[1] యెహోవాను స్తుతించండి! మన దేవుణ్ణి సంకీర్తనం చేయడం మంచిది. అది మనోహరం. దేవ సంస్తుతి ఎంతైనా తగినది.
[2] యెహోవాయే జెరుసలంను కట్టించేవాడు. చెదరిపోయిన ఇస్రాయేల్‌ప్రజలను సమకూర్చేవాడు ఆయనే.
[3] గుండెలు బ్రద్దలైపోయిన వారిని ఆయన బాగు చేస్తాడు. వారి గాయాలకు చికిత్స చేస్తాడు.
[4] నక్షత్రాల లెక్క ఆయనకు తెలుసు. ప్రతి నక్షత్రానికి ఆయన పేరు పెట్టేవాడు.
[5] మన ప్రభువు గొప్పవాడు. ఆయనది అత్యంత బలం. ఆయన జ్ఞానం అనంతమైనది.
[6] దీనావస్థలో ఉన్నవారిని యెహోవా ఆదరిస్తాడు. దుర్మార్గులను నేలమట్టం చేస్తాడు.
[7] కృతజ్ఞత కలిగి యెహోవాకు సంకీర్తనం చెయ్యండి. తంతివాద్యంతో దేవునికి స్తుతిగీతాలు పాడండి.
[8] ఆయన ఆకాశాన్ని మేఘాలతో కప్పివేస్తాడు. భూమికి వర్షం ఇస్తాడు. కొండల మీద గడ్డి మొలిపిస్తాడు.
[9] పశువులకు, కావుకావుమనే కాకి పిల్లలకు ఆయన ఆహారం అనుగ్రహిస్తాడు.
[10] గుర్రాల బలమంటే ఆయనకు సంతోషం ఉండదు. మనిషి కాల్బలం అంటే ఆయనకు ఆనందం ఉండదు.
[11] యెహోవాపట్ల భయభక్తులు ఉన్నవారంటే, ఆయన అనుగ్రహం కోసం ఎదురు చూచేవారంటే ఆయనకు ఆనందం.
[12] జెరుసలమా! యెహోవాను స్తుతించు! సీయోను! నీ దేవుణ్ణి కీర్తించు!
[13] ఆయన నీ గుమ్మాల గడియలను బలమైనవిగా చేశాడు. నీ మధ్య నీ ప్రజలను ఆయన దీవించాడు.
[14] నీ పొలిమేరల్లో శాంతి సంస్థాపన చేసేవాడు ఆయనే. మంచి గోధుమ పంటతో నీకు తృప్తి కలిగించేవాడు ఆయనే.
[15] ఆయనే భూతలంమీద ఆజ్ఞ జారీ చేశాడు. ఆయన వాక్కు చాలా వేగంగా పరుగెత్తిపోతుంది.
[16] గొర్రెబొచ్చులాంటి తెల్లటి మంచు ఆయనే కురిపిస్తాడు. బూడిదలాంటి మంచు కణాలు ఆయనే చల్లుతాడు.
[17] వడగండ్లు ఆయనే తునకలుగా విసరివేస్తాడు. ఆయన పుట్టించే చలికి ఎవరు తట్టుకోగలరు?
[18] ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ కరిగిపోతాయి. ఆయన గాలి వీచేలా చేస్తే నీళ్ళు పారుతాయి.
[19] తన వాక్కును ఆయన యాకోబుకు తెలియజేశాడు. తన ఆదేశాలు, న్యాయ నిర్ణయాలు ఇస్రాయేల్‌కు తెలిపాడు.
[20] మరి ఏ ఇతర ప్రజకు ఆయన ఈ విధంగా జరిగించలేదు. ఆయన న్యాయ నిర్ణయాలు వాళ్ళు తెలుసుకోలేదు. యెహోవాను స్తుతించండి!