[1] రండి, యెహోవా సంకీర్తనం ఉత్సాహంతో చేద్దాం పట్టండి. మన రక్షణకు ఆధారశిల అయిన ఆయన్ను గురించి ఆనంద ధ్వనులు చేద్దాం.
[2] కృతజ్ఞతతో ఆయన సన్నిధానంలోకి వద్దాం. కీర్తన రూపంలో ఆయన్ను గురించి ఆనంద ధ్వనులు చేద్దాం.
[3] యెహోవా గొప్ప దేవుడు. దేవుళ్ళందరి పైగా ఉన్న మహారాజు.
[4] ఆయన చేతిలో భూమి యొక్క అగాధ స్థలాలన్నీ ఉన్నాయి. పర్వత శిఖరాలూ ఆయనవే.
[5] సముద్రం కూడా ఆయనదే. దానిని సృజించినది ఆయనే. తన చేతులతో ఆరిన నేలను నిర్మించాడు.
[6] రండి, సాగిలపడి ఆయనను ఆరాధన చేద్దాం. మన సృష్టికర్త అయిన యెహోవా ఎదుట మోకరిల్లుదాం.
[7] ఆయన మన దేవుడు. మనం ఆయన పోషించే ప్రజలం, ఆయన చేతిక్రింది గొర్రెలం.
[8] ఈ రోజు ఆయన స్వరం మీరు వింటే, మీ పూర్వీకుల్లాగా మీ గుండె బండబారిపోయేలా చేసుకోకండి. మెరీబా దగ్గర, ఎడారిలో మస్సా దగ్గర ఉన్న సమయంలో,
[9] “వారు నన్ను శోధిస్తూ పరీక్షించారు. నా కార్యకలాపాలు చూశారు కూడా.
[10] నలభై సంవత్సరాలు నేను ఆ తరంవారితో విసికి వేసారిపోయాను. వారి హృదయాలు ఎప్పుడూ పెడత్రోవ పట్టుతున్నాయి. నా త్రోవలు వాళ్ళు ఎరగనే ఎరుగరు అన్నాను.
[11] గనుక నేను ఆగ్రహంతో వారు నా విశ్రాంతి స్థలంలో చేరరు అని శపథం చేశాను” అని యెహోవాఅంటున్నాడు.