[1] నా హృదయం నిశ్చలంగా ఉంది, దేవా! నా ఆత్మపూర్వకంగా పాటలు పాడుతాను, సంకీర్తనం చేస్తాను.
[2] తంతివాద్యమా, మేలుకో! విపంచికా, మేలుకో! నేను ప్రొద్దున్నే, పెందలకడనే మేలుకొంటాను.
[3] జనాలమధ్య నిన్ను స్తుతిస్తాను, యెహోవా. ఇతర ప్రజల మధ్య నిన్ను కీర్తిస్తాను.
[4] నీ అనుగ్రహం గొప్పది. ఆకాశంకంటే ఎత్తయినది. నీ సత్యం మేఘాలను అంటుతుంది.
[5] దేవా, ఆకాశాలకంటే ఉన్నత స్థితిలో ఉన్నావని బయలుపరచు. భూతలమంతటి మీద నీ మహత్యం కనబడనియ్యి.
[6] నీ ప్రజలకు విడుదల కలిగేలా నీ కుడి చేతితో మమ్మల్ని రక్షించు. మేము అడిగిన దానికి జవాబివ్వు.
[7] తన పవిత్ర స్థలం నుంచి దేవుడు మాట ఇచ్చాడు: “నేను ఆనందిస్తాను, షెకెం కనుమను పంచియిస్తాను, సుక్కోతు లోయ కొలిపించి ఇస్తాను.
[8] గిలాదు నాదే. మనష్షే నాదే. ఎఫ్రాయిం నా శిరస్త్రాణం. యూదా నా రాజదండం.
[9] మోయాబు కాళ్ళు కడుక్కొనే నా పాత్ర. ఎదోం మీదికి నా పాదరక్ష విసిరివేస్తాను. ఫిలిష్తీయ మీద విజయ ధ్వనులు చేస్తాను.”
[10] గోడ, కోట ఉన్న పట్టణానికి నన్ను తీసుకువెళ్ళేవాడెవడు? ఎదోంకు నన్ను వెంటబెట్టుకు వెళ్ళేవాడెవడు?
[11] దేవా! నీవు మమ్మల్ని విసర్జించావు గదూ. దేవా! మా సేనలతో నీవు రావడం మానివేశావు గదూ.
[12] శత్రువులను ఓడించడానికి మాకు సహాయం చెయ్యి. మనిషి చేయగల సహాయం వృథా!
[13] దేవుని ద్వారానే మేము విజయం సాధిస్తాం. మా శత్రువులను ఆయనే అణగదొక్కివేస్తాడు.