[1] యెహోవా! నీవు నీ దేశాన్ని దయతో చూశావు. యాకోబు వంశీకులు చెరలో ఉన్నప్పుడు నీవు వారిని వెనక్కు రప్పించావు.
[2] నీ ప్రజల ఆపరాధాలు క్షమించావు. వారి పాపాలన్నీ నీవు కప్పివేశావు. (సెలా)
[3] కోపపడడం పూర్తిగా మానుకొన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొన్నావు.
[4] మా రక్షణదాతవైన దేవా! మా వైపుకు మరలి రా! మా మీద ఉన్న నీ కోపం చాలించు!
[5] ఎల్లప్పుడూ మామీద ఇలా కోపపడుతావా? తరతరాలుగా నీ కోపం ఇలా పొడిగిస్తావా?
[6] నీ ప్రజలు నీమూలంగా ఆనందించేలా నీవు మళ్ళీ మమ్మల్ని బ్రతికించవా?
[7] యెహోవా! నీ అనుగ్రహం మాకు చూబెట్టు! నీ రక్షణ మాకు అనుగ్రహించు!
[8] యెహోవా దేవుడు ఏమి చెప్తాడో అది నేను వింటాను. ఆయన తన ప్రజలకు, తన భక్తులకు శాంతి వాక్కులు పలుకుతాడు. అయినా, వారు మళ్ళీ మూర్ఖులు కాకూడదు.
[9] ఆయన అంటే భయభక్తులున్న వారికి ఆయన రక్షణ అతి సమీపం. తద్వారా మన దేశంలో మహత్యం ఉంటుంది.
[10] కృప, సత్యం కలుసుకొన్నవి. న్యాయం, శాంతి ఒకదానికొకటి ముద్దెట్టుకొన్నాయి.
[11] భూమిలో నుంచి సత్యం మొలకెత్తుతుంది. ఆకాశం నుంచి న్యాయం క్రిందికి చూస్తుంది.
[12] యెహోవా మేలైనదాన్ని ఇస్తాడు. మన భూమి ఫలిస్తుంది.
[13] న్యాయం ఆయనకు ముందుగా నడుస్తుంది. అది ఆయన అడుగులు మనకు మార్గంగా చేస్తుంది.