Skip to content
Opens in a new window

[1] నా స్తుతికి పాత్రుడవైన దేవా! మౌనం వహించకు.

[2] నాకు వ్యతిరేకంగా దుర్మార్గులూ, వంచకులూ నోరు తెరిచారు. నా గురించి అబద్ధాలు చెప్పుకొంటున్నారు.

[3] నన్ను చుట్టుముట్టి, మాటల్లో నా మీద విద్వేషం వెళ్ళబోసుకుంటున్నారు. నిష్కారణంగా నాతో పోరాడుతున్నారు.

[4] నేను చూపిన స్నేహానికి ప్రతిఫలంగా నా మీద పగపట్టారు. నేనేమో ప్రార్థన చేస్తూనే ఉన్నాను.

[5] నేను చేసిన మేలుకు వాళ్ళు కీడే చేస్తున్నారు. నేను చూపిన స్నేహానికి వాళ్ళు చూపేది విద్వేషమే.

[6] అతడిమీద దుర్మార్గుణ్ణి అధికారిగా నియమించు! నేరం మోపే శత్రువు అతడి కుడి ప్రక్కనే నిలుస్తాడు గాక!

[7] అతడికి తీర్పు జరిగినప్పుడు అతడు దోషి అని రుజువవుతుంది గాక! అతడి ప్రార్థన పాపం అవుతుంది గాక!

[8] అతడు బ్రతికే రోజులు కొద్దివే అవుతాయి గాక! అతడు ఉద్యోగం మరొకరి పాలవుతుంది గాక!

[9] అతడి పిల్లలు తండ్రి లేని వాళ్ళవుతారు గాక! అతడి భార్య విధవరాలవుతుంది గాక!

[10] అతడి పిల్లలు బిచ్చగాండ్లయి తిరుగులాడుతారు గాక! పాడైపోయిన తమ ఇండ్లకు దూరమై బ్రతుకుదెరువు కోసం వెదకుతారు గాక!

[11] అప్పులవాళ్ళు అతడికి ఉన్నదంతా ఆక్రమించుకుంటారు గాక! ఇతరుల చేతిలో అతడి కష్టార్జితం దోపిడీ అవుతుంది గాక!

[12] అతడిమీద దయ చూపేవారెవ్వరూ లేకపోతారు గాక! తండ్రి లేని అతడి పిల్లలను జాలి చూపేవారెవ్వరూ లేకపోతారు గాక!

[13] అతడి వంశం అంతరిస్తుంది గాక! రాబోయే తరంలోనే వాళ్ళ నామరూపాలు తుడిచి పెట్టుకుపోతాయి గాక!

[14] అతడి పూర్వీకుల అపరాధాలు యెహోవా జ్ఞాపకం ఉంచుకుంటాడు గాక! అతడి తల్లి చేసిన తప్పిదాలను తుడిచివేయడం జరగదు గాక!

[15] భూమిమీద వాళ్ళ విషయం జ్ఞాపకమంటూ మిగలకుండా యెహోవా నిర్మూలం చేస్తాడు గాక! వాళ్ళ పాపాలన్నీ ఆయన ఎదుట ఎప్పటికీ కనిపిస్తాయి గాక!

[16] ఎందుకంటే, అతడు గుండె బ్రద్దలైనవాణ్ణి, దీనదశలో, అక్కరలో ఉన్నవాణ్ణి హింసించాడు. అతణ్ణి చంపాలని చూశాడు. అలాంటివారి మీద దయ చూపాలనే తలంపే అతడికి రాలేదు.

[17] శాపం చెప్పడం అతడికి చాలా ఇష్టం. అందుకని ఆ శాపమే అతడిమీదికి వచ్చింది. ఆశీర్వచనం చెప్పడం అతడికి బొత్తిగా ఇష్టం లేదు. అందుచేత అది అతడికి దూరంగానే ఉండిపోయింది.

[18] శాపాన్ని వస్త్రంలాగా చుట్టుకొన్నాడు. అది నీళ్ళలాగా అతడి కడుపులోకి చొరవ చేసుకుపోయింది. నూనెలాగా అతడి ఎముకల్లోకి దూరింది.

[19] తాను కప్పుకొనే దుస్తులలాగా, ఎప్పుడూ కట్టుకొనే నడికట్టులాగా అతణ్ణి శాపం అంటిపెట్టుకొని ఉంటుంది గాక!

[20] నా శత్రువులకు, నాకు విరోధంగా మాట్లాడే వాళ్ళకు యెహోవావల్ల ప్రతీకారమే కలుగుతుంది గాక!

[21] యెహోవా ప్రభూ, నీ పేరుకోసం నాకు సహాయం చెయ్యి. నీ అనుగ్రహం శ్రేష్ఠమైనది గనుక నన్ను విడిపించు.

[22] నేను దీనావస్థలో, అక్కరలో ఉన్నాను. నా హృదయంలో పొడుచుకున్నట్టుంది.

[23] సాయంత్రం నీడలాగా నేను గతించిపోతూ ఉన్నాను. మిడతలాగా నేను దులిపివేయబడ్డాను.

[24] ఉపవాసం ఉండడంచేత నా మోకాళ్ళకు బలం లేకుండా పోయింది. నా శరీరం లావు తగ్గింది, చిక్కిపోయింది.

[25] వాళ్ళ నిందలకు గురి అయ్యాను నేను. నన్ను చూచి తల పంకిస్తారు.

[26] యెహోవా! నా దేవా! నాకు సహాయం చెయ్యి. నీ అనుగ్రహాన్ని బట్టి నన్ను కాపాడు.

[27] ఇందులో వాళ్ళు నీ చెయ్యి గుర్తుపట్టేలా చెయ్యి. యెహోవావైన నీవే అలా చేశావని తెలుసుకొనేలా చెయ్యి.

[28] వాళ్ళు నన్ను శపిస్తారు గాని నీవు నన్ను దీవిస్తావు. వాళ్ళు విజృంభించినప్పుడు అవమానం పాలౌతారు. కానీ నీ సేవకుడు సంతోషిస్తాడు.

[29] నా విరోధులను అవమానం ఆవరిస్తుంది. సిగ్గు వాళ్ళకు వస్త్రమై వాళ్ళను కప్పుతుంది.

[30] నా నోరారా యెహోవాకు అధికంగా కృతజ్ఞత అర్పిస్తాను. అనేకుల మధ్య ఆయనను స్తుతిస్తాను.

[31] దీనావస్థలో ఉన్నవాడి పక్షాన ఆయన కుడివైపున నిలబడతాడు. అతణ్ణి తీర్పుకు గురి చేసేవాళ్ళ బారినుంచి అతడి ప్రాణాన్ని కాపాడుతాడు.

కీర్తనలు — Chapters