ బారినుంచి బాధితులనూ దరిద్రులనూ విడిపిస్తావు నీవు.”

[11] దౌర్జన్యపరులైన సాక్షులు ముందుకు వచ్చి నాకే తెలియనివి నన్ను అడుగుతున్నారు.

[12] నేను చేసిన మేలుకు కీడు జరిగించి, నన్ను దిక్కులేనివాడుగా చేసేవాళ్ళు.

[13] వాళ్ళకు జబ్బు చేసినప్పుడు నేను మాత్రం గోనెపట్టలు కట్టుకొన్నాను. ఉపవాసముండి నా ప్రాణాన్ని అణచివేశాను. జవాబు లేకుండా నా ప్రార్థనలు నాకు తిరిగి వచ్చినప్పుడు,

[14] వాళ్ళు నాకు స్నేహితులుగా సోదరులుగా ఉన్నట్టే మసులు కొన్నాను. తల్లి మరణిస్తే ఏడ్చేవాడిలాగా శోకించి క్రుంగిపోయాను.

[15] కాని, నేను కుంటుతూ నడిస్తే, వాళ్ళు నన్ను చూచి సంతోషంతో గుమికూడారు. నాకు తెలియకుండానే నీచులు నాకు విరోధంగా గుమికూడి అదే పనిగా నన్ను తిట్టారు.

[16] విందులలో వేళాకోళం, దూషణం చేసే భక్తిహీనులలాగా వీళ్ళు నావిషయం ద్వేషం వెలిబుచ్చుతూ పళ్ళు కొరికారు.

[17] స్వామీ, ఎన్నాళ్ళు ఇలా చూస్తూ ఊరుకొంటావు? వాళ్ళు నా జీవాన్ని ధ్వంసం చేయకుండేలా నన్ను రక్షించు. ఉన్నది ఒకే బ్రతుకు. దానిని ఆ సింహాల బారినుంచి తప్పించు.

[18] మహా సమావేశంలో నీకు కృతజ్ఞత చెప్తాను. గొప్ప జనసమూహంలో నిన్ను స్తుతిస్తాను.

[19] అబద్ధికులైన నా శత్రువులు నా గురించి సంతోషపడకుండా చెయ్యి. నిష్కారణంగా నన్ను ద్వేషించేవాళ్ళు కన్ను గీటకుండా చెయ్యి.

[20] ఎందుకంటే, వాళ్ళు శాంతివాక్కులు పలకరు. దేశంలో ప్రశాంతంగా బ్రతికేవారికి విరోధంగా అబద్ధాలు కల్పిస్తారు.

[21] నోరు పెద్దగా తెరచి నన్ను ఆడిపోసుకుంటూ “ఆహాహా! అతడు చేసినది మా కళ్ళకు కనబడింది లే” అన్నారు వాళ్ళు.

[22] యెహోవా, నీవు ఇదంతా చూశావు గదా! మౌనం వహించకు! నాకు దూరమైపోకు, స్వామీ!

[23] నా దేవా, నా ప్రభూ, లే! నాకు న్యాయం చేకూర్చు. నా పక్షాన నిలబడు.

[24] యెహోవా! నా దేవా! నీ న్యాయబుద్ధిని అనుసరించి నాకు న్యాయం జరిగించు. నామీద వాళ్ళను ఉప్పొంగనియ్యకు.

[25] వాళ్ళు మనసులో “ఆహా గెలిచాం!” అని చెప్పుకోకూడదు. “అతణ్ణి మింగేశాం!” అనుకోకూడదు.

[26] నా ఆపద చూచి సంతోషపడే వాళ్ళందరినీ సిగ్గు ఆవరించాలి. వాళ్ళకు ఆశాభంగం కలుగుతుంది గాక! నాకు వ్యతిరేకంగా గొప్పలు చెప్పుకొనేవాళ్ళను సిగ్గూ, అగౌరవమూ కప్పివేస్తాయి గాక!

[27] నేను నిర్దోషిగా నిరూపించబడాలని ఇష్టమున్నవారు సంతోషించి ఆనందధ్వనులు చేస్తారు గాక! “యెహోవా తన సేవకుడి సంక్షేమానికి ఎంతో ఆనందిస్తాడు. ఆయన కీర్తి అధికం కావాలి!” అని ఎల్లప్పుడూ అంటూ ఉండాలి వారు.

[28] నా నాలుక నీ న్యాయాన్ని గురించీ, నీ ప్రశంస గురించీ సర్వదా మాట్లాడుతుంది.

కీర్తనలు — Chapters