Skip to content
Opens in a new window

[1] దేవుడే మనకు బలం. ఆయనకు సంతోషంతో పాడండి. యాకోబుయొక్క దేవుణ్ణి ఉద్దేశించి ఆనంద ధ్వనులు చేయండి.

[2] సంకీర్తనం చేయండి. కంజరి మోగించండి. చెవికి ఇంపైన తంతివాద్యాలు వాయించండి.

[3] అమావాస్య, పౌర్ణమి పండుగ రోజున మన సమయంలో పొట్టేలుకొమ్ము బూర ఊదండి.

[4] ఇది ఇస్రాయేల్‌ప్రజలకు చట్టం. యాకోబుయొక్క దేవుడు ఇచ్చిన నిర్ణయం.

[5] ఆయన ఈజిప్ట్‌దేశసంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి దీనిని శాసనంగా నెలకొల్పాడు. నేను గుర్తించని స్వరం ఇలా చెప్పడం విన్నాను:

[6] “వారి భుజాలనుంచి నేను బరువు దించాను. వారి చేతులు గంపలెత్తుకొని మోయకుండా విడుదల పొందాయి.

[7] కష్టదశలో మొరపెట్టావు నీవు. నేను నిన్ను విడిపించాను. ఉరుములు దాగి ఉన్న చోటునుంచి నీకు నేను జవాబు చెప్పాను. మెరీబా నీళ్ళ దగ్గర నిన్ను పరీక్షకు గురి చేశాను. (సెలా)

[8] నా ప్రజలారా, ఆలకించండి. నేను మీకు ఒక సంగతి తెలియజేస్తాను. అయ్యో, ఇస్రాయేల్, నీవు నా మాట విని ఉంటే ఎంత బావుండేది!

[9] ఇతర దేవుళ్ళు మీమధ్య ఉండడానికి వీల్లేదు. వేరే దేవుణ్ణి మీరు పూజించకూడదు.

[10] నేనే మీ దేవుణ్ణి, యెహోవాను. ఈజిప్ట్‌నుంచి మిమ్మల్ని తెచ్చినది నేనే. నీ నోరు బాగా తెరువు. దానిని నింపుతాను.

[11] అయినా నా ప్రజలు నా మాట వినలేదు. ఇస్రాయేల్‌ప్రజలు నాకు విధేయులు కాలేదు.

[12] గనుక వారిని తమ సొంత ఉద్దేశాలను అనుసరించనిచ్చాను. వారి హృదయ కాఠిన్యానికి వారిని అప్పగించాను.

[13] అయ్యో, నా ప్రజలు నా మాట వింటే ఎంత బాగుండేది! ఇస్రాయేల్ నా విధానాలను అనుసరిస్తే ఎంత బాగుండేది!

[14] అప్పుడు నేను వారి శత్రువులను త్వరలో అణచివేసేవాణ్ణి. వారి పగవాళ్ళను నేను దండించేవాణ్ణి.

[15] యెహోవాను ద్వేషించేవాళ్ళు నాకు విధేయత నటిస్తారు. వాళ్ళకు నిత్య నాశనం తప్పదు.

[16] మంచి గోధుమలతో నేను నా ప్రజలను పోషిస్తాను. కొండ తేనెతో నీకు తృప్తి చేకూరుస్తాను.”

కీర్తనలు — Chapters