[1] సేనల ప్రభువైన యెహోవా! నీ నివాస స్థలాలు ఎంత ప్రియమైనవి!
[2] యెహోవా ఆవరణాల సందర్శనం కోసం నా అంతరంగం ఎంతో ఆశిస్తూ ఉంది, తహతహలాడుతూ ఉంది. సజీవ దేవుని దర్శనార్థం నా హృదయం, నా శరీరం ఆనంద ధ్వనులు చేస్తున్నాయి.
[3] సేనలప్రభువైన యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం దగ్గరే పిచ్చుకలకు నివాసం దొరికింది. పిల్లలు పెట్టడానికి వానకోవెల అక్కడే గూడు కట్టుకోగలిగింది.
[4] నీ ఆలయంలో నివాసం చేసేవారు ధన్యజీవులు. వారు ఎప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఉంటారు. (సెలా)
[5] ఎవరి బలం నీలోనే ఉందో, ఎవరి హృదయంలో యాత్ర మార్గాలు ఉన్నాయో వారు ధన్యులు.
[6] వారు బాఖా లోయలోగుండా సాగిపోతూ ఉంటే, దానిని ఊటగా మారుస్తారు. తొలకరి వర్షం ఆ స్థలాన్ని ఆశీస్సులతో ఆవరించివేస్తుంది.
[7] వారి బలం ఎక్కువ అవుతూ ఉంది, వారి ప్రయాణం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ సీయోనులో దేవుని సమక్షంలో కనబడతారు.
[8] యెహోవా, సేనల ప్రభువైన దేవా, నా ప్రార్థన విను. యాకోబు యొక్క దేవా, ఇది నీ చెవిని పడనియ్యి. (సెలా)
[9] దేవా, మాకు డాలులాంటివాడివి నీవు. మా వైపు చూడు. నీ అభిషిక్తుడి ముఖం చూడు.
[10] నీ ఆవరణాలలో గడిపిన ఒక్క రోజు వెయ్యి రోజులకంటే మేలైనది. దుర్మార్గుల నివాసాలలో కాపురముండడం కంటే నా దేవుని ఆలయద్వారం దగ్గర నిలబడి ఉండడం నాకిష్టం.
[11] యెహోవా దేవుడు మాకు సూర్యప్రకాశం లాంటివాడు, డాలులాంటివాడు. కృపనూ, ఘనతనూ యెహోవా ప్రసాదిస్తాడు. యథార్థ ప్రవర్తన గల వారికి ప్రతి మేలూ అనుగ్రహిస్తాడు.
[12] సేనల ప్రభువైన యెహోవా, నీమీద నమ్మకం ఉన్నవారే ధన్యజీవులు.