[1] నా దేవా, నా రాజా, నిన్ను ఘనపరుస్తాను. నిరంతరమూ నీ పేరును కీర్తిస్తాను.
[2] ప్రతి రోజూ నిన్ను కీర్తిస్తాను. నిరంతరమూ నీ పేరును స్తుతిస్తాను.
[3] యెహోవా గొప్పవాడు. ఆయన ఎంతో స్తుతిపాత్రుడు. ఆయన గొప్పతనం గ్రహింపుకు మించేది.
[4] ఒక తరం మనుషులు మరో తరానికి నీ క్రియలను కొనియాడుతారు. నీ బలవత్తరమైన చర్యలు వెల్లడి చేస్తారు.
[5] నీ ఘనమైన గౌరవపూర్ణ వైభవాన్నీ, అద్భుతమైన నీ క్రియలనూ నేను ధ్యానిస్తాను.
[6] భయభక్తులు కలిగించే నీ క్రియల ప్రభావాన్ని గురించి మనుషులు చెప్పుకొంటారు. నేను నీ గొప్పతనాన్ని గురించి వివరిస్తాను.
[7] నీ మహా మంచితనాన్ని గురించిన కీర్తి వారు చాటిస్తారు. నీ న్యాయాన్ని గానం చేస్తారు.
[8] యెహోవా దయాపరుడు, వాత్సల్యపూర్ణుడు, త్వరగా కోపపడనివాడు, అత్యంత కృప చూపేవాడు.
[9] ఆయన అందరికీ మంచి చేస్తాడు. ఆయన వాత్సల్యం ఆయన సృష్టి అంతటిమీద ఉంది.
[10] యెహోవా! నీవు చేసినదానంతటి మూలంగా నీకు స్తుతులు కలుగుతాయి. నీ భక్తులు నిన్ను సన్నుతిస్తారు.
[11] మనుషులకు నీ బలమైన క్రియలనూ, నీ రాజ్య ఘనతనూ తెలియజేయాలని
[12] వారు నీ రాజ్య ఘనమైన వైభవ విషయం చెపుతారు. నీ బలాన్ని గురించి మాట్లాడుతారు.
[13] నీ రాజ్యం ఎప్పటికీ ఉంటుంది. నీ రాజ్యపరిపాలన తరతరాలకూ ఉంటుంది.
[14] పడిపోయేవారందరికీ యెహోవా సహాయం చేస్తాడు. అణగారిపోయిన వారందరినీ పైకెత్తుతాడు.
[15] అన్ని ప్రాణుల కండ్లు నీవైపు ఆశతో చూస్తున్నాయి. సరైన వేళకు నీవు వాటికి ఆహారం అనుగ్రహిస్తావు.
[16] నీవు గుప్పిలి విప్పి ప్రతి ప్రాణి కోరిక తీరుస్తావు.
[17] యెహోవా తన విధానాలన్నిటిలో న్యాయవంతుడు, ఆయన క్రియలన్నిటిలో కృప చూపుతాడు.
[18] తనకు ప్రార్థన చేసేవారందరికీ యథార్థంగా ప్రార్థించేవారికి యెహోవా దగ్గరగా ఉన్నాడు.
[19] తనంటే భయభక్తులున్న వారి కోరిక ప్రకారం ఆయన చేస్తాడు. సహాయంకోసం వారు పెట్టే మొర విని వారిని రక్షిస్తాడు.
[20] తనను ప్రేమించే వారందరినీ ఆయన కాపాడుతాడు. దుర్మార్గులందరినీ ఆయన నాశనం చేస్తాడు.
[21] నా నోరు యెహోవా స్తుతి పలుకుతుంది. శరీరం ఉన్నవారంతా ఆయన పవిత్రమైన పేరును శాశ్వతంగా కీర్తిస్తారు గాక!