[1] దేవా, నా ప్రార్థన చెవినిబెట్టు. నా విజ్ఞప్తికి ముఖం త్రిప్పుకోకు.
[2] నా మనవి విను. జవాబు చెప్పు. శత్రువులు వేసే కేకలు, దుర్మార్గులు పెట్టే హింసల కారణంగా
[3] నా తలంపులలో నేను అటూ ఇటూ కొట్టుమిట్టాడుతున్నాను. మూలగక తప్పడం లేదు నాకు. దౌర్జన్యాన్ని నామీద జరిగిస్తారు వాళ్ళు. కోపంతో నా వెంటబడుతున్నారు.
[4] నాకు హృదయంలో ఎంతో వేదన కలిగింది. మరణ బీతి నా మీద పడింది.
[5] భయమూ, వణుకూ నామీదికి వచ్చాయి. భయాతిరేకం నన్ను ఆవరించింది.
[6] అహో, పావురంలాగా నాకూ రెక్కలుంటే నేను ఎగిరిపోయి, హాయిగా ఉండేవాణ్ణి గదా.
[7] దూరంగా ఎక్కడికో త్వరగా వెళ్ళిపోయి ఉండేవాణ్ణి, అరణ్యంలో ఉండిపోయేవాణ్ణి. (సెలా)
[8] పెనుగాలినీ, తుఫానునూ వేగంగా తప్పించుకొని ఉండేవాణ్ణి అనుకున్నాను.
[9] పట్టణంలో బలాత్కారం, పోరాటాలు నేను చూస్తున్నాను. ప్రభూ! అలాంటి కార్యాలు చేసేవాళ్ళను తుదముట్టించు! వాళ్ళ మాటలు తారుమారు చెయ్యి!
[10] రాత్రింబగళ్ళు వాళ్ళు పట్టణం గోడలమీద తచ్చాడుతూ ఉన్నారు. పట్టణం మధ్య చెడుతనం, కష్టం ఉన్నాయి.
[11] అందులో నాశనకరమైన క్రియలు జరుగుతున్నాయి. దాని వీధులనుంచి దౌర్జన్యం, వంచన విడిచిపోవు.
[12] శత్రువు కాదు నన్ను దూషిస్తున్నది. శత్రువైతే నేను సహించగలను. నాకు పైగా కూర్చుని విర్రవీగేవాడు పగవాడు కాదు. పగవాడైతే అతడి దగ్గరనుంచి దాక్కొనేవాణ్ణి.
[13] ఈ విధంగా చేసిన మనిషివి నీవే. నీవు నా సహచరుడివి. నా మిత్రుడివి.
[14] ఒకరితో ఒకరం మధురమైన సహవాసం అనుభవించేవాళ్ళం. ఉత్సవంగా వెళ్ళే గుంపుతో కలిసి దేవుని ఆలయానికి నడిచేవాళ్ళం.
[15] వాళ్ళ ఇండ్లలో, వాళ్ళ అంతరంగంలో చెడుగు ఉంది. వాళ్ళమీదికి నాశనం ఆకస్మికంగా వస్తుంది గాక! ప్రాణంతోనే వాళ్ళు మృత్యు లోకానికి దిగిపోతారు గాక!
[16] నేను దేవునికి మొర పెట్టుకొంటాను. యెహోవా నన్ను రక్షిస్తాడు.
[17] సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం త్రికాలాల్లో నేను మూలుగుతూ ధ్యానిస్తాను. ఆయన నా స్వరం వింటాడు.
[18] నాతో పోరాడేవాళ్ళు చాలామంది. అయినా ఈ పోరాటంనుంచి నా ఆత్మను ఆయన ప్రశాంతంగా ఉంచి రక్షిస్తాడు.
[19] దేవుడు అనాది కాలంనుంచి సింహాసనాసీనుడు. ఆయన వింటాడు. వాళ్ళను అణచివేస్తాడు. (సెలా) వాళ్ళు తమ బ్రతుకు తీరును మార్చుకోరు. దేవుడంటే వాళ్ళకు భయమేమీ లేదు.
[20] అలాంటివాడు తనతో సఖ్యంగా ఉన్నవాళ్ళమీద చెయ్యి ఎత్తుతాడు. తాను చేసిన ఒప్పందం తానే భంగం చేస్తాడు.
[21] అతడి నోట్లోనుంచి వెలువడే మాటలు వెన్నలాగా ఎంతో మెత్తనివి. కాని, అతడి హృదయంలో యుద్ధం చెలరేగుతూ ఉంటుంది. అతడి మాటలు నూనెలాగా నునుపుగా ఉంటాయి. కాని, అవి వర దీసిన ఖడ్గంలాంటివి.
[22] నీ బరువంతా యెహోవామీద మోపు. ఆయనే నీకు అండగా ఉంటాడు. న్యాయవంతులను పడిపోనివ్వడు ఆయన.
[23] దేవా, నీవు దుర్మార్గులను నాశనకరమైన గుండంలో పడవేస్తావు. రక్తపాతం జరిగించేవాళ్ళు, మోసగాండ్లు తమ రోజుల్లో సగ భాగం కూడా బ్రతకరు. కాని, నేను నిన్ను నమ్ముకొన్నాను.