[1] యెహోవా! మా ప్రభూ! భూలోకమంతట్లో నీ పేరు ఎంత ఉత్తమమైనది! ఆకాశాలలో నీ మహత్యాన్ని కనుపరుస్తున్నావు.
[2] నీ శత్రువుల కారణంగా విరోధులనూ పగ తీర్చు కొనేవాళ్ళనూ ఊరుకొనేలా చేయడానికి నీవు చిన్న పిల్లలూ చంటి బిడ్డలూ స్తుతించేలా చేశావు.
[3] నీవు చేతితో చేసిన ఆకాశాలనూ, నీవు కలిగించిన చంద్ర నక్షత్రాలనూ నేను చూస్తూ ఇలా అనుకుంటాను:
[4] నీవు మనిషిని తలచుకోవడానికి వాడెంతటివాడు? నరపుత్రుణ్ణి గురించి ఆలోచించడానికి వాడేపాటివాడు?
[5] అతణ్ణి కొంతకాలం పాటు దేవదూతలకంటే తక్కువ వాణ్ణి చేశావు. కాని, గౌరవం, ఘనతలు అతడిమీద కిరీటంలాగా ధరింపజేశావు.
[6] నీ చేతితో నిర్మించిన వాటి మీద అతనికి అధికారమిచ్చావు. అతడి పాదాల క్రింద సమస్తమూ ఉంచావు.
[7] గొర్రెలూ ఎద్దులూ ఒకటేమిటి భూజంతువులనూ,
[8] గాలిలో ఎగిరే పక్షులనూ, సముద్రంలో చేపలనూ, సముద్రాల త్రోవలలో తిరిగే అన్ని జలచరాలనూ అతడి పాదాల క్రింద ఉంచావు.
[9] యెహోవా! మా ప్రభూ! భూలోకమంతట్లో నీ పేరు ఎంత ఉత్తమమైనది!